27.7 C
Hyderabad
April 25, 2024 07: 54 AM
Slider నిజామాబాద్

షబ్బీర్ అలీ ఆస్తులపై సంచలన వ్యాఖ్యలు చేసిన గంప

#gampagovardhan

‘షబ్బీర్ అలీ.. దమ్ముంటే నీ ఆస్తులు.. నీ తమ్ముని ఆస్తులు.. నీ నాయకుల ఆస్తులు  ప్రజల ముందు పెట్టు.. నా ఆస్తులు కూడా బయటపెడుతా.. ఇద్దరి ఆస్తులను కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు పంచేద్దామా షబ్బీర్ అలీ..’ అంటూ కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాజీ మంత్రి షబ్బీర్ ఆలీకి సవాల్ విసిరారు. బిక్కనూర్ మండలం పొందుర్తి శివారులోని ఓ ఫామ్ హౌస్ లో మాచారెడ్డి మండల నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మాజీ మంత్రి షబ్బీర్ ఆలీపై నిప్పులు చెరిగారు. కామారెడ్డి నియోజకవర్గానికి షబ్బీర్ అలీ చేసిందేమీ లేదన్నారు. కామారెడ్డి ప్రజలు రెండుసార్లు గెలిపిస్తే షబ్బీర్ అలీ మంత్రి అయ్యారని, మంత్రి అయ్యాక ఆయన, ఆయన తమ్ముడు, కుటుంబ ఆస్తులు పెంచుకున్నారు తప్ప ప్రజలకు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా గంప గోవర్ధన్ పై షబ్బీర్ అలీ 9 అంశాలతో చార్జీ షీట్ విడుదల చేసారు.

తనపై విడుదల చేసిన చార్జీ షీట్ పై గంప గోవర్ధన్ నిప్పులు చెరిగారు. నియోజకవర్గంలో 99 గ్రామ పంచాయతీలు, ఒక మున్సిపాలిటీ ఉందని, తనపై అవినీతి నిరూపించాలని సవాల్ విసిరారు. పొందుర్తి చెక్ పోస్ట్ వద్ద కార్యకర్తలను పెట్టి డబ్బులు వసూలు చేస్తారని చేసిన ఆరోపణలపై దమ్ముంటే వీడియోలు తీసి ప్రజల ముందు పెట్టాలన్నారు.1000 కోట్లు ఆస్తులు సంపాదించుకున్నావ్ కదా అబద్ధాలు ఎందుకు షబ్బీర్ అలీ అని నిలదీశారు.

నువ్వు.. నీ భార్య ఏమైనా పొలాల్లో కలుపు తీయడానికి వెళ్లి సంపాదించారా అని ప్రశ్నించారు. దమ్ముంటే తన ఆస్తులపై కోర్టులో పిటిషన్ వేసి బయటకు తీయాలన్నారు. నా ఆస్తుల వివరాలు ఎన్నికల సమయంలో గాంధీ గంజిలో చెప్పాను.  మరోసారి కూడా నా ఆస్తులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా.. నీ ఆస్తులు నీ తమ్ముడు.. నీ నాయకుల ఆస్తులు బయట పెట్టు షబ్బీర్ అలీ అని సవాల్ చేశారు.

తన ఆస్తులెంతైనా ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, మళ్ళీ గంప గోవర్ధన్ గా బస్వపూర్ బ్రతకగలుగుతా తప్ప లుచ్చా పనులు మాత్రం చేయనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘నాకు హైదరాబాదులో ఇల్లు లేదని గతంలో కూడా చెప్పిన.. ఇప్పుడు కూడా చెప్తున్నా.. కామారెడ్డి, బస్వాపూర్ లో తప్ప నాకు ఇళ్ళు ఎక్కడ లేదు. నీలాగా ఆస్తులు వెనకేసుకోలేదు’ అని పేర్కొన్నారు. మగతనం ఉండబట్టే ప్రజలకు సేవ చేస్తున్నానని, మోసపూరిత మాటలు చెప్పలేదని, ముక్కుసూటిగా మాట్లాడిన తప్ప దొంగ మాటలు చెప్పలేదని, కాని పనులు అవుతాయని చెప్పి తిప్పుకుని దొంగదెబ్బ కొట్టలేదన్నారు.

షబ్బీర్ అలీ హయాంలో అభివృద్ధి జరిగిందో.. తన హయాంలో జరిగిందో చూడాలని, ఈ విషయంపై దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు ముందుకు రావాలన్నారు. కామారెడ్డి ప్రజలకు షబ్బీర్ అలీ ఏం చేశారో చెప్పాలని, ఆస్తులు పెంచుకుని కామారెడ్డి ప్రజలకు గుండుసున్న పెట్టారన్నారు. అందుకే కామారెడ్డి ప్రజలు ప్రజలు షబ్బీర్ అలీని బొంద పెట్టారని, ఇక షబ్బీర్ అలీ ఎన్నటికీ గెలవలేరని, ఎప్పటికి అక్కడే ఉంచుతారని జ్యోస్యం చెప్పారు.

రేవంత్ రెడ్డిది టిఆర్ఎస్ పుట్టుక

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పుట్టుకనే టిఆర్ఎస్ అన్నారు. ముందు ఆయన జడ్పీటీసీగా గెలిచారని, తర్వాత టిఆర్ఎస్ మద్దతుతో ఎమ్మెల్సీగా గెలిచి తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారన్నారు. నాలుగేళ్ళ క్రితం ఎంపీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారని తెలిపారు. అలాంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ విధానాలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు.

Related posts

ఆశల తొలకరి

Satyam NEWS

సురక్షితంగా మీ గమ్యస్థానాలకు చేరుకోవాలి

Bhavani

తెలంగాణ రైతు సంఘం ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మే డే

Satyam NEWS

Leave a Comment