27.7 C
Hyderabad
April 25, 2024 07: 18 AM
Slider ప్రత్యేకం

జీహెచ్ఎంసి ఎన్నికలకు అస్త్రశస్త్రాలు సిద్ధం

ghmc ele

డిసెంబర్ 1 న జరుగనున్నహైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీ హెచ్ ఎమ్ సీ) ఎన్నికలసమరంలో తలపడేందుకు రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.

జీహెచ్ ఎమ్ సీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో విజయం సాధించగల అభ్యర్థుల ఎంపికలో రాజకీయ పార్టీలు తలమునకల వుతున్నాయి. ఒక్కోడివిజన్ నుంచి పోటీచేసేందుకు వందల సంఖ్యలో ఔత్సాహికులు రాజకీయ పార్టీలను ఆశ్రయిస్తున్నారు.
రిజర్వేషన్లకు అనుగుణంగా ఆయావర్గాలకు చెందిన అభ్యర్థులఎంపిక కసరత్తులో అంగబలం, అర్ధబలం ప్రాథమిక ప్రాధాన్యత సంతరించుకోవడం సర్వసాధారణం. ఈ ప్రక్రియలో ప్రాంతీయ, జాతీయపార్టీలేవీ మినహాయింపు కాదు.

వామపక్షాలు సైతం గెలుపుగుర్రాలను ఎన్నికల్లో నిలిపేక్రమంలో సైద్ధాంతిక విభేదాలు విడిచి బూర్జువా పార్టీలతో చేతులు కలపడం విచిత్రం. తాజాగా దుబ్బాక ఉపఎన్నిక ఫలితం పాలకతెరాస పార్టీకి దిగ్భ్రాంతి కలిగించింది. పార్టీకి చెందిన ముఖ్యనేత , మంత్రి హరీష్ రావు భుజానవేసుకున్నా బీజేపీ అనూహ్యవిజయాన్ని తెరాస నిలువరించలేకపోయింది.

ఇక కాంగ్రెస్ డిపాజిట్ సైతం కోల్పోవడం ఆ పార్టీకి తగిలిన గట్టిదెబ్బ. దుబ్బాక విజయం ఇచ్చిన ఉత్సాహంతో… జరుగనున్న జీ హెచ్ ఎమ్ సీ ఎన్నికలలో గెలిచేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది. 2019 లోకసభ ఎన్నికలలో బీజేపీ 4 స్థానాలు కైవసం చేసుకుని సర్వేలఅంచనాలు తిప్పికొట్టింది.

తెరాస, ఎంఐఎం పొత్తు జీహెచ్ఎమ్ సీ ఎన్నికలలో బీజీపీ విజయావకాశాలను ప్రభావితం చేయగలవని ఆ పార్టీ విశ్వసిస్తోంది. దీనికితోడు తెరాస ప్రభుత్వం గత ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. తెరాస కు అసలైన ప్రత్యమ్నాయం బీజీపీ మాత్రమేనని ఆ పార్టీ ప్రచారం ముమ్మరం చేస్తోంది.

టీఆర్ఎస్ పాలనకు ఇది రిఫరెండమే


తెరాస పాలనకు రిఫరెండం గా జీ హెచ్ ఎమ్ సీ ఎన్నికల ఫలితాలు ఉండగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. మౌలికసదుపాయాల కల్పన, లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ కేటాయింపు, కోవిడ్ -19 నివారణచర్యలు,
ప్రభుత్వంలో పేరుకున్న అవినీతి వంటి అంశాలు జీహెచ్ ఎమ్ సీ ఎన్నికలలో తీవ్ర ప్రభావంచూపగలవని పరిశీలకుల భావన.
కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులు,టీ జె ఎస్,జనసేన పార్టీల గెలుపు అవకాశాలు తెరాస,బీజేపీ పార్టీల వ్యూహప్రతివ్యూహాలపై
ఆధారపడి ఉంటుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

జీహెచ్ఎమ్ సీ ఎన్నికల వ్యయం విషయంలో అభ్యర్థులు పారదర్శకంగా వ్యవహరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచిస్తోంది.
నిబంధనల ప్రకారం రూ.5 లక్షలకు లోబడే ఖర్చు చేయా లని, ఎన్నికలవ్యయంపై గట్టి నిఘా ఉండగలదని ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. నిబంధనలు బేఖాతరు చేయాల్సిన ఆవశ్యకతను రాజకీయపార్టీలు పట్టించుకోవడం లేదన్నది కఠోరసత్యం. ఎన్నికలలో కోట్లాది రూపాయలు మంచినీళ్ళు ప్రాయంగా వ్యయంచేయడానికి అభ్యర్థులు పోటీపడుతుంటారు.


పార్టీ బీ ఫామ్ పొందడం మొదలు ప్రచారనిర్వహణ అంకంలో విపరీత ధనవ్యయం కావడం సర్వసాధారణం. ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బు, మద్యం ఏరులై పారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నికల ఖర్చు విషయంలో పిసినారితనాన్ని దూరంపెట్టడం అన్ని రాజకీయపార్టీలకు తప్పని విషయం. నిఘా ఉందన్న భయం లేకపోవడంతో పాలకపార్టీ అభ్యర్థులు సైతం విచ్చలవిడిగా డబ్బు పంపిణీకి తెగించడం కొత్తేమీ కాదు. ఎన్నికలు లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించడం దుర్లభం. కానీ ఎన్నికల క్రతువులో కోట్లాది రూపాయల నల్లధనం చలామణీలోకి రావడం విశేషం.

భారతదేశంలో ఎన్నికలు చాలా ఖరీదైన ప్రక్రియగా పరిణమించాయని ప్రజాస్వామ్యప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగబలం, అర్ధబలం తో పాటు అధికార దుర్వినియోగం ఎన్నికలను యథేచ్ఛగా శాసిస్తున్నాయని సర్వత్రా వినిపిస్తోంది.


ప్రభుత్వమే ఎన్నికల ఖర్చులు భరిస్తే ఉత్తమ అభ్యర్థులు పోటీచేసే వీలుంటుందని..తద్వారా మంచి నేతలు ఎంపిక కాగలరని మేథావి వర్గాలు చాలాకాలంగా తమ వాదాన్ని వినిపిస్తున్నాయి.


కానీ…. ఒకే తాను ముక్కలైన రాజకీయపార్టీలు అటువంటి సంస్కరణలు స్వాగతించడానికి అంగీకరించవన్నది జగమెరిగిన సత్యం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంగా ఖ్యాతి గడించిన భారతదేశ రాజకీయాలలో కులమత తత్త్వాలు, ధనస్వామ్యం తో పాటు నేరచరితులఅక్రమ చొరబాట్లకు సకలరాజకీయ పార్టీలూ బాధ్యతవహించక తప్పదు.

ఎన్నికలలో రిజర్వేషన్లు ఒక తంతుమాత్రమే. ఒకవేళ … మహిళాఅభ్యర్థులు గెలిచినా వారి భర్తలు లేదా ఇతర కుటుంబసభ్యుల చేతిలోకి అధికారం బదిలీ కావడం చూస్తున్నాం. రిజర్వేషన్ స్థానాలలో గెలిచిన సంబంధించిత అభ్యర్థులకు కూడా స్వంత అభిప్రాయాలు ఉండే అవకాశం చాలా తక్కువ. పార్టీ పెద్దల అదుపాజ్ఞలలో వారు వ్యవహరించాల్సిందే.

ప్రజాస్వామ్య భారతంలో అణువణువూ సంస్కరిచాల్సిన అవసరాన్ని విద్యావేత్తలు, మేథావులు , సామాజికరంగ ప్రముఖులు తదితర సంఘ సంస్కరణాభిలాషులు ఇప్పటికైనా గుర్తించాలి. లేదంటే…” మేడిపండు చూడ మేలిమై వుండు…పొట్ట విప్పిచూడ పురుగులు వుండు” …అన్న వేమన్న వేదంతో సమకాలీన రాజకీయాలను సరి పోల్చవచ్చు.

పొలమరశెట్టి కృష్ణారావు

Related posts

కరోనా కాలంలో కూడా ఆర్ధిక మండలి విశేష ప్రగతి

Satyam NEWS

అభయాంజనేయ ఆలయనిర్మాణానికి ప్రతిష్టాపన

Satyam NEWS

మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతుతోనే సీఎం ఎంపిక

Bhavani

Leave a Comment