ప్రముఖ పుణ్యక్షేత్రాలకు జీసీసీ బ్రాండ్‌తో కూడిన కుంకుమ ప్యాకెట్లను సరఫరా చేయాలని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నిర్ణయించింది. ఇందులోభాగంగా ఇప్పటికే పలు పుణ్యక్షేత్రాలకు కుంకుమ సరఫరా చేస్తుండగా ఇక నుంచి పూర్తిస్థాయిలో అన్ని పుణ్యక్షేత్రాలకు పంపించాలని ఆలోచన చేస్తోంది. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లోని పలు పుణ్యక్షేత్రాల ఆలయ కమిటీలతో చర్చించి వారి అవసరాలకు అనుగుణంగా ప్రతి ఏడాది పంపించాలని జీసీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఇందులోభాగంగా దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తోంది. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయానికి జీసీసీ కుంకుమను సరఫరా చేసేందుకు యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. అయితే భారీ స్థాయిలో సరఫరా చేయాల్సి ఉన్నందున టెండర్లకు వెళ్లాల్సి ఉంటుంది.
అందువల్ల దీనికి తగినట్టుగా అధికారులు తిరుమల దేవస్థానం ఉన్నతాధికారులతో చర్చించిన మీదట కుంకుమ సరఫరా అంశాన్ని పరిశీలించాలని ఆలోచన చేస్తోంది. ఇప్పటికే అన్నవరం, శ్రీకాళహస్తి, గుంటూరు, విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయాలకు జీసీసీ బ్రాండ్ తో కుంకుమను సరఫరా చేస్తోంది. ఇదే తరహాలో భద్రాచలం, రామతీర్థాలు, అరసవిల్లి, శ్రీకూర్మం, విశాఖ నగరంలోని శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం, ద్రాక్షారామం తదితర ప్రముఖ ఆలయాలకు ఇక్కడ నుంచి కుంకుమ సరఫరా చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇదే తరహాలో తెలంగాణాలోని ప్రముఖ దేవస్థానాలకు దీనిని పంపించేందుకు సన్నాహాలు చేస్తోంది. కుంకుమ తయారీకి ముడిసరుకుగా ఉపయోగించే పసుపు పంటను గిరిజన ప్రాంతాల్లో విస్తారంగా పండించే విధంగా గిరిజన రైతులను ప్రోత్సహించాలని కూడా ఆలోచన చేస్తోంది. ఇందుకోసం అనువైన ప్రాంతాలను గుర్తించి అక్కడ నివశించే గిరిజనులతో పసుపు పంటను విస్తారంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా జీసీసీ అధికారులు నిర్ణయించారు. ముందుగా పసుపు పంటను విశాఖ జిల్లా పాడేరు, అరకు, విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం, తూర్పు గోదావరి జిల్లాలో రంప చోడవరం తదితర ప్రాంతాల్లో ప్రోత్సాహించాలని నిర్ణయించింది.