32.2 C
Hyderabad
April 20, 2024 19: 44 PM
Slider సంపాదకీయం

అప్పుల అంధ్రప్రదేశ్ ను ఆ దేవుడే కాపాడాలి

#YSJaganmohanReddy

అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రిజర్వుబ్యాంకు తో సహా ఏ బ్యాంకు కానీ, కేంద్ర ప్రభుత్వంతో సహా ఏ ప్రభుత్వం కానీ ఆదుకోలేని దుస్థితికి చేరిపోయింది. ఆర్ధిక క్రమశిక్షణారాహిత్యాన్ని ఆదిలోనే అడ్డుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో ఆ సాహసం చేయలేకపోయింది. రాజకీయాలు పక్కన పెట్టి కేంద్ర ఆర్ధిక సంస్థ కనుక దిద్దుబాటు చర్యలు తీసుకుని ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ దుర్గతి వచ్చి ఉండేది కాదు. పెద్దన్న పాత్ర పోషించడంలో కేంద్ర ఆర్ధిక శాఖ పూర్తిగా విఫలం అయింది.

స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ లో కాకుండా వేరే ఎకౌంట్లకు ప్రభుత్వ ఆదాయాన్ని బదిలీ చేస్తున్నప్పుడే కేంద్ర ప్రభుత్వం అడ్డుకుని ఉండాల్సింది. అలా చేయకపోవడం కారణంగా రాష్ట్ర రెవెన్యూ లోటు రికార్డు స్థాయిలో 662.80 శాతానికి చేరుకున్నది. ద్రవ్య లోటు 2021- 22 ఆర్ధిక సంవత్సరం ప్రధమార్ధం లోనే 107.79 శాతానికి చేరుకున్నది. రాష్ట్రానికి ఆదాయం రావడం లేదా అంటే ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వస్తున్నది. పెంచుకున్న పన్నులతో రెవెన్యూ రాబడి గణనీయంగా పెరిగింది.

కేంద్రం నుంచి నిధులు వస్తూనే ఉన్నాయి…

కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు, వాటా నిధులు క్రమం తప్పకుండా అందుతున్నాయి. అయినా సరే ఆర్ధికంగా పరిస్థితి దిగజారుతూనే వస్తున్నది. కారణం… ఆర్ధిక క్రమ శిక్షణ లేకపోవడం రూపాయి ఆదాయానికి పది రూపాయలు ఖర్చు చేస్తుంటే ఏ సంసారమైనా ఇలాగే అఘోరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో అదే జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ కు ఈ ఆర్ధిక సంవత్సరం ప్రధమార్ధంలో రికార్డు స్థాయిలో రెవెన్యూ రాబడి రూ.1,04,804.91 కోట్లు వచ్చింది. గత ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో రెవెన్యూ రాబడి రూ.19,956.17 కోట్లు ఉండగా ఈ ఏడాది ఇబ్బడిముబ్బడిగా వేసిన పన్నులతో రూ.64,871.69 మేరకు రాబడి వచ్చింది.

పన్నులు విపరీతంగా పెంచినా ఏమిటీదరిద్రం?

అయినా ఏమిటీ దరిద్రం? దీనికి కారణం ఏమిటంటే రాబోయే ఎన్నికలలో తమ పార్టీకే ఓట్లు వేయించుకోవడానికి వీలుగా ఇప్పటి నుంచే చేస్తున్న ఖర్చు. వస్తున్న ఆదాయంలో సగానికి పైగా అంటే రూ.50,419.15 కోట్లు ఉచితంగా ఇచ్చే పథకాలకు ఖర్చు చేస్తున్నారు. ఈ ఉచిత పథకాలన్నీ కూడా అనుత్పాదక పథకాలే. ఏదైనా రాష్ట్రానికి భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా స్కీములు రూపొందించి అమలు చేయడం వాటికి సబ్సిడీగానో రుణంగానో నిధులు సమకూర్చి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి సాయం చేయడం ప్రభుత్వాలు చేయాల్సిన పని.

ఒక సారి ప్రభుత్వ నుంచి సాయం పొందిన వారు దాని ఆసరాగా సొంత కాళ్లపై నిలబడే విధంగా స్కీమ్ రూపొందించాలి. అలాంటి స్కీమ్ లు ప్రవేశ పెడితే ప్రజలు అడుక్కుతినే స్థితి నుంచి తమ కాళ్లపై తాము నిలబడే విధంగా రూపొందుతారు. తద్వారా సమాజం మొత్తం పురోగమిస్తుంది. అయితే అలా కాకుండా ఇంట్లో కూర్చోబెట్టి బ్యాంకులో డబ్బులు వేస్తూ ఉంటే, ఎవరూ ఏ పని చేయకుండా ఉంటే సమాజంలో మానవ ఉత్పాదకత పడిపోతుంది.

ఆంధ్రప్రదేశ్ లో ఇదే జరుగుతున్నది. గతంలో కేంద్రంలో ఇలాంటి పథకాలు చాలా ఉండేవి. అయితే పి వి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు సరళీకృత ఆర్ధిక విధానాలు రూపొందించే సమయంలో ఇలాంటి అనుత్పాదక పథకాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ పోయారు. సబ్సిడీలను క్రమేపీ తగ్గిస్తూ పోయారు. దాంతో దేశం అడుక్కుతినే పరిస్థితి నుంచి గణనీయమైన ప్రగతిని సాధించింది.

ఎన్ని చెప్పినా…. ఎందరు చెప్పినా…..

ఓట్ల గురించి ఆలోచించకుండా దేశం గురించి ఆలోచించే వారు పి వి నరసింహారావులాగా, ఆ తర్వాత ప్రధానిగా వచ్చిన వాజ్ పేయి లాగా నిర్ణయాలు తీసుకుంటారు. వీరిద్దరి తర్వాత ప్రధాని అయిన డాక్టర్ మన్ మోహన్ సింగ్ మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చి దేశం మరింత అభివృద్ధి సాధించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. అయితే ఓట్లే పరమావధిగా పని చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎవరు ఎన్ని చెప్పినా ఉచితంగా డబ్బులు ఇవ్వడం మానుకోవడం లేదు.

ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకపోయినా అప్పులు తెచ్చి మరీ స్కీములు నడుపుతున్నారు. ఈ స్కీముల అమలులో తీవ్రమైన అవినీతి చోటు చేసుకుంటున్నదని ఆరోపణలు వస్తున్నా కూడా ఆయన వెనక్కి తగ్గడం లేదు. 2021-22 బడ్జెట్ లో ఈ ఏడాది రెవెన్యూ లోటు రూ.5000.08 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. అయితే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలోనే రెవెన్యూ లోటు రూ.33,140.62 కోట్లకు చేరింది. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ.18,434.15 ఉంటుందని అంచనా వేయగా అది రూ.35,540.44 కోట్లకు చేరుకున్నది. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.37,029.79 కోట్లు అప్పుగా తీసుకోవాలని బడ్జెట్ లో ప్రతిపాదించగా తొలి ఆరు నెలల్లోనే తీసుకున్న అప్పు రూ.39,914.15 కోట్లకు చేరింది.

నెపం గత ప్రభుత్వాలపై నెట్టడంతో సరిపోదు…

గత ప్రభుత్వం వదిలిన అప్పులతో పరిస్థితి దిగజారిందని చెప్పడం సమర్థనీయం కాదు. రాష్ట్ర విభజన సమయంలో వచ్చిన అప్పుల కారణంగా పరిస్థితి దిగజారిందని చెప్పడం కూడా ఎవరూ హర్షించరు. దారుణమైన ఆర్ధిక పరిస్థితికి కారణం దుబారా ఖర్చులే. కేవలం ఓటర్లను ఆకట్టుకోవడానికి దోచిపెడుతుంటే పరిస్థితి ఇలానే ఉంటుంది. ఇప్పటికి కళ్లు తెరిచిన కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు నిర్దేశించిన మేరకు నిధులు ఖర్చు చేయనందున రాష్ట్ర ప్రభుత్వానికి రుణ పరిమితి పెంచేందుకు నిరాకరించింది. రిజర్వు బ్యాంకు కు కూడా చెప్పకుండా రుణాలు తెచ్చుకునే సంస్కృతి రావడమే తప్పు… ఇప్పుడు వగచి ప్రయోజనం లేదు. ఆంధ్రప్రదేశ్ ను ఆ దేవుడే కాపాడాలి.

Related posts

వెలుగురేకై పల్లవించాలి

Satyam NEWS

శ్రీశైల మల్లన్న కు కాణిపాకం నుంచి పట్టువస్త్రాలు

Satyam NEWS

ఐజేయూ జర్నలిస్టుల పోరు బాట

Satyam NEWS

Leave a Comment