రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో 151 స్థానాలతో విజయం సొంతం చేసుకున్న తక్షణమే ఎంఎల్ ఏలను సమావేశ పరిచిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేవుడు మంచి స్క్రిప్టు రాశాడని అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వైసిపి నుంచి 23 మంది ఎంఎల్ ఏ లను అక్రమంగా పార్టీ ఫిరాయించేలా చేయించి తన పార్టీలో కలుపుకున్నారని, ఎన్నికలలో దేవుడు మంచి స్క్రిప్టు రాసి చంద్రబాబునాయుడి కి అదే 23 స్థానాలు వచ్చేలా చేశాడని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు మాత్రమే ఇవ్వడం దేవుడి స్క్రిప్టు అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు దేవుడి స్క్రిప్టు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేను తన వైపు నకు గుంజుకుంటే దేవుడి స్క్రిప్టు లో ఉన్న 23 మంది ఎం ఎల్ ఏలు చంద్రబాబుకు లేకుండా చేస్తున్నారు. అయితే తన పార్టీలో చేర్చుకోకుండా సపరేట్ గా వారిని ఉంచుతూ తన గేమ్ ప్లాన్ కొనసాగిస్తున్నారు.
తాజాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మద్దాల గిరి కంచె దాటారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆయన కలిశారు. తన అనుచరులతో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. గుంటూరు లో ఈ రోజు చంద్రబాబు పర్యటన ఉండగా దానికి ఎమ్మెల్యే మద్దాల గిరి హాజరు కాలేదు. మద్దాల గిరి హాజరు కాకపోవడంపై గుంటూరు టిడిపి నాయకులు చంద్రబాబు ప్రశ్నించగా ఎక్కడున్నాడో తెలియదు అంటూ సమాధానం చెప్పలేక పోయారు. సాయంత్రానికి గిరి గోడ దూకారు.