27.7 C
Hyderabad
May 21, 2024 03: 32 AM
Slider ముఖ్యంశాలు సంపాదకీయం

పోరాట యావ చచ్చిన కమ్యూనిస్టులు

10slde3

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ శూన్యాన్ని భర్తీ చేసుకునే సువర్ణ అవకాశాన్ని కమ్యూనిస్టులు చేజేతులా చెడగొట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఉంది. బిజెపి కేంద్రంలో ఉన్న అధికారం మొత్తాన్ని ఉపయోగిస్తున్నా తెలంగాణ లో ఆశించిన ఫలితాలు రావడం కష్టంగా ఉంది. ఈ స్థితిలో రాజకీయ శూన్యాన్ని కమ్యూనిస్టులు సులభంగా భర్తీ చేయవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామానా ఇంకా కమ్యూనిస్టు పార్టీలకు కార్యకర్తలు ఉన్నారు.

అంగన్ వాడీ వర్కర్ల నుంచి అన్ని యూనియన్లలో కమ్యూనిస్టుల భాగస్వామ్యం బాగనే ఉంది. కమ్యూనిస్టులు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఆందోళన చేయాలన్నా పిలవకుండానే వందల సంఖ్యలో సానుభూతిపరులు ఆ కార్యక్రమాలకు హాజరయ్యే వీలుంది. ఇన్ని ఉన్నా కూడా తోక పార్టీగా మిగిలిపోవడానికే కమ్యూనిస్టు పార్టీలు ఇష్టపడుతున్నట్లుగా కనిపిస్తున్నది. తోక పార్టీల స్థాయి దాటి వచ్చేందుకు వారి నాయకత్వం కూడా అంగీకరించడం లేదు.

దాదాపు 40 నుంచి 50 అసెంబ్లీ నియోజకవర్గాలలో గెలుపు ప్రభావితం చేయగల శక్తి ఉన్నా కూడా తోక పార్టీలుగానే కమ్యూనిస్టులు మిగిలిపోవడం చూస్తుంటే బాధ కలుగుతున్నది. కనీసం 20 నియోజకవర్గాలలో 20 నుంచి 30 వేల ఓట్లు ఉభయ కమ్యూనిస్టు పార్టీలకూ ఉన్నాయి. అయితే ఆ ఓట్లను బూర్జువా పార్టీలకు అమ్ముకోవడానికే కమ్యూనిస్టులు ప్రాధాన్యత ఇస్తున్నారు. అదీ కూడా సిద్ధాంతం ముసుగులో చేయడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.

ఇతర బూర్జువా పార్టీల లాగా కమ్యూనిస్టు పార్టీలు సభలు, సమావేశాలు ఇతర ఆందోళనా కార్యక్రమాలు చేసేందుకు డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కార్యకర్తలు స్వచ్ఛంగా వస్తారు. డబ్బు ఖర్చు లేకుండా పార్టీ కార్యక్రమాలు చేసే వెసులుబాటు ఉన్న కమ్యూనిస్టులు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం ఎందుకు చేయలేకపోతున్నారో అర్ధం కావడం లేదు. ప్రజా సమస్యలపై సిద్ధాంత పరమైన ఆలోచనలు ఉన్న కమ్యూనిస్టు పార్టీలు బూర్జువా పార్టీలతో కలిసి ఎందుకు వెళ్లాలో అర్ధం కావడం లేదు.

రాష్ట్రంలో ఇప్పుడు అనేక సమస్యలు ప్రజల గొంతుపై కత్తిలా మారి ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్ర్లలో పలు చోట్ల యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయి. యురేనియం తవ్వకాలపై రెండు రాష్ట్రాలలో కూడా సమర్ధమైన పోరాటం జరగడం లేదు. ఇది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వరంగా మారింది. దీన్ని కమ్యూనిస్టు పార్టీలు చక్కగా వినియోగించుకోవచ్చు. అయితే కమ్యూనిస్టు పార్టీలు ఈ సమస్యను కనీసం రాష్ట్ర స్థాయి సమస్యగా కూడా మార్చలేకపోతున్నాయి.

తెలంగాణ లో ఆర్టీసీ కార్మికుల సమస్య ఇప్పుడు సకల జనుల సమ్మె స్థాయికి వెళ్లే విధంగా పరిపక్వత చెంది ఉంది. దీన్ని కమ్యూనిస్టు పార్టీలు వినియోగించుకోలేకపోవడం వారి దురదృష్టం. కరెక్టుగా సమయానికి కేసీఆర్ వేసిన ఉచ్చులో ఇరుక్కుపోయి హుజూర్ నగర్ ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీకి మారు మద్దతు ఇవ్వాల్సి వస్తున్నది. సిఎం కేసీఆర్ రాసిన స్ర్కిప్టులో కమ్యూనిస్టులు పావులుగా మారిపోయారు.

పాత ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పోడు భూముల సమస్యలు క్లయిమాక్సుకు చేరాయి. అయినా వాటిని వినియోగించుకుని ఇటు ప్రజలకు అటు పార్టీకి ఉపయోగపడే స్థితిలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు లేరు. కొత్త రెవెన్యూ చట్టం, ఉద్యోగుల సమస్యలు ఇలా రకరకాల ప్రజా సమస్యలు తెలంగాణ లో తిష్టవేసి ఉన్నాయి. వీటిపై చిత్తశుద్ధితో పోరాటం చేస్తే ప్రజలు ఆదరించే అవకాశం ఉంది. అయితే కమ్యూనిస్టు పార్టీ నాయకులు బూర్జువా పార్టీలతో స్నేహంగా ఉండటానికి, తద్వారా పనులు చేయించుకుని పబ్బం గడుపుకోవడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. పోరాటం చేయాలనే యావ కమ్యూనిస్టు పార్టీలలో చచ్చిపోయింది. ఇది ప్రజా ఉద్యమాలకు కూడా అడ్డుగా మారింది. కమ్యూనిస్టు పార్టీలు చురుగ్గా పోరాట పటిమతో ఉంటే అధికార పార్టీలు ఇంతగా బరితెగించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు.

Related posts

సమస్యల పరిష్కారం దిశగా పని చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం

Satyam NEWS

పోలీస్ అమరవీరుల త్యాగం అజరామరం

Satyam NEWS

నల్లకుంట డివిజన్ లో కొత్త రోడ్లకు శంకుస్థాపన

Satyam NEWS

Leave a Comment