28.7 C
Hyderabad
April 25, 2024 05: 27 AM
Slider ప్రత్యేకం

తెలంగాణ కాంగ్రెస్ కు ఇక మంచి రోజులు….

#gandhibhavan

నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడటంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మార్గం సుగమం అయింది. ఇదేమిటి నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఎలా అనుకుంటున్నారు?

అనేగా మీ ప్రశ్న. కరెక్టే. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటే రాష్ట్ర రాజకీయాలలో విపరీతమైన పరిణామాలు చోటు చేసుకుని ఉండేవి. అంతే కాదు కాంగ్రెస్ పార్టీలో కూడా పెను మార్పులు వచ్చి ఉండేవి. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా మార్పులు జరిగి ఉండేవి.

ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ( రెండో సారి) నూతన పిసిసి అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నుంచి కాంగ్రెస్ అధిష్టాన వర్గం సమాచార సేకరణ జరిపింది. అందులో మిశ్రమ అభిప్రాయం వచ్చింది.

దాంతో మధ్యే మార్గంగా కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు అందరూ కూడా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల తర్వాత పిసిసి అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు అధిష్టానాన్ని ఒప్పించారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావాలని కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కోరుకుంటున్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్లు మాత్రం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వి హనుమంతరావు, జగ్గారెడ్డి లాంటి నాయకులు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కాకుండా అడ్డుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసి నాగార్జున సాగర్ ఉప ఎన్నికను అడ్డం పెట్టారు.

ఈ ఉప ఎన్నికలో సీనియర్ నాయకుడు జానారెడ్డి గెలిస్తే ఆయనను పిసిసి అధ్యక్షుడిని చేయాలనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ల వ్యూహం. ఇప్పుడు జానారెడ్డి ఓటమి పాలయ్యారు. ఒక్క జానారెడ్డి మాత్రమే కాదు… నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఆ పార్టీ సీనియర్ నాయకులు అందరూ ఓడిపోయినట్లే.

వయసు మీరిన ఈ నాయకులే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అమ్ముడు పోయినవాళ్లు, బిజెపి పంచన చేరాలనుకుంటున్న వారితో కాంగ్రెస్ పార్టీ నిండిపోయి ఉంది.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టడం కష్టం వేరే మార్గం ఎన్నుకుందాం అని ఆలోచిస్తున్న వృద్ధులు పార్టీని వదిలి వెళ్లడం లేదు…. పార్టీని పెరగనివ్వడం లేదు. పార్టీని పెంచుదామని ప్రయత్నించిన వారిని తమ కుట్రలతో నిలిపివేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ముఠా తగాదాలు విపరీతంగా ఉంటాయి. ఒకరంటే ఒకరికి పడదు. ఒకరు చేద్దాం అంటే మరొకరు వద్దంటారు. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏం చేసినా అడ్డుకునే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వి హనుమంతరావులు పార్టీ అధిష్టానానికి కూడా కొరకరాని కొయ్యలుగా మారిపోయారు.

వీరిని నమ్ముకుంటే పార్టీ మనగడే కష్టం అయ్యే పరిస్థితి నెలకొన్నది. ఇప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో జానారెడ్డి ఓడిపోవడంతో ఈ నాయకుల ఆటలు ఇక కట్టినట్లే కనిపిస్తున్నది. ఇక ఈ నాయకుల మాటలను కాంగ్రెస్ అధిష్టాన వర్గం పట్టించుకునే పరిస్థితి లేదు.

రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడుగా చేసేయబోతున్నది. పార్టీకి అంకిత భావంతో పని చేస్తున్న సిఎల్ పి నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు లను రేవంత్ రెడ్డితో జత పరిస్తే రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు వస్తాయనడంలో సందేహం లేదు.

పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, సీఎల్ పి నాయకుడుగా మల్లు భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ గా దుద్దిళ్ల శ్రీధర్ బాబు లను అతి త్వరలో నియమిస్తున్నట్లు ఢిల్లీ నుంచి సమాచారం అందింది. రేవంత్ రెడ్డికి అడ్డుపడే వృద్ధుల్ని ఒక పట్టించుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు.

వై సూర్యప్రకాశ్, సత్యం న్యూస్  

Related posts

అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించినవారిని ఉరితీయాలి

Satyam NEWS

పెరిగిపోతున్న చలి: వణుకుతున్న ఉత్తరాది రాష్ట్రాలు

Bhavani

ఢిల్లీ లిక్కర్ స్కామ్: మా అబ్బాయి అమాయకుడు

Satyam NEWS

Leave a Comment