18.3 C
Hyderabad
December 6, 2022 05: 34 AM
Slider నిజామాబాద్

భూములతో దందా చేస్తున్న సర్కార్

#shabbir

ప్రభుత్వ భూములను అమ్ముతూ.. వాటికి వేలం పెడుతూ భూములతో సర్కార్ దందా చేస్తుందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందనన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఈడీ, ఐటి, ఏసీబీ అంటూ దాడులకు తెగబడుతూ ప్రజాసమస్యలను పక్కదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు.

గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధరణి పోర్టల్ రద్దు, రైతు రుణమాఫీ ఇతర కార్యక్రమాలలో భాగంగా కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్కనూర్, కామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఆయా మండల కేంద్రాల్లోని తహసిల్ కార్యాలయ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికి ఇంకా పూర్తి చేయలేదని, ఇంకా 20 వేల కోట్ల రూపాయలు రైతులకు ప్రభుత్వం బాకీ ఉందన్నారు.

ఈ సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురిసాయని, వరి వేస్తే ఉరే అంటూ కేసీఆర్ ప్రభుత్వం వరి వేయనియడం లేదని, వరి కాకుండా ఇంకే పంటలు వేయాలని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వరిపై పంచాయతీ కొనసాగుతుందని తద్వారా రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజల సమస్యలను పక్కదారి పట్టించడం కోసమే ఈడీ, ఐటి దాడులు చేయిస్తున్నారన్నారు.

మీడియాలో కవిత లిక్కర్ స్కామ్ లో చిక్కుకుంది నిజమేనా అంటూ వస్తున్న వార్తలతో ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా అని ప్రశ్నించారు. నిన్న, మొన్న మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులపై జరిగిన ఐటి దాడుల్లో 10 కోట్లు లభించాయని, 100 కోట్ల ఆస్తులకు సంబంధించిన పత్రాలను గుర్తించి సంతకాలు కూడా తీసుకున్నారని తెలిపారు. ధరల పెరుగుదలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నోరు మెదపడం లేదన్నారు. వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి నాయకులను కొంటున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ హయాంలో 25 లక్షల ఎకరాల పేద రైతులకు పంపిణీ చేశామని, ఇప్పుడు ఆ భూములలో సాగు చేసుకుంటుంటే అటవీ అధికారులు వచ్చి దౌర్జన్యంగా ట్రెంచ్ కొడుతున్నారన్నారు. ఆ భూములు లాక్కుని ఫ్యాక్టరీలు కడుతున్నారని ఆరోపించారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా భూములను ప్రైవేటుకు దానం చేస్తున్నారని, తద్వారా ప్రభుత్వం దందా చేస్తుందన్నారు.

సీఎం కేసీఆర్ సొంత గ్రామం చింతమడక ఇంటికి 10 లక్షలు ఇస్తామంటున్నారని, ఆవేమైన కేసీఆర్ ఇంట్లోంచి ఇస్తున్నారా అని నిలదీశారు. చింతమడక గ్రామంలోనే కాకుండా అందరికి ఇవ్వాలని డిమాండ్ చేసారు. కేసీఆర్, కేటీఆర్, కవిత దోచుకుంటు అద్దాల మేడలో ఉంటున్నారని, పేదలకు ఇస్తామన్న డబుల్ ఇళ్ల ఊసే ఎత్తడం లేదన్నారు. అక్కడక్కడ కట్టిన ఇల్లు నాణ్యత లేక కూలడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. రైతుబంధు పథకం 93 శాతం ధనవంతులకే చెందుతుందన్నారు.

పేద రైతులకు ఏమిస్తున్నారు.. ఎక్కడ ఇస్తున్నారు అని నిలదీశారు. ధరణి వెబ్ సైట్ ద్వారా రైతుల కష్టాలు అంతాఇంతా కావన్నారు. గతంలో గ్రామాల్లో మండల కార్యాలయంలోనే సమస్యలు పరిష్కరించేవారని, ఇప్పుడు కలెక్టర్లకు పూర్తి అధికారం ఇవ్వడం వల్ల రైతులు కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారన్నారు. తన పేరున ఉన్న 2.35 ఎకరాల భూమి ధరణి పోర్టల్ నుంచి గాయబ్ అయిందని, చాలా రోజులుగా వెతికితే ఎకరం భూమి వచ్చిందని, మిగతా భూమి అధికారులు వేటుకుతున్నారన్నారు.

తన లాంటి వాడికే ఇలాంటి పరిస్థితి ఉంటే సాధారణ రైతుల సంగతేంటి అని ప్రశ్నించారు. ధరణి పోర్టల్ అన్నదమ్ముల హత్యలకు దారి తీస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏడాదికి ఒకసారి రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తే గ్రామాల్లోని 70 శాతం సమస్యలు పరిష్కారం అయ్యేవన్నారు. రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుందన్నారు. ఈ నెల 30 న నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఉంటుందని, వచ్చే నెల 5 న 4 వేల మంది రైతులతో కలెక్టరేట్ ముట్టడి ఉంటుందన్నారు.

Related posts

మావోయిస్ట్ ల పోస్టర్లు

Sub Editor 2

ఆదివాసి ప్రజలకు అండగా ఉంటాం : ములుగు జిల్లా ఎస్పీ

Satyam NEWS

యువతీ యువకులారా

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!