29.2 C
Hyderabad
March 24, 2023 21: 59 PM
Slider కృష్ణ

క్యాన్సర్ నివారణ, చికిత్సపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

#MT Krishnababu

ప్రజలకు క్యాన్సర్ నివారణ, చికిత్స అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం.టి క్రిష్ణబాబు అన్నారు. అంతర్జాతీయ క్యాన్సర్ నివారణ దినం సందర్భంగా క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అమెరికన్ అంకాలజీ ఇన్ స్టిట్యూట్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన వాకథాన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని వాకథాన్ ను జెండొ ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ళ క్రితం సాంక్రమిక వ్యాధులతో(సిడి) ప్రజలు ఎక్కువగా మరణించే వారని, మారిన జీవన శైలి, పరిస్థితుల్లో ఇప్పుడు అసాంక్రమిక వ్యాధుల(ఎన్సిడి) కారణంగా ఎక్కువ మంది మృత్యువాత పడుతున్న విషయాన్ని గమనించాలన్నారు. సాంక్రమిక వ్యాధులకు సంబంధించి అత్యాధునిక వైద్య చికిత్సలు, ఔషధాలు అందుబాటులోకి రావటంతో ఆ మరణాల సంఖ్యగణనీయంగా తగ్గిందన్నారు.

జీవనశైలి, ఆహారపుటలవాట్ల మార్పు కారణంగా సోకుతున్న క్యాన్సర్, మధుమేహం (యాబెటిస్), రక్తపోటు (బిపి) వంటి అసాంక్రమిక వ్యాధులతో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయన్నారు. ఇరవయ్యేళ్ళ క్రితం ఈ మరణాల సంఖ్య 30 శాతం లోపు వుండగా, ఇప్పుడది 60 శాతానికి పైగా పెరిగిందన్నారు. ఇందుకు ముఖ్యంగా జన్యుపరమైన కారణాల కంటే మన జీవన శైలి లో మార్పే కారణమని ఆయన స్పష్టం చేశారు. ప్రాణాంతకమైన అలవాట్ల వల్ల నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వంటి వాటికి ఎక్కువగా గురవుతున్నారన్నారు. క్యాన్సర్ వ్యాధుల కారణంగా 9 శాతం మంది ప్రజలు మృత్యువాత పడుతున్నారని తాజా అంచనాల ద్వరా తెలుస్తోందన్నారు.

మన రాష్ట్రంలో ఏటా దాదాపు 35 వేల మందికి పైగా క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారన్నారు. మరో 70 వేల మంది కొత్తగా క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారని ఆయన చెప్పారు. ఈ వ్యాధికి ప్రస్తుతం మన వద్ద వున్న చికిత్సా విధానాలు కేవలం జీవన కాలాన్ని పెంచటానికి తప్ప, వ్యాధి నివారణకు, వ్యాధిని తగ్గించటానికి పనికిరావటం లేదన్నారు.

భవిష్యత్తులో క్యాన్సర్ వ్యాధికి పూర్తి స్థాయి చికిత్స అందుబాటులోకి వస్తుందని తాను ఆశిస్తున్నానన్నారు. ఈ పరిస్థితుల్లో క్యాన్సర్ వ్యాధి సోకకుండా మన జీవన శైలిని, అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం వుందన్నారు. ముఖ్యంగా పొగాకు ఉత్పత్తుల్ని వాడడం, అతిగా మద్యాన్ని సేవించడం వంటి దురలవాట్లకు దూరంగా వుండటంతో పాటు శారీరక వ్యాయామాలు పెంచుకోవాల్సిన అవసరం వుందని ఆయన సూచించారు.

దీనితో పాటు ఆహారపుటలవాట్లను మార్చుకుని మంచి పోషకాహారం తీసుకోవాలని సూచించారు. మనది వరి పంట ప్రధాన ఆహారమైన ప్రాంతమని, ఈ ఆహారం ద్వరా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా శరీరంలోకి వెళ్తాయన్నారు. వ్యాయామం, నడక వంటి శారీరక శ్రమ చేయకపోతే మధుమేహంతో పాటు అనేక వ్యాధులకు దారి తీస్తుందని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో 30 ఏళ్ల వయస్సు పైబడిన వారిని అధ్యయనం చేయగా 30 శాతం మందికి బిపి వుందని, 25.60 శాతం మందికి మధుమేహ వ్యాధి వున్నట్లు తేలిందని ఆయన వివరించారు. ఇవి అత్యంత ఆందోళనకరమైన గణాంకాలని ఆయన అన్నారు. మనకు ఒకసారి బిపి, సుగర్ వంటి వ్యాధులు సోకితే పోషకాహారం, సమతుల్యమైన ఆహారం తీసుకోవాలని, నడక, వ్యాయామనం, చిన్నపాటి క్రీడల వంటి శారీరక శ్రమను అనుసరించాలని సూచించారు. దీనితో పాటు ఔషధ సేవనం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. ఔషధాలు తీసుకుంటున్నాం కదా అని శారీరక శ్రమ, వ్యాయామాలు ,

ఆహారపుటలవాట్లను నిర్లక్ష్యం చేస్తే అది ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వాకథాన్ వంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా విద్యార్ధులు, యువత, మధ్య వయస్సు వారిలో జీవనశైలి మార్పు వంటి అంశాలపై చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేయటం అభినందనీయనమన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత ఏడాది క్యాన్సర్ చికిత్సకు రు.430 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని వెల్లడించారు.

క్యాన్సర్ వ్యాధి నివారణకు నెట్ వర్క్ ఆస్పత్రులలో క్యాన్సర్ ను ప్రధాన వ్యాధిగా చేర్చి అనేక వైద్య విధానాలను ప్రవేశపెట్టామని, దేశంలో మరెక్కడా లేని విధంగా స్టేజ్ 1 నుండి స్టేజ్ 4 వరకూ పాలియేటివ్ కేర్ వంటి వైద్య విధానాలను అందుబాటులోకి తెచ్చి ప్రజలకు వ్యాధి బారి నుండి సాంత్వన కలిగించే ప్రయత్నం చేశామన్నారు. వ్యాధిగ్రస్తులకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించటంతో పాటు స్టేజ్ 4 దాటిన వారికి గౌరవ ప్రదమైన మరణాన్ని పొందేందుకు వెసులుబాటు కల్పించామన్నారు.

ఈ అంశాలపై గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు. క్యాన్సర్ చికిత్సలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారుగా నియమించారని, ఆయన సహకారంతో క్యాన్సర్ వ్యాధికి సమగ్ర చికిత్సనందించేందుకు అనువైన ప్రణాళిక రూపొందిస్తున్నామని క్రిష్ణబాబు వెల్లడించారు. అదే విధంగా మన రాష్ట్రంలో వున్న 11 వైద్య కళాశాలల్లో క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన సదుపాయాలను మెరుగుపర్చుకునేందుకు రు.400 కోట్లు ఖర్చు పెట్టి కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు.

క్యాన్సర్ సోకిన తరువాత మనం చేసేది ఏమీ లేనప్పటికీ జీవన నాణ్యత, ప్రమాణాలను పెంచేందుకు అనువైన చికిత్సను అందించగలుగుతున్నామని చెప్పారు. అంతకన్నా ముందు క్యాన్సర్ రాకుండా ఏం చేయగలమన్నది ఆలోచించాలని, దీనికి ముఖ్యంగా జీవనశైలి, ఆహారం, ప్రవర్తనకు సంబంధించిన అలవాట్లు మార్చుకోవాలని, ముఖ్యంగా ధూమపానం, మద్యపానం, ఇతర దురలవాట్లకు దూరంగా వుండాల్సిన అవసరం వుందని ఆయన స్పష్టం చేశారు.

దీనితో పాటు జంక్ ఫుడ్ అలవాట్లను దూరంగా పెట్టి సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాల్సి వుంటుందని అన్నారు. వంటింట్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయకపోతే క్యాన్సర్ మహమ్మారిని మనమే హ్వానించినట్లవుతుందన్నారు. క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు , శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా వుండేందుకు పరిసరాల పరిశుభ్రతను పాటించటం, ఆహారపుటలవాట్లను

మార్చుకోవటం, చెడు అలవాట్లకు దూరంగా వుండటం వంటి వాటిని పాటించాల్సిన అవసరం వుందన్నారు. క్యాన్సర్ వ్యాధి పట్ల మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం వుందని, పూర్తి అవగాహన వుంటే వ్యాధిని ఎదిరించి పోరాడటం సులభ సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. నగరంలోని బిఆర్ టిఎస్ రోడ్లో జరిగిన మారథాన్ 5కె కార్యక్రమంలో దాదాపు 700 మందికి పైగా విద్యార్ధులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, ఎన్ జిఓ ప్రతినిధులు, నగర ప్రజలు పాల్గొన్నారు.

డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎం సుహాసినితో పాటు ఎఓఐ మంగళగిరి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సుబ్బారావు, విజయవాడ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ కోట, రీజనల్ సిఇఓ ఎంవి మహేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

డీఆర్సీ సమావేశంలో విజయనగర సమస్యలపై డిప్యూటీ స్పీకర్ కోలగట్ల

Satyam NEWS

రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసేందుకు పక్కా ప్లాన్

Satyam NEWS

ఈటలను మట్టుపెట్టే ఈ కుట్ర ఎవరిది?

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!