నిర్మల్ పట్టణంలో గణేష్ శోభాయాత్ర కన్నుల పండువగా జరుగుతున్నది. 11 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడు నిమజ్జనానికి తరలి వెళ్ళుతున్నాడు. నిర్మల్ పట్టణంలోని బుధవార్ పేట్ వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, శోభాయాత్రను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా భక్తులతో కలిసి మంత్రి నృత్యం చేసి వారిని ఉత్సాహపరిచారు. అనంతరం చింతకుంట వాడ గణేష్ మండపం వద్ద లక్కిడి జగన్మోహన్ రెడ్డి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. నవరాత్రుల సందర్భంగా విఘ్నేశ్వరునికి నిర్వహించిన పూజలు ఫలించి, గణనాథుని ఆశీస్సులు ప్రతీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలన్నారు. ప్రశాంత వాతావరణంలో శోభాయాత్రను జరుపుకోవాలని, నిమజ్జనం సజావుగా సాగేందుకు పోలీసులకు సహకరించాలని భక్తులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శశిధర్ రాజు, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, తదితరులు ఉన్నారు.