వరంగల్ లోని వేయి స్తంభాల గుడి వేదికగా కాకతీయ కళాక్షేత్రంలో పండగ బతుకమ్మ వేడుకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సంబురాలకు మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. మహిళలు అత్యంత ఇష్టంగా ఆడుకునే ఈ పండుగలో మహిళా మంత్రిగా, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఈ జిల్లాలో పుట్టిన బిడ్డగా నాకు పాల్గొనే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, రాష్ట్ర సాధనలో ముఖ్య పండగ గా బతుకమ్మ పండుగ నేడు అధికారికంగా ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, పండుగలో రాష్ట్ర ఆడపడుచులు సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి గత మూడేళ్ళుగా దాదాపు 1000 కోట్ల రూపాయలతో చీరలు అందిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. పండగకు మహిళలకు చీరలు అందించడం వల్ల వీరికి సంతోషం తో పాటు రాష్ట్ర నేతన్నలకు ఉపాధి కూడా అందుతోంది అన్నారు.
అందుకే బతుకమ్మ పండుగ బతుకును ఇచ్చే పండగ అని, బతుకు నేర్పే పండగ అని అభివర్ణించారు. బతుకమ్మ పండుగను కాకతీయులు పాలించిన వరంగల్ వేయి స్తంభాల గుడి వేదికగా అధికారికంగా ప్రారంభిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. తెలంగాణ బతుకమ్మ పండుగ ను మనతో పాటు నేడు విదేశాల్లో కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నారని, దీనికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. రాష్ట్రంలో 313 కోట్ల రూపాయలతో ఈ ఏడాది బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటున్నామని చెప్పారు. ఈ వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ ఆడటానికి నాడు కాకతీయ రాణి రుద్రమ గుర్రం మీద వచ్చేదని అంతటి గొప్ప చరిత్ర, విశిష్టత ఈ పండగకు ఉందని చెప్పారు. వరంగల్ లో పుట్టిన ఈ పండగను అధికారికంగా ఇక్కడి నుంచి ప్రారంభించడం ఎంతో సంతోషమని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. దాదాపు 10 లక్షల రూపాయలతో ఈ వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేశామన్నారు