37.2 C
Hyderabad
April 19, 2024 10: 59 AM
Slider సంపాదకీయం

వై ఎస్ జగన్ కు గుదిబండగా జీహెచ్ఎంసి ఎన్నికలు

#y s jagan 1

హైదరాబాద్ మేయర్ ఎన్నికలకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతుండటం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల తెలంగాణలో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు విజయవంతంగా జరిగాయి.

ఒక్క దుబ్బాకలోనే కాకుండా బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. గుజరాత్, మధ్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరిగాయి. మరి దేశంలో ఇన్ని ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను కొనసాగించేందుకు అభ్యంతరం ఏమిటి?

ఇదే ప్రశ్న తలెత్తుతుండటంతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఆయన పార్టీ పెద్దలకు హైకోర్టులోగానీ, అఖిల పక్ష సమావేశాలలో గానీ ఏం సమాధానం చెప్పుకోవాలో అర్ధం కావడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు కరోనా అడ్డం వస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ చేస్తున్న వాదనల్లో ఏ మాత్రం పస కనిపించడం లేదు.

ఎన్నికల నిర్వహణకు కరోనా కారణం చెబితే ఎలా?

పైన చెప్పిన ఏ ఎన్నికలో కూడా కరోనా అడ్డంకులు కనిపించలేదు. పైగా ఎన్నికలు నిర్వహించడం వల్ల బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి దుబ్బాక ఉప ఎన్నిక వరకూ కరోనా కేసులు పెరిగిన దాఖలాలు లేవు. అందువల్ల స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్న వాదనలు నిలిచే అవకాశం కనిపించడం లేదు.

 తాను తీసేసిన డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ కోర్టు ఆదేశాలతో తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా వచ్చినందున ఆయన పదవిలో ఉండగా ఎన్నికలను నిర్వహించరాదని ఒకే ఒక్క కారణంతోనే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా సాకు చూపుతున్నారని చాలా మందికి అర్ధం అయింది.

కరోనా రెండో దశలోకి వచ్చిందని, కేసులు పెరుగుతాయని కొడాలి నాని లాంటి మంత్రులు చెబుతున్నా ఆ వాదన ప్రజల్లోకి వెళ్లడం లేదు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలూ ఎన్నికలకు మొగ్గు చూపాయి.

ఒక్క వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ సమావేశాన్ని బహిష్కరించింది. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే వీలు లేదని చెప్పడమే కాకుండా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదా ఉండే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను దారుణంగా వ్యక్తిగతంగా విమర్శించడం కూడా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలవాటు అయిపోయింది.

ఈ నేపథ్యంలో దేశంలోని ఇన్ని చోట్ల ఎన్నికలు జరుగుతుండటంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగించక తప్పని పరిస్థితి తలెత్తింది. ఏదో ఒక పాయింటు మీద కోర్టుల్లో కేసులు వేసుకుంటూ కాలయాపన చేయడం ఒక్కటే ఇప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయగలిగిన పని.

గ్రేటర్ ఎన్నికల ఏర్పాట్లు చురుకుగా

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయానికి వస్తే ఇక్కడ ఏ మాత్రం కరోనా ప్రభావం లేకుండా అన్ని కార్యక్రమాలు సజావుగా సాగిపోతున్నాయి. ఓటర్ల జాబితా రూపొందించడం నుంచి పోలింగ్ బూత్ ల ఖరారు వరకూ ప్రక్రియ పూర్తి అయింది. కరోనా కేసుల విషయంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తడం లేదు. ఎన్నికల నిర్వహణకు పోలింగ్ బూత్ లను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది తప్ప కరోనా సాకు చూపి ఎన్నికల వాయిదా కోరడం లేదు.

పక్క రాష్ట్రంలోనూ, అందునా ఉమ్మడి రాజధానిలోనే స్థానిక ఎన్నికలు జరుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవడం కేవలం రమేష్ కుమార్ పై వ్యతిరేకత కారణంగానే చేస్తున్నట్లు అర్ధం అవుతున్నది. అయితే ఇలాంటి కారణాలు న్యాయస్థానాలలో చెప్పే అవకాశం లేదు. అందుకే హైదరాబాద్ ఎన్నికల నిర్వహణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మింగుడు పడటం లేదు.   

Related posts

అర్హులైన జర్నలిస్టులకందరికీ అక్రిడిటేషన్ సౌకర్యం

Satyam NEWS

అకస్మాత్తుగా ఆసుపత్రిలో చేరిన దీపికా పదుకొనె

Satyam NEWS

తక్షణమే ఖాళీలు భర్తీ చేయాలని బిజెవైఎం డిమాండ్

Satyam NEWS

Leave a Comment