కొల్లాపూర్ ప్రాంతంలో వేరు శనగ విత్తనాలకు ఎంతో డిమాండ్ ఉంది. మరి ప్రభుత్వం వేరు శెనగ విత్తనాలు రైతులకు అందేలా చూడాలి కదా? చూడాలి కానీ, చూడటం లేదు. ప్రభుత్వానికి స్థానికంగా ప్రతినిధి గా ఉండే ఎమ్మెల్యే రాజకీయంలో మునిగిపోతే రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉండాలో అంతే దయనీయంగా ఉంది కొల్లాపూర్ లో. రైతులు వేరు శెనగ విత్తనాల కోసం వ్యవసాయ శాఖ కార్యాలయాల దగ్గర పడరాని కష్టాలు పడ్డారు. తెల్లవారు జాము నుండి పడిగాపులు కాశారు. అయినా వారిని పట్టించుకునే నాథుడు కనిపించడం లేదు. ఈ సమస్య పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ధర్నాలు చేశారు. రైతుల వారం రోజుల్లో వేరుశనగ విత్తనాలు వస్తాయని చెబుతూ ఎవరూ దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, ప్రతిపక్ష పార్టీల నాయకులు రోడ్ షో లతో రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పలుమార్లు మాట్లాడారు. మరి ఇప్పుడు ఏమైంది? ఎమ్మెల్యే మాటలు విన్న రైతులు ఎలాంటి ఆందోళనలు చేయకుండా ఉన్నారు. అయితే ఇప్పుడు సీజన్ అయిపోయింది. విత్తనాలు మాత్రం రాలేదు. 14 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమైతే రెండు వేల క్వింటాలు విత్తనాలు మాత్రమే ప్రభుత్వం సరఫరా చేసింది. మరో ఐదు వేల క్వింటాళ్ల విత్తనాలు వస్తాయన్నారు. కానీ రాలేదు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా రైతులకు హామీ ఇవ్వవలసిన అవసరం ఉన్నది. కానీ ఆయన కూడా మాట్లాడలేదు. కనీసం ఎమ్మెల్యే కూడా అడగలేదు. ఇప్పటి వరకు మంత్రి తో మాట్లాడాను ఆయన సానుకూలంగా స్పందించారు, వారం రోజుల్లో వేరుశనగ విత్తనాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే పలుమార్లు తెలిపారు. కానీ ఇప్పటి వరకూ రాలేదు. ఇప్పుడు వచ్చినా ఫలితం లేదు. రాజకీయ నాయకుల మాటలు నమ్మితే రైతుకు కష్టాలు డబుల్ అవుతాయి తప్ప తీరేదారి ఉండదని స్థానిక ఎమ్మెల్యే తాజాగా నిరూపించారు.
previous post