36.2 C
Hyderabad
April 25, 2024 20: 11 PM
Slider జాతీయం

గుజరాత్ తుది పోరు!: ఎవరి ఆశ వారిదే

Modi Rahul Kejriwal

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దేశమంతా అత్యంత ఆసక్తిగా చూస్తోంది.అధికార పార్టీ బిజెపి విజయం ఖాయమనే మాటలు ఎక్కువగా వినపడుతున్నా,అమ్ ఆద్మీ పార్టీ ఆశలు ఎక్కువగానే పెట్టుకుంటోంది. కాంగ్రెస్ కూడా కుస్తీ పడుతోంది కానీ వాతావరణం అంత అనుకూలంగా కనిపించడం లేదనే వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించుకోగలమనే విశ్వాసం ఆమ్ ఆద్మీ పార్టీకి బలంగానే వుంది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోమ్ మంత్రి, అగ్రనేతల్లో

ద్వితీయ స్థానీయుడైన అమిత్ షా స్వరాష్ట్రం గుజరాత్. అంతే కాదు!రెండు దశాబ్దాల పై నుంచి బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రం. అన్ని సమీకరణాల నేపథ్యంలో గుజరాత్ లో గెలుపు ఇటు పార్టీకి – అటు మోదీ,అమిత్ షా ద్వయానికి అత్యంత కీలకం.మోదీ సైతం మిక్కిలి ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఎన్నికల సమరాన్ని దగ్గరుండి నడిపిస్తున్నారని చెప్పవచ్చు.
తెలంగాణ వంటి రాష్ట్రంలో మునుగోడు వంటి నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికకే బిజెపి అధిష్టానం ఎంత ప్రాముఖ్యాన్ని ఇచ్చిందో మనమంతా చూశాం.

అమ్మ ఆశీస్సులతో రెట్టింపు ఉత్సాహం

అటువంటిది గుజరాత్ విషయంలో బిజెపి సర్వశక్తులు ఒడ్డడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. తొలిదశ పోలింగ్ డిసెంబర్ 1వ తేదీ ముగిసింది.63.31శాతం ఓటింగ్ నమోదైంది. రెండో విడతగా తుదిదశ పోలింగ్ ఈరోజు జరుగనుంది. నరేంద్రమోదీ, అమిత్ షా తమ ఓటు హక్కును స్వరాష్ట్రంలోనే వినియోగించుకోనున్నారు.ప్రధాని తొలిగా తల్లి ఆశీస్సులు తీసుకొని అమ్మతో వీరతిలకం దిద్దించుకున్నారు.విజయోస్తు! అంటూ తల్లి ఆశీస్సులు అందిన వేళ నరేంద్రమోదీ ఆత్మవిశ్వాసం రెట్టింపైంది.గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

ఇటు రాష్ట్రంలోనూ -అటు కేంద్రంలోనూ బిజెపి అధికారంలో ఉన్నందున ఆ పార్టీకి వెసులుబాటు ఎక్కువగా ఉంది. ఇప్పటికే అనేక భారీ పథకాలు ప్రారంభించింది.పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోంది, పెద్దపెద్ద హామీలు కురిపిస్తోంది.ఇన్నేళ్ల నుంచి అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత ఎంతోకొంత ఉండకపోదు. కాకపోతే, నిన్నటి దాకా తమ ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు నరేంద్రమోదీ దేశ ప్రధాని పీఠంలో కూర్చొని ఉండడం వల్ల మనకు ఎక్కువ మేలుజరుగుతుందనే విశ్వాసం ప్రజల్లో ఎక్కువగా ఉంది.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలిచి మళ్ళీ మోదీ ప్రధానిగా ఉండాలనే ఆలోచనలు కూడా గుజరాత్ ప్రజలకు తప్పక ఉంటాయి.

సామాజిక అంశాల మీద కాంగ్రెస్ ఆశ

మోదీకి అమిత్ షా కూడా జత కలిశారు.వీరిద్దరి పట్లా గుజరాతీయులు పెంచుకున్న ప్రేమ, పెట్టుకున్న విశ్వాసం బిజెపిని గెలుపు తీరాలకు చేరుస్తుందని చెప్పవచ్చు.జోడో యాత్రతో బిజీగా ఉన్న రాహుల్ గాంధీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండడం కూడా కాంగ్రెస్ కు నష్టం తెప్పించే అంశం. ఐనప్పటికీ గతంలో తాము రచించుకున్న సామాజిక సమీకరణాల సిద్ధాంతం ఈసారి కూడా ఎంతోకొంత ఉపయోగపడకపోదా అనే విశ్వాసం కాంగ్రెస్ లో లేకపోలేదు.

క్షత్రియులు, ఎస్సీ,ఎస్టీ,ముస్లింలపైన కాంగ్రెస్ నమ్మకం పెట్టుకుంది. ముఖ్యమంత్రిగా ‘గుజరాత్ మోడల్’ ను చూపించి నరేంద్రమోదీ దేశ ప్రధాని అయ్యారు.’దిల్లీ మోడల్’ ను చూపించి,పంజాబ్ గెలుపును గుర్తు చేస్తూ గుజరాత్ లో పాగా వెయ్యాలని ఆప్ చూస్తోంది. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నిజంగా నమ్మాల్సింది ప్రజలు.
తన సరికొత్త రచనలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ హిందుత్వ ఎజెండాను కూడా వదలడం లేదు.కాంగ్రెస్,ఆప్ రెండూ జనాకర్షక హామీలను గుప్పిస్తున్నాయి.

బిజెపి మాత్రం తమ చేసిన అభివృద్ధి,నరేంద్రమోదీ ప్రభావం బలంగా పనిచేస్తాయనే బలమైన విశ్వాసంలో ఉంది. కాంగ్రెస్,ఆప్ ద్వారా జరిగే ఓట్ల చీలిక కూడా తమకు లాభిస్తుందని బిజెపి గట్టిగానే భావిస్తోంది.ఈసారి ఆదివాసీలు,దళితులు బిజెపి వైపు మొగ్గే అవకాశాలు ఉన్నాయని పరిశీలకుల అభిప్రాయం. ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎంఐఎం కూడా బరిలో ఉంది.ఓట్ల చీలిక ద్వారా ఇది కూడా అధికార బిజెపికి కలిసొచ్చే అంశం.పట్టణ ప్రాంతాల్లో ఆప్ కు ఆదరణ కాస్త ఎక్కువ ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.మరో మూడు రోజుల్లో 8వ తారీఖు నాడు అందరి జాతకాలు బయటపడతాయి.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్

Related posts

పెద్ద పులి కాదు…. అది చిన్న అడవి పిల్లి….ఓకేనా..

Satyam NEWS

రైతులు వ్యవసాయంలో నూతన పద్దతులు అవలంబించాలి

Satyam NEWS

పాలనలో విఫలమైన వారు చంద్రబాబుకు పాఠాలు చెబుతారా?

Satyam NEWS

Leave a Comment