విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రముఖ సాహితీవేత్త గురజాడ అప్పారావు 159వ జయంతి జరిగింది. ఈ వేడుకలకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక ముఖ్య అతిధిగా హాజరై, డీపీఓలో రిసెప్షన్ వద్ద ఏర్పాటు చేసిన గురజాడ అప్పారావు చిత్ర పటానికి పూలమాల వేసి, పుష్పాలను సమర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక మాట్లాడుతూ గురజాడ అప్పారావు తన రచనలతో సాంఘిక పరివర్తనకు ఎంతగానో కృషి చేసిన మహాకవి అని అన్నారు. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారుల్లో గురజాడ ఒకరన్నారు. గురజాడ చేసిన రచనల్లో సామాన్య ప్రజల వాడుక భాషను ఎక్కువగా ఉపయోగించడం వలన, సామాన్య ప్రజలకు కూడా అర్ధమయ్యే రీతిలో ఉండేవన్నారు.
గురజాడ చేసిన రచనలు నేటికి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని జిల్లా ఎస్పీ ఎం. దీపిక అన్నారు. అనంతరం ఓఎస్డీ ఎన్. సూర్యచంద్రరావు మాట్లాడుతూ – విజయనగరం ఖ్యాతిని ప్రపంచానికి తెలియజెప్పిన ప్రముఖుల్లో గురజాడ అప్పారావు ఒకరన్నారు.
దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్న నానుడిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత గురజాడ అప్పారావుకే చెందుతుందన్నారు. అనంతరం, పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ ఎం. దీపిక మిఠాయిలను పంచి పెట్టారు.
ఈ వేడుకల్లో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, విజయ నగరం డిఎస్పీ పి.అనిల్ కుమార్, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, ఎఓ వెంకట రమణ, స్పెషల్ బ్రాంచ్ సిఐలు ఎన్.శ్రీనివాసరావు, రుద్రశేఖర్, డిసిఆర్ బి సిఐ బి. వెంకటరావు, ఆర్ అయిలు పి. నాగేశ్వరరావు, టి.వి.ఆర్. కే.కుమార్, చిరంజీవి, పి. ఈశ్వరరావు, మరియన్ రాజు, రమణమూర్తి, ఆర్ఎస్ ఐలు రమేష్, నీలిమ, నారాయణరావు, ప్రసాదరావు, నర్సింగరావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.