ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదరికంలో, అనారోగ్యంతో మగ్గిపోయే పల్నాడు ప్రాంతానికి గురజాల మెడికల్ కాలేజీ ఒక వరంగా మారబోతున్నది. మెడికల్ కళాశాల నిర్మాణానికి మొత్తం రూ.325 కోట్లు ఖర్చవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో కేంద్రం వాటాగా 60 శాతం అంటే రూ. 195 కోట్లు అందించనుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ వాటా 40శాతం అంటే రూ.130కోట్లు పెట్టాల్సి ఉంటుంది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తుండగా అందులో మూడిటి నిర్మాణానికి ముందుగా అనుమతులను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఇచ్చింది. మెడికల్ కళాశాల నిర్మాణం జరిగితే పల్నాడు ప్రాంత వాసులు వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. సీనియర్ డాక్టర్లు గురజాలలోనే ఉంటారు కాబట్టి అన్ని రకాల వైద్య సేవలు వెంటనే అందుతాయి. మెడికల్ కళాశాల నిర్మాణంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పాత్ర, గురజాల శాసనసభ్యులు కాసుమహేష్ రెడ్డి కృషి కూడా ఎంతో ఉంది.