తెలంగాణలో జరగనున్న శాసనమండలి ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఖరారయ్యారు. అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతలతో చర్చించిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గుత్తా అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేశారు. ఈ క్రమంలో శనివారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను గుత్తా కలిశారు. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన శాసనమండలి స్థానాల ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 3, తెలంగాణలో ఒక స్థానానికి నోటిఫికేషన్ వెలువరించింది. ఏపీలో కరణం బలరాం, ఆళ్ల నాని , కోలగట్ల వీరభద్ర స్వామి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా తెలంగాణలో యాదవరెడ్డిపై అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇందుకు సంబంధించి ఈ నెల 7న నోటిఫికేషన్ వెలువడనుండగా నామినేషన్ల దాఖలుకు ఈ నెల 14 వరకు గడువు ఉంది. ఈ నెల 16న నామినేషన్ల పరిశీలన, ఆగస్టు 19న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఆగస్టు 26న పోలింగ్ జరిపి అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించనున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న బలాబలాల కారణంగా ఏపిలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న మూడు సీట్లు వచ్చేస్తాయి. అదే విధంగా తెలంగాణలో టి ఆర్ ఎస్ పార్టీకి ఉన్న ఒక్కసీటూ వచ్చేస్తుంది. అందువల్ల ఎన్నికలు జరిగే అవకాశం ఉండకపోవచ్చు.
previous post