37.2 C
Hyderabad
March 28, 2024 20: 56 PM
Slider ప్రత్యేకం

కరోనా కన్నా ప్రమాదకరమైనది ‘‘హ్యాకింగ్’’ వైరస్

#internethacking

వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం, అవి క్షేమకరం అని చెప్పడానికి సాక్షాత్తు ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతి మొదలు ముఖ్యులంతా వ్యాక్సిన్ వేయించుకోవడం ఎంతో ధైర్యాన్ని తద్వారా ఆనందాన్ని ఇచ్చే అంశం. రెండు రోజుల నుంచి  కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం సంతోషాన్ని కలిగించే అంశం.

వ్యాక్సినేషన్ లో రెండో దశలోకి అడుగుపెట్టాం. అది విజయవంతంగానే సాగుతోంది. అత్యవసర సిబ్బందితో పాటు సాధారణ ప్రజలు కూడా వ్యాక్సినేషన్ ను వినియోగించుకునేందుకు వీలుగా చర్యలను ప్రారంభించడం మంచి పరిణామం.45ఏళ్ళు దాటి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి కూడా టీకాలను సిద్ధం చేయడం అభినందనీయం.

మనో ధైర్యాన్ని పెంచుతున్న మన వ్యాక్సిన్లు

మరెన్నో సంస్థల నుంచి మరిన్ని వ్యాక్సిన్లు త్వరలో అందుబాటులోకి రానుండడం కూడా మనోధైర్యాన్ని పెంచే అంశం. కరోనా వైరస్ కల్పించిన కష్టాల నుంచి మనం మెల్లగా బయటపడుతున్నాం,త్వరలో ఒకప్పటి సాధారణ పరిస్థితుల్లోకి వెళ్ళబోతున్నాం, అని అందరూ స్వేచ్చావాయివులు పీల్చుకుంటున్న వేళ, దేశంలోని పలు ప్రాంతాల్లో మళ్ళీ కరోనా విజృంభణం మొదలవ్వడం చాలా ఆందోళనకరం.

అన్ని దశల పరీక్షలు సంపూర్ణమవ్వకుండానే వ్యాకిన్లు విడుదల చేయడంపై విమర్శలు ఇంకా ఆగలేదు. వ్యాక్సిన్ల సమర్ధత ఇంకా పూర్తిగా రుజువు కావాల్సివుంది. పాలకులు, న్యాయమూర్తులు,అధికారులు వ్యాక్సిన్లు తీసుకొని ప్రజలకు ధైర్యం చెప్పడం అభినందనీయమైన విషయం.

వికటించిన కేసులు అత్యల్పసంఖ్య మాత్రమే

ఇదే క్రమంలో, టీకాలు వికటించటం వల్ల కొందరు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. ఇది చాలా విచారకరం. వ్యాక్సిన్లు వికటించినవారి సంఖ్య తక్కువే కావచ్చు, కానీ ప్రాణానికి ఖరీదు కట్టలేం. నిజంగా వికటించటం ద్వారానే ఇవన్నీ జరిగితే, పూర్తి స్థాయిలో నిష్పక్షపాతమైన దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చాలి. కొత్త వ్యాకిన్లు వచ్చిన కొత్తల్లో ఇటువంటివి జరగడం సర్వ సాధారణం అంటూ కొట్టిపారేయడం అనైతికం.

మన దేశానికి సంబంధించిన సంస్థలు ఇంత తక్కువకాలంలో వ్యాక్సిన్లను తయారుచేయడం ఎంతో ప్రశంసాత్మకం. అదే సమయంలో, సమర్ధతపై ఇంకా దృష్టి సారించాల్సిన అవసరం వుంది. వికటించటంపై పునఃపరీక్షలు జరపాల్సిన అవసరం ఉంది.

వ్యాక్సిన్ వేయించుకున్నా…..???

వైరస్ కొత్త రూపాలను సంతరించుకుంటోంది. వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు వీటికి ఉన్నాయని చెబుతున్నారు. వివిధ అనారోగ్యాలతో బాధపడేవారికి కరోనా సోకితే కష్టమేనని వైద్యులు చెబుతూనే వున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నా, కొత్త వైరస్ మళ్ళీ సోకే ప్రమాదం వుందనీ హెచ్చరిస్తున్నారు.

కరోనా వైరస్ లోని కొత్త రకాలను కూడా ఎదుర్కొనే శక్తి ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లకు ఉందని కూడా ప్రచారం జరిగింది. ఇవన్నీ ఆచరణలో తేలాల్సివుంది.ఇవన్నీ అట్లుండగా, మన వ్యాక్సిన్ వ్యవస్థలపై చైనా సైబర్ దాడి ప్రారంభించిందనే వార్తలు హృదయాన్ని కలచివేస్తున్నాయి.

సైబర్ దాడులు చేస్తున్న తుచ్ఛులు

సభ్య సమాజంలో కలకలం సృష్టిస్తున్నాయి. నిజంగా ఇది నిజమైతే ఇంతకు మించిన నీచం, పాపం ఇంకొకటి ఉండదు. ముఖ్యంగా మన దేశీయ సంస్థలైన భారత్ బయోటెక్, సీరమ్ పై ఈ దాడి జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ సంస్థల నుంచి ఇంకా అధికారికంగా ప్రకటన, వివరణ రావాల్సివుంది.

భారత్ బయో టెక్ సంస్థ మన తెలుగువారిది కూడా. ఈ సంస్థల్లోని సిస్టమ్స్ లోకి మాల్ వేర్ చొప్పిస్తున్నారని, తద్వారా, వాటి మేధాసంపత్తిపై దెబ్బకొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. చైనా ప్రభుత్వం అండదండలతో నడిచే స్టోన్ పాండా /ఏపిటి 10 ఈ పథకరచన చేసిందని చెబుతున్నారు.

సిస్టమ్స్ లోని లోపాలను, బలహీనతలను గుర్తించి, ఈ దుర్మార్గానికి పాలుపడుతున్నట్లు వెళ్లడవుతున్న సమాచారం అత్యంత వేదనను కలిగిస్తోంది.సింగపూర్ లో, అమెరికన్ ఆర్ధిక సేవల సంస్థ గోల్డ్ మన్ శాక్స్ ఆధ్వర్యంలో నడిచే సైబర్ సెక్యూరిటీ సంస్థ “సైఫర్మా” ఈ సైబర్ దురాగతాన్ని బయటపెట్టిందని వార్తా కథనాలు వస్తున్నాయి.

వ్యాక్సిన్ తయారు చేయడం రాలేదు కానీ… చేసేవారిని చెడగొడతారా?

ఇందులో ఏ మాత్రం నిజంలేదని, ఇది చైనాపై జరిగే దుష్ప్రచారమనీ, చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ పెన్ బిన్ ఖండించారు. కరోనాకు వ్యాక్సిన్లు రూపొందించి, దేశ ప్రజల రక్షణ కోసం కృషి చేస్తున్న మన దేశీయ సంస్థలపై ఇటువంటి సైబర్ దాడులు జరగడం దారుణమైన అంశం.

దీనిపై మన ప్రభుత్వంతో పాటు,అమెరికా సహా మిగిలిన దేశాల ప్రభుత్వాలాన్నీ దృష్టి సారించాలి. నిజానిజాలు నిగ్గు తేల్చాలి. ఇటువంటి దుశ్చర్యలకు ఏ వ్యక్తి, ఏ సంస్థ, ఏ దేశం పాల్పడినా? అంతకు మించిన నేరం,పాపం, నీచం ఇంకొకటి ఉండదు. అసలు! చైనాయే కరోనా వైరస్ సృష్టికర్త, అనే ప్రచారం ప్రపంచంలో ఉంది.

ఇప్పుడు ఈ సైబర్ దుర్మార్గం బయటకు వచ్చింది. కరోనా వల్ల యావత్తు ప్రపంచం తల్లడిల్లిపోయింది. ఇంకా లోకం ఆ చీకటి నుంచి బయటకు రాలేదు. సంపూర్ణంగా ఎప్పుడు బయటకు వస్తుందో కూడా తెలియరావడం లేదు. కరోనా వైరస్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తూనే ఉందాం. త్వరలోనే కరోనా నుంచి పూర్తిగా విముక్తి పొందుతామని విశ్వసిద్దాం.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

కొవిడ్-19 మెడికల్ సేఫ్టీ కిట్ అందజేసిన శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్

Satyam NEWS

రాంగోపాల్ వర్మ ను రాష్ట్ర బహిష్కరణ చేయాలి

Bhavani

Big Boss 4: కోట్లాది మందికి వినోదం నాకు ఆనందం

Satyam NEWS

Leave a Comment