32.2 C
Hyderabad
April 20, 2024 21: 20 PM
Slider తెలంగాణ సంపాదకీయం

సందిగ్ధం నుంచి సగం క్లారిటీ వచ్చిన సెల్ఫ్ డిస్మిసల్

TSRTC

రెండు వారాలకు పైబడి సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు ఉన్నట్టా లేనట్టా? ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు వారు సెల్ఫ్ డిస్మిస్ అయిపోయినట్లేనా? ఈ విషయంలో చాలా వరకూ సందిగ్ధత రాజ్యం ఏలుతోంది. ప్రభుత్వ పెద్దలు ఆర్టీసీ కార్మికులు ఇక లేనట్లేనని చెబుతుంటే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. సెల్ఫ్ డిస్మిసల్ అనేది చట్టంలో ఎక్కడా లేదని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు.

వాస్తవానికి సెల్ఫ్ డిస్మిసల్ అనే పదం కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపెట్టిందే తప్ప ఎక్కడా లేదనేది వాస్తవమే. అయితే ప్రభుత్వ మంకుపట్టును ముఖ్యమంత్రి వాదాన్ని కాదని చేయగలిగింది ఏమీ ఆర్టీసీ కార్మికులకు కనిపించడం లేదు. అయితే న్యాయ నిపుణుల అభిప్రాయం మాత్రం ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి ఢోకా లేదనేదే. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన వాదనలు జరిగాయి.

ఈ వాదనల సందర్భంగా చాలా విషయాలు న్యాయస్థానం దృష్టికి వెళ్లాయి. వాటన్నింటిని పరిశీలించిన తర్వాత ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని రాష్ట్ర హైకోర్టు సూచించింది. అసలు విషయం ఇక్కడే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాలలో లేరని చెబుతున్నది. హైకోర్టు చర్చలు జరపమని చెబుతున్నది. హైకోర్టు చెప్పినట్లు చేస్తే ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాలలో ఉన్నట్లు అంగీకరించినట్లు అవుతుంది.

అందుకోసమే ప్రభుత్వం ఈ అంశం ఆర్టీసీ యాజమాన్యం పరిశీలిస్తుందని చెప్పి తాత్కాలికంగా ఈ ధర్మ సంకటాన్ని వాయిదా వేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటున్నట్లు ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయినట్లు హైకోర్టు కూడా భావిస్తే వారితో చర్చలు జరపని చెప్పి ఉండేదే కాదు. హైకోర్టు చర్చలు జరపమని చెప్పింది కాబట్టి సమ్మె చేస్తున్న వారిని రాష్ట్ర హైకోర్టు ఇంకా ఉద్యోగులుగానే పరిగణిస్తున్నది.

దానితో బాటు వారికి జీతాలు చెల్లించాలని కూడా హైకోర్టు ఆ తర్వాతి వ్యాజ్యంలో చెప్పినందు వల్ల సమ్మె చేస్తున్న ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ అయినట్లుగా కోర్టు భావించడం లేదనే అర్ధం వస్తున్నది. ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయినట్లుగా ఇంకా భావిస్తున్నది కాబట్టే ఆర్టీసీ యాజమాన్యానికి కూడా చర్చలకు సంబంధించిన సూచనలు చేయలేదు. న్యాయస్థానం దృష్టిలో సమ్మె చేస్తున్న వారు ఆర్టీసీ సిబ్బందిగానే ఉన్నందున వారి జీతాలు, ప్రస్తుతం పోలీసులు పెడుతున్న కేసులు, వారు మొదటి నుంచి చేస్తున్న డిమాండ్లు లాంటి అంశాల సంగతి ఎలా ఉన్నా న్యాయ పరంగా వారికి ఉద్యోగ భద్రత ఉన్నట్లుగానే భావించాలని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Related posts

న్యాయ వ్యవస్థపై దుష్ప్రచారం ప్రభుత్వానికే నష్టం

Satyam NEWS

జాబ్ లాస్: ఉద్యోగాలు కోల్పోనున్న పెద్దలు

Satyam NEWS

నిజాయితీగా వ్యాపారం చేయకపోతే చర్యలు

Bhavani

Leave a Comment