ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10 రన్నరప్ హర్యానా స్టీలర్స్ పీకెఎల్ 11వ సీజన్లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన హర్యానా స్టీలర్స్ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో సాధికారిక విజయాలు సాధించింది. బుధవారం గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లో యూపీ యోధాస్‌పై 30-28తో హర్యానా స్టీలర్స్ గెలుపొందింది. నాలుగు మ్యాచుల్లో హర్యానా స్టీలర్స్‌కు ఇది మూడో విక్టరీ కాగా.. యూపీ యోధాస్‌కు ఐదు మ్యాచుల్లో ఇది రెండో పరాజయం.
ఈ విజయంతో హర్యానా స్టీలర్స్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానం నుంచి నాల్గో స్థానానికి ఎగబాకింది. హర్యానా స్టీలర్స్ ఆటగాళ్లలో రెయిడర్ వినయ్ (8 పాయింట్లు), డిఫెండర్ సంజయ్ ధుల్ (6 పాయింట్లు) రాణించారు. యూపీ యోధాస్ తరఫున గగన్ గౌడ ( 9 పాయింట్లు), భరత్ (5 పాయింట్లు) ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ప్రథమార్థంలోనూ యూపీ యోధాస్‌పై హర్యానా స్టీలర్స్ పైచేయి సాధించింది. తొలి అర్థభాగం ఆటలో ఇరు జట్లకు పాయింట్లు అంత సులువుగా దక్కలేదు. కూతలో హర్యానా, యూపీ నాలుగేసి పాయింట్లు సాధించాయి. కానీ స్టీలర్స్ డిఫెండర్ సంజయ్ ధుల్ మెరుపు ట్యాకిల్స్ చేశాడు. హర్యానా స్టీలర్స్‌కు డిఫెన్స్‌లో ఏడు పాయింట్లు అందించాడు.
దీంతో తొలి 20 నిమిషాల ఆటలో హర్యానా స్టీలర్స్ 11-9తో పైచేయి సాధించింది. విరామ సమయానికి రెండు పాయింట్ల ఆధిక్యంతో నిలిచింది. ద్వితీయార్థంలో స్టీలర్స్ ఆధిపత్యం కొనసాగినా.. ఆఖరు ఐదు నిమిషాల్లో యూపీ యోధాస్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. పాయింట్ల లోటు నెమ్మదిగా పూడ్చకుంటూ హర్యానాపై యోధాస్ ఒత్తిడి పెంచింది. హర్యానా 26-24తో ముందంజలో నిలువగా.. చివరి రెండు నిమిషాల ఆటలో ఇరు జట్లు ఒక్కో పాయింట్ సాధిస్తూ వచ్చాయి. ఆఖరు వరకు రెండు పాయింట్ల ఆధిక్యత నిలుపుకున్న హర్యానా స్టీలర్స్ సీజన్లలో మూడో విజయం ఖాతాలో వేసుకుంది.