29.2 C
Hyderabad
March 24, 2023 22: 02 PM
సంపాదకీయం

కేసీఆర్ తన తప్పును తెలుసుకున్నారా……?

#KCR

గవర్నర్ ను అవమానించడానికి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రాజ్యాంగ వ్యవస్థలు ‘‘సెల్ఫ్ కరెక్షన్’’ చేశాయి. రాజకీయంగా విభేదించే పార్టీ కి చెందిన వ్యక్తి గవర్నర్ గా ఉండటంతో గత కొద్ది కాలంగా తీవ్ర నిరసనను పరోక్షంగా వ్యక్తం చేస్తున్న కేసీఆర్ తనకు తానుగా పున:సమీక్ష చేసుకునే విధంగా రాజ్యాంగ వ్యవస్థలు ప్రవర్తించాయి.

ఇక్కడ గవర్నర్ అనేది ఒక రాజ్యాంగ వ్యవస్థ. కేసీఆర్ (ప్రస్తుతం ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్ర మంత్రివర్గానికి బాధ్యుడు అయినందున) అనేది మరొక రాజ్యాంగ వ్యవస్థ. ఈ రెండు వ్యవస్థలు కలిసి పని చేయాల్సిందే. ప్రజలు ఎన్నుకున్నందున ముఖ్యమంత్రి రాజ్యాంగానికి అతీతుడూ కాదు, రాష్ట్రపతి నామినేట్ చేసినందున గవర్నర్ అంతకు తక్కువా కాదు. ఇంత చిన్న లాజిక్ ను కేసీఆర్ లాంటి భావి భారత నాయకుడు మిస్ కావడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.

రాష్ట్రంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా తన హద్దులు దాటి ప్రవర్తించడం కూడా ఆక్షేపణీయమే. రాష్ట్ర మంత్రి వర్గం సిఫార్సు చేసి పంపిన వాటిని రాజ్యాంగానికి లోబడి అనుమతించడం గవర్నర్ విధి. అయితే గవర్నర్ కూడా తన ‘‘రాజకీయ విచక్షణ’’ తో ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారని చెప్పక తప్పదు.

ఉదాహరణకు రాష్ట్ర మంత్రి వర్గం సిఫార్సు చేసి ఫలానా వ్యక్తిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించండి అని పంపిందినుకోండి. ఆ పేరును పరిశీలించి అభ్యంతరాలుంటే తక్షణమే సహేతుక కారణాలు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని చెప్పడం ఒక విధానం. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన వ్యక్తి అర్హుడు కాడు అని భావించి ఏ విషయం చెప్పకుండా నాన్చడం మరొక విధానం. తెలంగాణ గవర్నర్ తమిళసై రెండో విధానాన్ని ఎంచుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయంపై పునరాలోచించకపోతే గవర్నర్ కు ఆమోదించక తప్పని పరిస్థితి ఉంటుంది. అంత దూరం ఏ గవర్నర్ తెచ్చుకోరు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ముఖ్యమంత్రికి సహకరించడం అంటే రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలను అనుమతించడం కాదు. రాజ్యాంగ పరంగా చట్టానికి లోబడి చేసే పనులను అనుమతించడం. ఉదాహరణకు రాష్ట్ర మంత్రి వర్గం ఎవరినైనా క్రిమినల్ ను ఎమ్మెల్సీగా సిఫార్సు చేసి ఉంటే ఆ కారణం చూపి గవర్నర్ తిరస్కరిస్తే అది వేరే విషయం. అలా చేయకుండా గవర్నర్ తన ‘‘రాజకీయ’’ వివేచనతో ఆలోచించి ఆ హద్దును దాటారు.

దాంతో కేసీఆర్ తిరుగుబాటు మనస్తత్వంతో తన అధికార వ్యవస్థను కట్టడి చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్ పిలు కూడా గవర్నర్ వద్దకు వెళ్లకుండా చేశారు. దీనిపై గవర్నర్ చట్టబద్ధంగా నిరసన తెలిపి ఉండవచ్చు కానీ ఆమె జాతీయ మీడియాకు వెళ్లి కేసీఆర్ ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేశారు. చట్టబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను గవర్నర్ తిరస్కరించడం ఎంత అన్యాయమో, గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సహకరించకపోవడం అంతే అన్యాయం.

గవర్నర్ పై కోపంతో రిపబ్లిక్ డే వేడుకలు కూడా నిర్వహించని కేసీఆర్ సరిదిద్దుకోలేని తప్పు చేశారు. గవర్నర్ ను శాసనసభకు పిలవకుండా సభ నిర్వహించాలనుకోవడం కూడా అంతే అవివేకం. రాష్ట్ర మంత్రి వర్గం రాసిచ్చిన ప్రసంగాన్నే గవర్నర్ చదవాలి. అలా చదవక పోయినా, సొంతగా మాట్లాడినా కుదరదు. తన సొంత పదాలను చేర్చడం, మంత్రి వర్గం ఆమోదించి ఇచ్చిన ప్రసంగంలో మార్పులు చేయడం ద్వారా తమిళనాడు గవర్నర్ తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. ఇలా చేసిన తమిళనాడు గవర్నర్ ను ఎవరూ సమర్థించలేదు. పదవి వదిలిపెట్టి వెళ్లిపోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. కేరళ గవర్నర్ సృష్టించిన వివాదాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం సమర్ధంగా ఎదుర్కొంది.

పశ్చిమబెంగాల్ గవర్నర్ చేసిన పనులను ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా సమర్ధంగా ఎదుర్కొన్నది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ గవర్నర్లు చేసింది తప్పు అని రాజకీయ వ్యవస్థలతో బాటు చాలా మంది మేధావులు కూడా చెప్పారు. బీజేపీ వారు ఎంత సమర్ధించకున్నా కూడా గిట్టుబాటు కాలేదు. అయితే తెలంగాణ గవర్నర్ విషయంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది తప్పు అనే చాలా మంది అన్నారు.

అందుకే కేసీఆర్ పిలవకపోయినా, అసెంబ్లీ సమావేశాల గురించి సమాచారం అందించకపోయినా, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలని కోరకపోయినా కూడా తెలంగాణ గవర్నర్ వాటన్నింటిని సాధించుకున్నారు. తెలంగాణ గవర్నర్ గెలిచారు అని చెప్పడం కాదు కానీ కేసీఆర్ తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి భంగపాట్లు రాకుండా ఉంటాయని మాత్రం చెప్పవచ్చు.

Related posts

పోరాట యావ చచ్చిన కమ్యూనిస్టులు

Satyam NEWS

జగన్ క్యాబినెట్: ఒకరిద్దరు తప్ప అందరూ అవుట్

Satyam NEWS

డేంజర్ డేంజర్: వామ్మో ఎర్రగడ్డ నిండిపోతున్నది

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!