28.7 C
Hyderabad
April 20, 2024 05: 29 AM
Slider సంపాదకీయం

మళ్లీ గుండెల్లో దడ: బాబుకు మోదీ పిలుపు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ ఆ మధ్య కలిస్తే ఒక పెద్ద సంచలనం అయింది. చంద్రబాబునాయుడిని తరచూ ఢిల్లీ రమ్మంటూ ప్రధాని ఆహ్వానించారని వార్తలు వెలువడ్డాయి. దాంతో ఒక్క సారిగా బీజేపీ తెలుగుదేశం పార్టీల మధ్య సఖ్యత ఏర్పడిందని కూడా పుకార్లు గుప్పు మన్నాయి. అయితే ఆ తర్వాత అలాంటిందేం జరగలేదు కానీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కునుకుపట్టలేదు. చాలా కాలం పాటు ఆ పార్టీ నాయకులు ఈ పరిణామంతో మదన పడ్డారు. దమ్ముంటే సింగిల్ గా రా అంటూ చంద్రబాబునాయుడికి సవాల్ విసిరారు.

ఆ తర్వాత జరిగిన పరిణామాలలో చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక సందర్భంలో సమావేశం కావడంతో మళ్లీ వైసీపీలో విస్తృత చర్చ జరిగింది. రెండు పార్టీలనూ కలిపి వైసీపీ నేతలు విమర్శించడం ప్రారంభించారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబుకు మోదీ నుంచి ఆహ్వానం అందింది. 20 దేశాల కూటమికి భారతదేశం అధ్యక్షత వహించే అవకాశం భారత్‌కు లభించింది. ప్రపంచంలో మన దేశం తనదైన ముద్ర వేసేలా.. ఈ కూటమి నేతృత్వం ఉండాలని మోదీ అనుకుంటున్నారు. అందుకే ఈ సదస్సు నిర్వహణపై రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోడీ చర్చించి.. సలహాలు తీసుకోనున్నారు. డిసెంబర్ 5న రాష్ట్రపతి భవన్‌లో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది.

ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి చంద్రబాబుకు ఆహ్వానం పంపడమే కాదు.. స్వయంగా ఫోన్ చేశారు. చంద్రబాబు కూడా వచ్చేందుకు అంగీకరించారు. 2014లో ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్య పార్టీగా ఉండేది. ఆ కూటమి నుంచి టీడీపి 2018లో బయటకు వచ్చింది. ఆ తర్వాత మోదీని చంద్రబాబు ఒక్క సారిగా మాత్రమే కలిశారు. అది కూడా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశంలో మాత్రమే కలిశారు. తాజాగా మరోసారి ప్రధాని సమావేశానికి చంద్రబాబు హాజరు కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం ఉత్కంఠ రేపుతోంది.

మోదీ, చంద్రబాబు మళ్లీ కలుస్తుండటంతో వైసీపీ నేతలకు గుబులు పట్టుకుంది. ఇటీవలి కాలంలో ఏపి బిజెపి నేతలు చంద్రబాబును టార్గెట్ చేసి విపరీతంగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిజెపికి టిడిపికి ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని వైసీపీ లెక్కవేసుకుంది. అయితే అకస్మాత్తుగా చంద్రబాబుకు ఢిల్లీ పిలుపు రావడంతో మళ్లీ ఆలోచనలో పడే పరిస్థితి వైసీపీకి వచ్చేసింది. ఇది కేవలం అధికారిక కార్యక్రమమేనని రాజకీయాలకు సంబంధం లేదని వైసీపీ తన ఇంటర్నల్ సమావేశాలలో చెప్పుకుంటున్నది. అయితే మోదీ చంద్రబాబు ఒక్క సారి కలిస్తేనే ఇబ్బంది పడ్డ వైసీపీ ఇప్పుడు రెండో సారి కూడా కలవడం పై కలవరపడుతున్నది.

Related posts

ఆదివాసీల హక్కుల కోసం… ఒక చైర్మన్ గా పోరాడుతా…!

Bhavani

ఏపీలో రేపు కూడా వడగాడ్పులు వీచే అవకాశం

Satyam NEWS

గోల్డెన్ లెగ్: బంగారు ప్లేట్ పై కేటీఆర్ బొమ్మ

Satyam NEWS

Leave a Comment