26.1 C
Hyderabad
May 15, 2021 04: 19 AM
Slider సంపాదకీయం

హీరో ఆఫ్ ద నేషన్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

#PrashantKishore

రాజకీయ పార్టీలన్నీ సిగ్గుపడాల్సిన విషయం ఇది. దేశంలోని ఐదు రాష్ట్రాలలో సాధారణ అసెంబ్లీ ఎన్నికలు, కొన్ని పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ముగిశాయి. నేడు ఫలితాలు వెలువడుతున్నాయి.

ప్రశాంత్ కిషోర్ వ్యూహం రచించిన పార్టీలన్నీ వివిధ రాష్ట్రాలలో విజయం సాధించాయి. కోట్లాది రూపాయలు ఫీజు తీసుకుని పని చేసే ప్రశాంత్ కిషోర్ తాను చేపట్టిన బాధ్యతకు న్యాయం చేస్తాడనే పేరుంది.

అయితే ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ వేసే ఎత్తుగడలు దేశంలో సాంప్రదాయ రాజకీయ వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. ప్రజాభిప్రాయాన్ని తన క్లయింట్ కు అనుకూలంగా మలిచేందుకు ఆయన చేసే పనులు కొన్ని సమస్యలను కూడా సృష్టిస్తున్నాయి.

ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియాను వాడే విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ ఆఖరు నిమిషంలో వచ్చి మ్యాజిక్ చేయడు. ప్రశాంత్ కిషోర్ తో కాంట్రాక్టులోకి రావాలంటే ఏదైనా పార్టీ మూడేళ్ల ముందే కాంట్రాక్టు ఇవ్వాలి.

ఈ మూడు సంవత్సరాల కాలంలో ప్రశాంత్ కిషోర్ ఆయా రాష్ట్రాల కుల వ్యవస్థను అధ్యయనం చేసి గేమ్ మొదలు పెడతాడు. కులాలు, జాతుల జోలికి వెళ్లి వారి నుంచి అభిప్రాయ సేకరణ చేస్తాడు. ఆ అభిప్రాయాలను తనంత తానుగా చేయడు.

ఏదైనా రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ తనకు కాంట్రాక్టు ఇవ్వాలనుకుంటే ముందుగా తనంత తానుగా సర్వే చేస్తాడు. తనంత తానుగా అంటే తన టీమ్ వచ్చి జనరల్ సర్వే చేస్తుంది. ఆ సర్వే ప్రకారం ప్రజాభిప్రాయాన్ని సదరు పార్టీకి అనుకూలంగా మలచాలంటే ఇంత ఖర్చు అవుతుందని ప్రశాంత్ కిషోర్ చెబుతాడు.

దానికి అంగీకరిస్తే స్థానికంగా కార్యకర్తల్ని సొంతంగా ఏర్పాటు చేసుకుంటాడు. వారికి అడిగినంత జీతం ఇస్తాడు. స్థానికంగా ఉండే టీమ్ లో యువత ఎక్కువ ఉంటారు. రాజకీయంగా ఎలాంటి ప్రభావం లేని వారిని సెలక్ట్ చేసుకుంటాడు. ఇదంతా ఎంతో గోప్యంగా చేస్తాడు.

దాంతో ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు ప్రశాంత్ కిషోర్ కార్యకర్తలు ఎవరో తెలుసుకోవడానికే మూడేళ్లు పడుతుంది. ప్రశాంత్ కిషోర్ వివిధ రాష్ట్రాలలో ఎవరు గెలిచే అవకాశం ఉందో వారివైపే వెళతాడనే పేరు కూడా ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలను అధ్యయనం చేసి కులాల మధ్య పోరాటం పెట్టి వైసీపీని గెలిపించినట్లు పశ్చిమ బెంగాల్ లో బెంగాల్ స్థానికులు, బెంగాల్ సెటిలర్ల జీవన విధానాన్ని ప్రశాంత్ కిషోర్ అధ్యయనం చేశాడు.

బెంగాల్ స్థానికులు మమతా బెనర్జీ వైపు, బెంగాల్ సెటిలర్లు బిజెపివైపు ఉండేవారు. బెంగాల్ స్థానికులను తృణమూల్ కాంగ్రెస్ వైపు సుస్థిరం చేయడంతో బాటు బెంగాల్ సెటిలర్లలో చీలిక తెచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ ప్లాన్ వేశాడు.

బెంగాల్ సెటిలర్ల పట్ల ప్రశాంత్ కిషోర్ అనుసరిస్తున్న వ్యూహం కారణంగా కొద్ది మంది తృణమూల్ కాంగ్రెస్ నాయకులు భయపడ్డారు. ఇలా చేస్తే తమ ఓటమి ఖాయమని భావించి బిజెపి పంచన చేరారు. అయితే ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు నమ్మిన మమతా బెనర్జీ అదే వైఖరి కొనసాగించారు.

కోల్ కతా పరిసర ప్రాంతాలలో బెంగాల్ సెటిలర్లతో సమావేశాలు పెట్టిన మమతా బెనర్జీ మిగిలిన ప్రాంతాలలో బెంగాల్ స్థానికులను బాగా రెచ్చగొట్టారు. ఇదే ప్రశాంత్ కిషోర్ వ్యూహం. బిజెపి మతాన్ని విస్తృతంగా వాడటంతో ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఫలించడం ప్రారంభించింది.

బిజెపి ఆ విధంగా మతాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంతో ప్రశాంత్ కిషోర్ పని సులభం అయింది. ముస్లింలను, తటస్థులను ప్రశాంత్ కిషోర్ ఆఖరు నిమిషంలో టార్గెట్ చేశాడు. దాంతో బిజెపి కలలు చెల్లా చెదురు అయ్యాయి.

తమిళనాడులో ప్రశాంత్ కిషోర్ ఇంత శ్రమ పడాల్సిన అవసరం కలగలేదు. తమిళనాడులో రెండు పార్టీల మధ్య చీలిపోయి ఉన్న ఓట్ బ్యాంక్ ను డిఎంకే కి సుస్థితరం చేయడానికి ప్రశాంత్ కిషోర్ పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు.

ఏ రాష్ట్రంలో ఎవరు గెలవాలో ప్రశాంత్ కిషోర్ నిర్ణయిస్తున్నాడు. రాజకీయ పార్టీలు ప్రశాంత్ కిషోర్ తెలివితేటలపై ఆధారపడాల్సిన దుస్థితిలో ఉన్నాయి.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, www.satyamnews.net  

Related posts

జన హృదయ విశ్వ విజేత జనం మెచ్చిన మహా నేత

Satyam NEWS

అనధికార నిర్మాణం కూల్చివేత

Sub Editor

రాజంపేటలో బత్యాల ఆధ్వర్యంలో అమరావతి రైతులకు సంఘీభావం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!