ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితుడు, వ్యాపారవేత్త అయిన జూపల్లి రామేశ్వరరావుకు నిబంధనలకు విరుద్ధంగా రూ.38 కోట్ల మేరకు స్టాంప్ డ్యూటీ మినహాయించడాన్ని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సంబంధిత సంస్థలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాయదుర్గంలో వందల కోట్ల రూపాయల విలువైన భూమిని జూపల్లి రామేశ్వరరావుకు చెందిన మైహోమ్ సంస్థకు కేటాయించారని రేవంత్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.
విలువైన భూమిని కేటాయించడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా రూ.38 కోట్ల స్టాంప్ డ్యూటీని మినహాయించారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను రాష్ట్ర హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా జూపల్లి రామేశ్వరరావుకు, రాష్ట్ర ప్రభుత్వానికి, డిఎల్ఎఫ్ సంస్థకు రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వారి సమాధానం కోసం కేసును హైకోర్టు నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.