అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో తెదేపా నేతలను ఎక్కడికక్కడ పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆదివారం రాత్రి వరకు 48 నియోజకవర్గాల్లో తెదేపా ముఖ్యనేతలు, కార్యకర్తలను గృహనిర్బంధం చేశారు. దీనిపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. గృహనిర్బంధాలను, అరెస్టులను తీవ్రంగా ఖండించారు. తెదేపా, ఐకాస నేతలను నిర్బంధించడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు.
నిరసన తెలిపే హక్కు వైకాపా వాళ్లకే కాదు దేశ పౌరులందరికీ ఉందని ఆయన అన్నారు. ఈ విధమైన అణచివేత చర్యలు అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అత్యవసర పరిస్థితుల్లోనూ దేశంలో ఇంత నిర్బంధం లేదు. తక్షణమే గృహనిర్బంధాలను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ను తాడేపల్లి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.