28.7 C
Hyderabad
April 20, 2024 06: 10 AM
Slider ప్రత్యేకం

సీఎం జగన్ ఇంటి సమీపంలో పేదల ఇళ్ల కూల్చివేతలు

#domolition

రాత్రికి రాత్రి ఇళ్లు కూలగొట్టడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో అర్ధరాత్రి పోలీసుల పహారాలో ఇళ్ల కూల్చివేత పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే సుమారు 200 ఇళ్లు వరకూ అధికారులు కూల్చేశారు.

మిగిలిన వాటిని కూడా తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఒకరోజు ముందు తేదీతో బుధవారం సాయంత్రం ఆరు గంటలకు నోటీసు ఇచ్చి బుధవారం అర్ధరాత్రి కూల్చివేతకు సిద్ధమాయ్యరు. మహిళల ఏడుపులు, పెడబొబ్బలతో ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో అమరారెడ్డి కాలనీలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా ఉంది.

సీఎం ఇంటి సమీపంలో యువకుడు ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. మరో మహిళ స్పృహ కోల్పోయింది. దాంతో అమరారెడ్డి కాలనీ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఇంట్లో ఉన్నవారు గడువు కావాలని వేడుకున్నా అధికారులు వినడం లేదు.

దాంతో వడిగిన నాని అనే వ్యక్తి ప్రొక్లెయినర్‌కు అడ్డుగా పడుకున్నాడు. పోలీసులు వచ్చి లాగేయడంతో ఇంట్లోకి వెళ్లి ఉరేసుకునే ప్రయత్నం చేశాడు. అతని సోదరి గుర్తించి కేకలు వేయడంతో పోలీసులు వెళ్లి తలుపులు తీసి అతన్ని బయటకు తీసుకొచ్చారు.

అంతకుముందు అతని తల్లి రాజ్యలక్ష్మి స్పృహ తప్పి పడిపోవడంతో అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. బాధితుల అరుపులు కేకలతో ముఖ్యమంత్రి నివాస ప్రాంతం మొత్తం ఉద్రిక్తంగా మారింది. నోటీసు ఇవ్వడానికి ముందు ఇంట్లో ఉంటున్న శివశ్రీ అనే యువతిని పోలీసులు పట్టుకెళ్లారు.

స్థానికులు  అఖిలపక్ష నాయకులు వెళ్లి గొడవచేయడంతో మధ్యాహ్నం రెండుగంటల సమయంలో వదిలేశారు. కక్షసాధింపుగా సాయంత్రం ఆరుగంటలకు వెళ్లి ఆమె ఇంటిని కూల్చివేస్తున్నట్లు నోటీసు ఇచ్చారు.

కూల్చివేతల కోసం వందలాది మంది పోలీసులు అక్కడకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న సిపిఎం నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి, బూరుగ వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు జంగాల సాంబశివరావు తదితరులు అక్కడకు చేరుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈలోపు ఇన్‌ఛార్జి కమిషనర్‌ హేమమాలిని సంఘటనాస్థలానికి రావటంతో సమయం ఇవ్వాలని కోరినా వినకుండా అర్థరాత్రి 11 గంటల సమయంలో శివశ్రీ ఇంటిని కూల్చివేశారు. కూల్చివేతలు సమయంలో ఇళ్లలో ఉంటున్న వారిని ఎవరినీ బయటకు రానీయడం లేదు.

వస్తే కేసులు పెడతామని బెదిరింపులకు దిగారు. రాత్రికి రాత్రి ఖాళీ చేయకపోతే ఉదయానే స్టేషన్‌కు తీసుకెళ్లాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎదురు మాట్లాడితే ఏ కేసులో ఇరికిస్తారో అనే భయం గృహ యజమానులను వెంటాడుతోంది.

బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్‌ను కాలనీ వాసులు కలిసి ఇళ్లు ఖాళీ చేసేందుకు నాలుగు నెలల సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా కొంత సమయం ఇస్తే తామే స్వచ్ఛందంగా ఇళ్లు ఖాళీ చేసి వెళతామని చెప్పినట్లు కాలనీ వాసులు మీడియా ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు.

రాత్రికల్లా బలవంతంగా జెసిబిలు తీసుకొచ్చి కూల్చివేతలకు అధికార యంత్రాంగం సిద్ధం కావడం ఇదెక్కడి న్యాయమని గృహ యజమానులు ప్రశ్నిస్తున్నారు.

Related posts

ఆర్ధిక మాంద్యంతో పెరుగుతున్న ఆర్ధిక నేరాలు

Satyam NEWS

ఐ‌టి రంగం ద్వారా 10 లక్షల మందికి ఉపాధి

Murali Krishna

అన్ని పండుగలు సంతోషంగా జరుపుకోవాలి

Murali Krishna

Leave a Comment