28.7 C
Hyderabad
April 20, 2024 06: 59 AM
Slider ప్రత్యేకం

Analysis: వలసపోతున్న దేశ అభివృద్ధి

#Migrant Workers

అనిశ్చిత లాక్ డౌన్ పరిస్థితి అందరినీ డోలాయమాన స్థితిలోకి నెట్టింది. రాజకీయపార్టీలు వారి విమర్శలను పక్కన పెట్టి ఆలోచించినా కోవిడ్-19 దెబ్బకు అత్యంత తీవ్రంగా నష్టపోయినవారు అసంఘటిత శ్రామిక వర్గానికి చెందిన వలస కూలీలు.

హఠాత్తుగా దేశంలో ప్రకటించిన కరోనా లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు, శ్రామిక ప్రజలు, మధ్యతరగతి వేతన జీవుల జీవితాలు మరింత దుర్భరంగా మారాయి. తినడానికి తిండిలేక, ఉండటానికి వసతిలేక యాతనపడుతున్న వలస కూలీలు, సొంత ప్రాంతాలకు  వెళ్లడానికి  రవాణా సదుపాయాలు లేక వీధులపాలయ్యారు.

సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అరకొర రవాణా ఏర్పాట్లు వలస కూలీల తరలింపుకు సరిపడా లేవని తెలుస్తోంది. లక్షలాది ప్రజల్ని సురక్షితంగా వారి సొంత ప్రాంతాలకు చేరవేసేందుకు తగిన ఏర్పాట్లు చేయని కారణంగా నేటికీ వ్యయప్రయాసలకోర్చి కాలి నడకన ఊళ్లబాట పడుతున్న వలసకూలీల ఉదంతాలు కోకొల్లలు.

తిరిగి వెళ్లే సమయంలో అవాంఛనీయ మరణాలు

ఆకలి బాధ తాళ లేక మార్గమధ్యంలోనే కొందరు  ప్రాణాలు కోల్పోవడం బాధా కరం..సురక్షితం కాని రవాణా

కారణంగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి కూడా పెరుగుతోంది. యజమానుల అమానవీయత, ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి  వలస కార్మికుల క్షోభకు కారణమని  సామాజిక అధ్యయనవేత్తల అభిప్రాయం.

రానున్న సంక్షోభాన్ని ముందుగా నే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకునివుంటే పరిస్థితి ఇంత విషమంగా ఉండదని వారు సూచించారు. కుదేలయిన ఆర్థిక వ్యవస్థ ను గాడినపెట్టడానికి కేంద్రప్రభుత్వం ప్రకటించిన 20 లక్షలకోట్ల ఉద్దీపన పథకం వలస కార్మికులకు ఏ మాత్రం మేలుచేస్తుందో అర్ధం కావడం లేదు.

నిర్మాణ రంగం నుంచి ప్రమాదకరమైన ఫ్యాక్టరీలలో పనులు చేయడం వరకూ పలు రంగాలలో విశిష్ట సేవలందించిన వలస కార్మిక వ్యవస్థను చిన్నచూపు చూడడం అన్యాయమని ప్రతిపక్షాలు తీవ్రంగా దుయ్యబట్టాయి. ఆకలితో అలమటిస్తున్న అభాగ్యులకు నేరుగా ధనసహాయం చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.

వలస కార్మికులు వెళ్లిపోతే పరిశ్రమల పరిస్థితి ఏమిటి?

బాధిత కుటుంబాలను మానవతా దృక్పథంతో ఇతోధికంగా ఆదుకోవాలని పౌర సమాజాలు కోరుతున్నాయి. ఇదంతా నాణానికి ఒకవైపు కనిపిస్తున్న దృశ్యం. వలసకార్మికుల నిష్క్రమణతో చిన్నా చితక పరిశ్రమలు, నిర్మాణ వ్యవస్థ, ప్రైవేటు రంగంలోని అనేక సంస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

సుదీర్ఘ లాక్ డౌన్ విరామం తరువాత తెరుచుకున్న పలు రంగాలు శ్రామికశక్తి లోపించడంతో అనిశ్చితి నెలకొంది. స్థానిక వనరుల వినియోగం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. కానీ అవి ఎంతవరకు సఫలం కాగలవో తేలాల్సి వుంది. కార్మిక చట్టాలకు అనుగుణంగా అమలుపర్చాల్సిన పని గంటలు, చెల్లించాల్సిన వేతనాల వంటి విషయాలను దాచిపెట్టి ఇంతకాలం యాజమాన్యాలు శ్రామిక దోపిడీకి పాల్పడ్డాయి.

సొంత ప్రాంతాలకు తరలి వెళ్లిన వారు తిరిగి వలస బాట పట్టడానికి సుముఖత వ్యక్తం చేయడం ఇప్పట్లో సాధ్యం కాదని సామాజిక శాస్త్రవేత్తల అంచనా. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలి.

ఉన్న చట్టాలను కఠినంగా, చిత్తశుద్ధితో అమలు చేయాలి. దేశ వ్యాప్తంగా ఉన్న బలమైన శ్రామికశక్తిని జాతి సమున్నత ప్రయోజనం కోసం  ఉపయోగించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వానికి చేస్తున్న విజ్ఞప్తి అనుసరణీయం.

కృష్ణారావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశ్రాంత ఉన్నతాధికారి

Related posts

మామను చంపిన ఇల్లరికం అల్లుడు

Satyam NEWS

విజయవంతంగా కొనసాగుతున్న జ్వర సర్వే

Satyam NEWS

చంద్రబాబుపై తిరిగి తెరుచుకున్న ఏసిబి కేసు

Satyam NEWS

Leave a Comment