తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు చూపిన ప్రలోభాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం లొంగిపోయిందని రాష్ట్ర సమాచార, రవాణా శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ కారణం వల్లే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిస్పక్షపాతంగా లేదని సీఎం జగన్ ఆరోపించారని మంత్రి వివరించారు. ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల వాయిదా విషయాన్ని అధికారికంగా ప్రకటించక ముందే టివి 5 కి ఎలా తెలిసిందని మంత్రి ప్రశ్నించారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ టివి 5కు ముందే చెప్పారా? ఎన్నికలు వాయిదా అంటూ టివి 5 లో మూర్తి ముందే చెప్పాడంటూ బ్రేకింగ్ లు వేసుకున్నారని మంత్రి అన్నారు. పక్కన వున్న అధికారులకు కూడా తెలియకుండా నిమ్మగడ్డ రమేష్ తన నోట్ ను సిద్దం చేసుకున్నారని, ఆఖరి నిమిషంలో వచ్చిన కాగితంపై నిమ్మగడ్డ రమేష్ సంతకం చేశారని మంత్రి అన్నారు.
ఈ విషయం టివి 5 కి, ఆంధ్రజ్యోతికి, టిడిపి కార్యకర్తలకు ముందే ఎలా తెలిసింది? అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి అభ్యర్ధులు నామినేషన్లు వేయడం తప్ప ఎక్కడా ప్రచారం చేయలేదని, పైగా ఎన్నికలు ఆగిపోతాయని ముందు నుంచే చెబుతున్నారని, దీనిని ఎలా అర్ధం చేసుకోవాలని మంత్రి ప్రశ్నించారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రవర్తన రాజ్యాంగ విరుద్దంగా ఉందని అందువల్ల మాట్లాడకుండా ఎలా వుంటాం? అని మంత్రి ప్రశ్నించారు.