ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 సందర్భంగా మూడవ రోజు సోమవారం కూడా నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం జనసంద్రంగా మారింది. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం పర్యావరణ సమతుల్యాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా కాపాడదామని, నేలపట్టు పక్షులు అభయారణ్యాన్ని అందరూ సందర్శించి ప్రకృతిని ఆస్వాదించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సోమవారం తడ మండలం పరిధిలోని నేలపట్టు పక్షుల అభయారణ్యంను కలెక్టర్ సందర్శించి పలువురు విద్యార్థినీ విద్యార్థులు, పర్యాటకులతో మాట్లాడి ఏర్పాట్ల వివరాలు వారి అనుభూతి అడిగి తెలుసుకున్నారు.
పలువురు ఏర్పాట్లపై వారి ఆనందాన్ని వ్యక్త పరిచారు. కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పులికాట్ సరస్సు నందు పెలికాన్ పక్షులు చేపలను ఆహారంగా తీసుకొని వాటి సంతతిని పెంపొందించుకొని తిరిగి వాటి సొంత ప్రాంతానికి వెళ్తాయని తెలిపారు. ఈ పులికాట్ పర్యావరణం ఒక విలక్షణమైనటువంటి ఎకలాజికల్ సిస్టమ్ కలిగి ఉంటుందని తెలిపారు. ఈ సరస్సు పర్యావరణం సమతుల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని ప్లాస్టిక్ వాడకాన్ని ఈ పరిసర ప్రాంతాల్లో వినియోగించరాదని కోరారు పర్యాటకుల సందర్శనార్థం వారికి గైడ్లను ఏర్పాటు చేయడంతో పాటు తగినంత భద్రతా ఏర్పాటు మౌలిక వసతులు ఏర్పాట్లు కల్పించడం జరిగింది అని తెలుపుతూ ఈ పక్షుల పండుగ మూడవ రోజున కూడా ఇంత అశేష జనసందోహం వచ్చి ప్రకృతిని ఆస్వాదించడం ఎంతో మంచి అనుభూతిని వారికి కల్పిస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ బైనాక్యులర్ తో పక్షులని వీక్షించారు. అంతకుమునుపు సూళ్ళూరుపేట ఎంఎల్ఏ నెలవల విజయశ్రీ నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని సందర్శించి పర్యాటకులతో మాట్లాడారు. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంను పలు కళాశాలలో పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పర్యాటకులు ప్రజలు పెద్ద ఎత్తున నేలపట్టు నందలి ఫేలికాన్ తదితర విలక్షణ పక్షులను వీక్షించేందుకు నేలపట్టుకు తరలివచ్చి వారి అనుభూతిని పంచుకున్నారు.
పలువురు మాట్లాడుతూ అక్కడ ఏర్పాటు చేసిన ఆట పరికరములతో ఆటలు, ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించి, పర్యావరణ విజ్ఞాన కేంద్రములో ఫోటో ఎగ్జిబిషన్ ను విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు, యువత, ప్రజలు అందరూ కలసి ఉత్సాహంగా పాల్గొని పక్షులను వీక్షించుటకు బారులు తీరారు. నేలపట్టు ప్రాంతం నందు వున్న విదేశాల నుండి వచ్చు రకరకాల పక్షులను చూసేందుకు తిరుపతి నెల్లూరు జిల్లాల నుండి ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి వచ్చారు.
అలాగే పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక నుండి కూడా ఈ పక్షుల పండుగను వీక్షించుటకు చాలా దూరం నుండి కుటుంబ సమేతంగా వచ్చామని పలువురు తెలుపుతూ ఇక్కడ అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయని గైడ్ల ఏర్పాటు తో మంచి విజ్ఞానాన్ని అందిస్తున్నారని అలాగే విద్యార్థిని విద్యార్థులకు బోజన వసతి కూడా కల్పించారని కూడా తెలియపరిచారు. ఇతర ప్రాంతాల నుండి ప్రజలు తండోపతండాలుగా వచ్చి పక్షులు ఉన్న ప్రాంతాన్ని ఎంతో ఆసక్తికరంగా, ఉత్సాహంగా, సంతోషంగా తిలకించారు.








నేలపట్టు ప్రాంతం పండగ వాతావరణంతో నిండిపోయినదని, ఇలాంటి పక్షుల పండుగ వీక్షించే అవకాశాలు చాలా అరుదుగా ఉంటాయని, వారికి ఇలాంటి అవకాశాలు కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, పర్యాటక శాఖ మంత్రి కి, స్థానిక ఎమ్మెల్యే కి,జిల్లా జిల్లా కలెక్టర్ మరియు వారి యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని పలువురు ఈ సందర్భంగా తెలిపారు. నేలపట్టు ప్రాంతానికి విచ్చేసిన విద్యార్థి విద్యార్థులకు యువతకు, ప్రజలకు మౌలిక వసతులైన మెడికల్ క్యాంప్, టాయిలెట్స్,ఉచిత త్రాగునీరు తదితర వసతులను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని సంతోషం వ్యక్తపరిచారు.
అలాగే వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 3000 మంది పైగా విద్యార్థిని విద్యార్థులకు ఉచిత భోజన సదుపాయాలు కూడా కల్పించడం జరిగినదని వారు ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇటువంటి మంచి నిర్ణయాల వల్ల ఇలాంటి అవకాశం వస్తుందని తెలిపారు.
గూడూరు నుండి వచ్చిన మినర్వా ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు అందులో ప్రదీప్త,రుచిత అనే విద్యార్థులు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలు జరగలేదని మేము చూడలేదని తెలుపుతూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం వలన మాలాంటి విద్యార్థినీ విద్యార్థులకు చాలా ఉపయోగకరముగా ఉంటుందని వారు తిలకించిన ఈ అనుభూతిని మాటలలో చెప్పలేని మరుపురాని తీయని అనుభూతి అని, ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాంటి వేడుకలు జరిగితే ఎంతో మంది విద్యార్థులు వచ్చి చూచుటకు అవకాశం ఉంటుందని తెలిపారు. చాలా సంతోషం ఉన్నాయని పిల్లలకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతి దీని వల్ల వస్తుందని తెలిపారు.
స్థానికంగా ఉన్న ప్రజలు మాట్లాడుతూ ఈ కొలనులో పెలికాన్ వంటి ఎన్నో రకాల విలక్షణ పక్షులు వుంటాయని, వాటిని చూడటం చాలా ఆనందంగా ఉందని సుమారు మూడు నాలుగు మాసాలు పక్షులు ఈ ప్రాంతంలో ఉండటం వలన కుంటలలో ఉన్న నీరు, పొలాల మీదుగా ఈ పక్షులు వెళ్ళినప్పుడు వాటి విసర్జిత వ్యర్ధాలు సారవంతమైన నత్రజని కలిగి ఉండడం వలన ఈ పక్షులు దేవత పక్షులు అని ఈ ప్రాంత వాసులు అంటుంటారని తెలిపారు.
గత ప్రభుత్వంలో ఇలాంటి సందర్భాలు రాలేదని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి మంచి నిర్ణయాలతో టూరిజం ఉన్న ప్రదేశాలు బాగా అభివృద్ధి చెందుటకు అవకాశం ఉంటుందని పలువురు ఈ సందర్భంగా వారి స్పందనను తెలియపరచారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మరియు మాజీ మంత్రి పరసారత్నం సంబంధిత అటవీశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
