35.2 C
Hyderabad
April 20, 2024 16: 04 PM
Slider సంపాదకీయం

హైదరాబాద్ మునగడానికి కారణాలు తెలియవా?

#HyderabadFloods

హైదరాబాద్ పక్కన సముద్రం లేదు. నది ఉందా అంటే అదీ లేదు. అయితే వరదలు వచ్చాయి. వారం రోజులు దాటినా ఇంకా నీళ్లు ఉన్నాయి. ఇళ్ల నుంచి నీళ్లు పోయిన చోట కడగలేనంత బురద పేరుకుపోయింది. కోట్లాది రూపాయల ధన నష్టం సంభవించింది. పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి.

తాగేందుకు నీటి కోసం తపనపడే ప్రాంతాలలో వరద నీరు పోటెత్తింది. వీధులకు వీధులు, బస్తీలకు బస్తీలు నీటిలో మునిగిపోయాయి. ఇవన్నీ….. వాన తగ్గిన తర్వాత మర్చిపోతాం. నీట మునిగిన ఇంటి వారు కూడా మర్చిపోతారు. మళ్లీ మామూలే…. నాలాలపై ఇళ్లు… చెరువుల కబ్జాలు…. ఇంటికి ఇంటికి మధ్య కనీసం మూడు అడుగుల దూరం కూడా లేకుండా కట్టుకోవడం, అక్రమ ఆక్రమణలు…. మళ్లీ మామూలే…ఇది ఒక్క హైదరాబాద్ బాధే కాదు.

 పెరుగుతున్న ప్రతి పట్టణం, ప్రతి నగరం బాధ. అయితే హైదరాబాద్ లో ఒక ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ మధ్య నుంచి వెళ్లే మూసీ నదిని కొద్ది మేరకు ఆక్రమిస్తే 30 ఏళ్ల కిందట పెద్ద వార్త. మూసీలో అక్రమ కట్టడాలు అంటూ శీర్షిక పెట్టి వార్తలు రాసేవాళ్లం. మూసీ నదిలో అక్రమంగా పంటలు పండించే వారు…. దాన్నీ వార్తగా రాసేవాళ్లం.

చెరువులు కాల్వలు కబ్జా

ప్రవాహాన్ని అడ్డుకుంటున్నారని, దీనివల్ల ప్రమాదమని. 30 ఏళ్ల కిందట నల్లకుంటలో మూసీ కాల్వను ఒక వ్యక్తి మట్టిపూసి నింపి ఆ తర్వాత పెద్ద భవనం కట్టి కాలేజీకి అద్దెకు ఇచ్చాడు. అది మొదలు మూసీ కాల్వ మొత్తం ఆక్రమణలతో నిండిపోయింది. ఇలా ఒక్కటి కాదు.

దుర్గం చెరువు గమనించారా? తీగల వంతెన అంటూ ఘనంగా చెప్పుకున్నాం. అలాంటి దుర్గం చెరువు ప్రవాహానికి అడ్డంగా అపార్టుమెంట్లు ఉంటాయి. ఉప్పల్ లో పెద్ద చెరువు ఉండేది. ఇప్పుడు లేదు. అంబర్ పేట్ లో చెరువు ఉండేది ఇప్పుడు లేదు. కూకట్ పల్లి నుంచి బాలానగర్ అల్వాల్ వరకూ చెరువులు చాలా ఉండేవి ఇప్పుడు లేవు.  మూసీ నదిని పూర్తిగా ఆక్రమించారు. భూ దాహం తీరలేదు.

మూసీ కాల్వలను ఆక్రమించారు. మూసీ కాల్వలకు అడ్డంగా భవనాలు కట్టారు. మెల్లిగా సైడు కాల్వలు ఆక్రమించారు. భూగర్భ డ్రైనేజీ ఉంటే దానిపై భవనాలు కట్టుకున్నారు. నగరం లోని మూల మూలలా ఆక్రమణలే. మూడు అంతస్తులు కట్టుకోమని పర్మిషన్ ఇస్తే ఐదు అంతస్తులు కట్టుకున్నారు. కాల్వలు అయిపోయాయి.

స్మశానాల స్థలాలు కూడా ఆక్రమించారు

పార్కులు, బహిరంగ స్థలాలు, స్మశానాలు ఆక్రమించారు. చెరువుల ఆక్రమణలు మొదలు పెట్టారు. హైదరాబాద్ పరిసరాల్లో పూర్వపు రంగారెడ్డి జిల్లాలో ఉన్న చెరువులన్నీ ఇప్పుడు లేవు. ఆక్రమణలకు గురయ్యాయి. అంతెందుకు హుస్సేన్ సాగర్ కూడా సగానికి సగం తగ్గిపోయింది.

చెరువుల్లో అక్రమ ఆక్రమణలు పెరిగిపోయాయి. అక్రమ లేఅవుట్లు ఎక్కువ అయ్యాయి. ఫుల్ రిజర్వాయర్ లెవెల్ లో కూడా ఇళ్లు వెలిశాయి. అన్నింటికి మునిసిపాలిటీ నెంబర్లు ఉంటాయి. కరెంటు కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎవరిని తిట్టాలో తెలియక వర్షాన్ని తిట్టుకుంటున్నారు. గంగమ్మ తల్లి శాంతించాలని ప్రభుత్వ పక్షాన పూజలు చేస్తున్నారు. చాదర్ లు సమర్పిస్తున్నారు. చేసిందంతా చేసి ఇప్పుడు పూజుల చేస్తే సరిపోతుందా?

అక్రమ ఆక్రమణలు తొలగించాల్సిన ప్రభుత్వం ఇంత కాలం నిద్ర పోయిందా? (ప్రభుత్వం అంటే అందులోనే జీహెచ్ ఎంసి కూడా ఒక భాగం) చెరువులు అక్రమిస్తుంటే రెవన్యూ శాఖ ఏం చేస్తున్నది? నీటిపారుదల శాఖ లోని విభాగాలు ఏం చేస్తున్నాయి? అసలు ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారు? చెరువులు, కాల్వలు ఆక్రమించడం స్థానిక ఎమ్మెల్యేకు, కార్పొరేటర్ కు తెలియకుండా జరుగుతుందా? జరిగే అవకాశం ఉందా?

తప్పు ప్రజలది కాదు ప్రభుత్వానిదే

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒకరు పోస్టు పెట్టారు… హైదరాబాద్ కు వరదలు రావడం, నీట మునగడం… ఇదంతా ప్రజల తప్పేనని. ప్రజలు తప్పు చేస్తారనే కదా చట్టాలు ఉన్నది. ఆ చట్టాలను అమలు చేయడానికే కదా ప్రభుత్వాలు ఉన్నది.

మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల ఒక కాలనీ సందర్శనకు వెళ్లినప్పుడు అక్కడ అక్రమ నాలా ఆక్రమణలపై స్థానికులు గొడవ చేశారు. మీరందరూ ఒప్పుకుంటే అక్రమ ఆక్రమణలు కూల్చి వేస్తాం… మళ్లీ ఆక్రమణలు కూల్చి వేస్తుంటే అన్యాయం జరిగిందని అడ్డుకోవద్దు అని అంటున్నారు.

అక్రమాలు క్రబద్దీకరిస్తున్నారు

ఇదా ప్రభుత్వం చెప్పాల్సింది? ఇదా ప్రభుత్వం చేయాల్సింది? అక్రమ ఆక్రమణలను క్రమబద్దీకరించే ప్రభుత్వం ఆ నిర్మాణాలు కాల్వలపై ఉన్నాయా, చెరువుల్లో ఉన్నాయా అనేది చూస్తున్నదా? చెరువులు ఆక్రమణకు గురి అవుతున్నాయని ఇప్పటికీ పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా వార్తలు వస్తున్నాయి.

హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న అతి పెద్ద చెరువుల్లో జల్ పల్లి చెరువు, ఉందాసాగర్, పల్లె చెరువు ఉన్నాయి. ఇవన్నీ మంచినీటి చెరువులు. వీటిలో ఆక్రమణలు చేస్తున్నారని వార్తా పత్రికల్లో వ్యాసాలు వస్తున్నా ప్రభుత్వం ఏ మాత్రం అడ్డుకోవడం లేదు. కంటితుడుపుగా ఒకటి రెండు నిర్మాణాలు కూల్చడం ఆపేయడం… తర్వాత ముడుపులు…లంచాలు… ఇదీ కథ. దీనికంతటికి ప్రభుత్వం బాధ్యత వహించాలి.

ఎమ్మెల్యేలకు తెలియకుండా ఆక్రమణలు జరుగుతాయా?

ప్రభుత్వం అంటే అధికార పార్టీనే బాధ్యత వహించాలి. అధికార పార్టీ అంటే ఎమ్మెల్యేలు, ఎంపిలు, కార్పొరేటర్లు బాధ్యత వహించాలి. పని చేయని ప్రభుత్వ అధికారులు బాధ్యత వహించాలి. లంచాలకు మరిగిన అవినీతి అధికారులు బాధ్యత వహించాలి.

కనీసం 2000 సంవత్సరం మ్యాప్ లు తీసుకుని అప్పటి స్థాయికి చెరువులు వాటి అప్రోచ్ కాల్వలు ఇప్పటికైనా పునరుద్ధరించాలి. చెరువులు, నాలాల ఆక్రమణలు కూల్చి వేయాలి. 100 సెంటీమీటర్ల వర్షం ఒక్క గంటలోనే కురిసినా నీరు వెళ్లిపోయే వ్యవస్థ తో సమగ్ర వాటర్ మ్యాప్ రూపొందించాలి.

అండర్ గ్రౌండ్ డ్రైనేజి పేరుతో కోట్లు కొట్టేయడం కాదు. చిత్తశుద్ధితో నాలాలు పునరుద్ధరించండి. చెరువుల ఆక్రమణలు తొలగించండి. అంతే కానీ వర్షాన్ని తిట్టుకుంటూ దేవుడికి చీరలు చాదర్ లు ఇస్తూ సెంటిమెంటుతో కాలం గడపకండి.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యంన్యూస్.నెట్    

Related posts

మ‌హిళా ర‌క్ష‌ణ డిమాండ్‌తో విజ‌య‌న‌గ‌రంలో టీడీపీ కొవ్వొత్తుల ర్యాలీ

Sub Editor

న్యూ క్రాప్: తెలంగాణ నేలపై పండుతున్న డ్రాగన్ ఫ్రూట్

Satyam NEWS

పండుగ రోజు తిండి ముట్టకూడదని రైతుల నిర్ణయం

Satyam NEWS

Leave a Comment