సెల్ఫీ ఫోటోలతో ప్రజాప్రతినిధులు, అధికారుల సందడి
ఆదిలాబాద్ పట్టణ సుందరీకరణ లో భాగంగా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ వద్ద గల చౌరస్తాలో నూతనంగా ఏర్పాటుచేసిన ఐ లవ్ అదిలాబాద్ ఐకాన్ సెల్ఫీ స్పాట్ ను సోమవారం అట్టహాసంగా ప్రారంభించారు.
మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సుందరంగా తీర్చిదిద్ధిన ఈ సెల్ఫీ స్పాట్ ను జడ్పీ ఛైర్మన్ జనార్దన్ రాథోడ్, ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఎమ్మెల్యే జోగు రామన్న లతో కలిసి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు.
అనంతరం ఐ లవ్ అదిలాబాద్ బోర్డు ఎదుట సెల్ఫీ ఫోటోలు దిగుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సందడి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ప్రజలను ఆకట్టుకునేలా పట్టణ సుందరీకరణ లో భాగంగా ఐలవ్యూ అదిలాబాద్ జంక్షన్ ను మోడల్ గా ఏర్పాటు చేశామన్నారు.
పట్టణంలోని అన్ని చౌక్ లను కూడా ఇదేవిధంగా సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సెంట్రల్ లైటింగ్, రోడ్డు వెడల్పు పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని వాటిని త్వరలోనే పూర్తిచేసి సుందర అదిలాబాద్ ను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, మున్సిపల్ కమిషనర్ శైలజ, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, వార్డు కౌన్సిలర్లు అంబకంటి అశోక్ , రామెళ్లి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.