30.7 C
Hyderabad
April 17, 2024 00: 09 AM
Slider ప్రత్యేకం

ద్వివేదీ, గిరిజాశంకర్ లకు ఎన్నికల కమిషనర్ అభిశంసన

#GopalakrishnaDwivediIAS

ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియను ఉద్దేశ్యపూర్వకంగా ఆలశ్యం చేసినందుకు ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులపై తీవ్రాతి తీవ్రమైన చర్యలు తీసుకున్నారు.

అత్యంత అరుదైన రీతిలో డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ తీసుకున్న ఈ చర్యలతో పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, గతంలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా సర్వ స్వతంత్రంగా పని చేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డిజిపిని కూడా బదిలీ చేసిన గోపాలకృష్ణ ద్వివేదీ ఇరకాటంలో పడినట్లయింది.

ఆయనతో బాటు పంచాయితీ ఎన్నికల ప్రక్రియను కావాలని అడ్డుకున్న నేరానికి మరో ఐఏఎస్ అధికారి పంచాయితీరాజ్ శాఖ కమిషనర్ ఎం.గిరిజాశంకర్ కూడా తీవ్రమైన అభిశంసనను ఎదుర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ సుదీర్ఘమైన ఆదేశాలు జారీ చేశారు.

గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్ లను అభిశంసిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేయడంతో వారి ఐఏఎస్ సర్వీసులో ఒక నల్లమచ్చగా మిగిలిపోతుంది. ఇకపై వారికి పదోన్నతులు ఇచ్చేందుకు ఈ అభిశంసన అడ్డంకిగా మారుతుంది.

ఎవరూ ఊహించని చర్య ఇది

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ విధంగా ఇద్దరు ఐఏఎస్ అధికారులపై తీవ్రాతి తీవ్రమైన చర్యలు తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. ఈ ఇద్దరు అధికారులు ఎన్నికల కమిషనర్ ఆదేశాలకు విరుద్ధంగా ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడాన్ని డాక్టర్ రమేష్ కుమార్ తీవ్రంగా పరిగణించారు.

పంచాయితీ రాజ్ ఎన్నికలలో తాజాగా రూపొందించిన 2021 ఓటర్ల జాబితాను దురుద్దేశపూర్వకంగా ఈ ఇద్దరు అధికారులు తొక్కి పెట్టారు. ఈ కారణంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ 2019 నాటి ఓటర్ల జాబితాను అమలు చేయాల్సి వచ్చింది. ఫలితంగా మూడు లక్షల 62 వేల మంది కొత్త ఓటర్లు ఈ ఎన్నికలలో ఓటు వేయలేకపోతున్నారు.

(అధికారుల ఉద్దేశ్యపూర్వక కుట్రతో జరిగిన ఈ పనిని ఎన్నికల సంఘంపైకి నెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు)

కేవలం ఎన్నికలను అడ్డుకోవడానికి మాత్రమే ఈ ఇద్దరు బాధ్యతగల అధికారులు బాధ్యతారహితంగా ప్రవర్తించారని ఎన్నికల కమిషనర్ ఆక్షేపించారు. రాజ్యాంగం ప్రకారం తనకు సంక్రమించిన అధికారాలను దృష్టిలో ఉంచుకుని ప్రజాస్వామ్య వ్యవస్థలో చేయరాని పని చేసిన ఈ ఇద్దరు ఐ ఏఎస్ అధికారులు శిక్షకు అర్హులని ఎన్నికల కమిషనర్ అభిప్రాయపడ్డారు.

గోపాల కృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్ లు కావాలనే కుట్రపూరితంగా వ్యవహరించడంపై ఎన్నికల సంఘం పలు మార్లు హెచ్చరించిన వారు స్పందించలేదు. గోపాలకృష్ణ ద్వివేదీ అయితే మరో అడుగు ముందుకు వేసి ఎన్నికల కమిషనర్ కోరిన సిబ్బందిని కూడా సమకూర్చలేదు.

దాంతో ఎన్నికల ప్రక్రియ మొత్తం ఆలశ్యం కావడమే కాకుండా పాత ఓటర్ల జాబితాను అమలు చేయాల్సి వచ్చింది. పంచాయితీ రాజ్ వ్యవస్థ లో కొత్త యువ ఓటర్లు ఎంతో కీలకపాత్ర పోషిస్తారు. గ్రామ స్థాయిలో కొత్త ఓటర్ల పాత్ర ఎంత పెరిగితే ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా ఉంటుంది.

ఈ ప్రాధమిక సూత్రాన్ని కూడా మరచిపోయిన సీనియర్ ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్ ల సర్వీస్ రిజిస్టర్ లో ఈ అంశాన్ని రికార్డు చేయాలని కూడా సంబంధిత అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్.ఎన్.రమేష్ కుమార్ సిఫార్సు చేశారు.

దేశంలోనే మొదటిసారిగా ఇద్దరు ఐఏఎస్ అధికారులు అభిశంసనకు గురి అయ్యారు. ఈ చర్యతో వారిద్దరూ భవిష్యత్ లో ఉద్యోగంలో పదోన్నతులు విషయంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

Related posts

బోట్ పెట్రోలింగ్ తో వలలను పట్టుకున్న కొల్లాపూర్ రేంజ్ అధికారి

Satyam NEWS

ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

Satyam NEWS

నష్టపోయిన ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు మంజూరుచేయాలి

Bhavani

Leave a Comment