దేశ రాజధాని ఢిల్లీ నుంచి జమ్మూ కా లోని కాట్రా వరకు నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (ట్రైన్ 18) గురువారం ప్రారంభమైంది. ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఈ రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా జెండా ఊపి ప్రారంభించారు. కాట్రాలోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులకు ఈ రైలు ఎంతో ఉపయోగపడనున్నది. ఢిల్లీ – కాట్రా మధ్య ప్రస్తుతం ప్రయాణ సమయం 12 గం.లు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌తో ఈ సమయం 8 గంటలకు తగ్గనున్నది. మంగళవారం మినహా మిగతా అన్ని రోజుల్లో ప్రయాణించనున్న ఈ రైలు వాణిజ్య సేవలు అక్టోబర్ 5 నుంచి అందుబాటులోకి రానున్నాయి. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆర్టికల్ 370 పెద్ద అడ్డంకి. ఢిల్లీ – కాట్రా మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభంతో జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి పథంలో కొనసాగనున్నదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రారంభ కార్యక్రమంలో కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, హర్షవర్ధన్, జితేందర్ సింగ్ పలువురు పాల్గొన్నారు. ఈ రైల్లో మొత్తం 16 పూర్తి ఎయిర్ కండీషన్ కోచ్‌లున్నాయి. రెండు ఎగ్జిక్యూటివ్ కోచ్‌లను సెన్సర్ డోర్లు కలిపేలా ఏర్పాటు చేశారు. ప్రతి కోచ్‌లో 180 డిగ్రీల కోణంలో తిరిగే సీట్లు ఉన్నాయి. ఐస్ క్రీమ్, స్వాగత పానీయాలు (వెల్‌కమ్ డ్రింక్స్) పెట్టేందుకు ఫ్రీజర్ ఏర్పాటు చేశారు. వేడివేడి టీ, కాఫీ వంటి పానీయాల కోసం మూడు హాట్ కేసులు, చల్లటి మంచినీటి కోసం రెండు బాటిల్ కూలర్లు అమర్చారు. ప్రయాణికులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ప్యూరిఫయర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ట్రైన్ పైలెట్లకు, గార్డులకు మధ్య ప్రత్యక్ష సమాచార మార్పిడి కోసం ఫోన్ హ్యాండ్ సెట్లు ఉన్నాయి. ప్రయాణికులకు హానికరమైన సూర్య కిరణాలు తగులకుండా యాంటీ – స్పా ల్ ఫిల్ములను కిటికీ అద్దాల్లో వాడారు. గంటకు 130 కి.మీ వేగంతో ప్రయాణించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్లాస్టిక్ బాటిల్స్‌ను రీసైకిల్ చేయడానికి మొదటి, చివరి కోచ్‌లలో క్రషింగ్ మెషిన్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు సీసీటివి పర్యవేక్షణ, ఆటోమేటిక్ డోర్స్, ఎల్‌ఈడి తెరలు, కంప్యూటరైజ్డ్ సిస్టం తదితరాలు ట్రైన్ 18 కు అదనపు హంగులుగా ఉన్నాయి
previous post
next post