20.7 C
Hyderabad
December 10, 2024 00: 59 AM
Slider సంపాదకీయం

కోట్లు కూడబెట్టిన కల్కీ అవతారం

ammabhagavan

కల్కీ అంటే విష్ణుమూర్తి పదో అవతారం అనుకున్నారు కానీ కోట్లాది రూపాయలు సంపాదించే అక్రమావతారం  అనుకోలేదు. భగవాన్ అని పేరు తగిలించుకోగానే ప్రతి వాడూ భగవంతుడు అయిపోడని కల్కీ భగవాన్, అమ్మా భగవాన్ లు నిరూపించారు. చిత్తూరు జిల్లా వరదయ్య పాళెం మండలం బత్తలవలం గ్రామ సమీపంలో ఉన్న కల్కి భగవాన్ ఆశ్రమంలో కూడా ఐటి అధికారులు ఇటీవల దాడులు చేశారు. ఇక్కడే కాకుండా తమిళనాడు రాష్ట్రంలోని ఆశ్రమాలపై కూడా దాడి చేసి తనిఖీలు చేశారు.

మొత్తం సుమారుగా 500 కోట్ల రూపాయల విలువైన నగలు నగదు ఆస్తుల డాక్యమెంట్లు దొరికాయంటే భక్తుల్ని ఎంత మేరకు మోసం చేస్తే ఇంతలా సంపాదించవచ్చో అర్ధం చేసుకోవచ్చు. 5 కోట్లు విలువచేసే వజ్రాలు. 26 కోట్లు విలువ చేసే 88 కేజీల బంగారం. 40.39 కోట్ల నగదుతో పాటు 18 కోట్ల విదేశీ కరెన్సీ. 409 కోట్ల రూపాయల ఆస్తులు….ఇవీ కల్కీ భగవాన్ ఆస్తులు. కల్కీ భగవాన్ చేసిన భూ దందాలకు సంబంధించిన 1182 డాక్యుమెంట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలు వెలుగులోకి రావాలంటే కల్కీ వేలుముద్రలు పాస్ వర్డ్ గా ఉండటంతో అధికారులు సంబంధిత హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. కల్కి భగవాన్‌ ఆశ్రమంలో మూడు రోజులు ఐటీ సోదాలు నిర్వహించే సరికి భారీగా అక్రమాస్తులను గుర్తించారు. కల్కీ భగవాన్ ఆశ్రమం వ్యవస్థాపకుడు కల్కి భగవాన్ అలియాస్ విజయ్‌ కుమార్‌, అమ్మా భగవాన్ అలియాస్ పద్మావతిలు దాడుల జరుగున్నప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అధికారులు చేపట్టిన తనిఖీల్లో క్యాంపస్‌-3లో భారీగా విదేశీ నగదు, బంగారాన్ని గుర్తించారు.

ఈ మేరకు కల్కి భగవాన్‌ కుమారుడు కృష్ణ నాయుడు, కోడలు ప్రీతినాయుడు, ట్రస్ట్‌ నిర్వహకుడు లోకేష్‌ దాసాజీని అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు. స్వదేశీ, విదేశీ భక్తుల ద్వారా భారీ ఎత్తున విరాళాలు సేకరించి.. వందల ఎకరాలు, కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కొనుగోలు చేసినట్లు ఐటీ అధికారులు నిర్ధారించారు. ఈ దాడుల అనంతరం అధికారులు తాము స్వాధీనం చేసుకున్న వివరాలను వెల్లడించారు. అసలు ఇద్దరు మనుషులు కలిసి ఎంత మందిని ఫూల్స్ ను చేస్తే ఇంత మేరకు డబ్బు కూడబెట్టవచ్చో అర్ధం చేసుకోవాలి.

కల్కి ఆశ్రమం స్థాపించినప్పటి నుంచి నేటి వరకు భూముల కొనుగోళ్లు, ఆశ్రమానికి భక్తులు ఇచ్చిన విరాళాలు, ఆధ్యాత్మిక శిక్షణ తరగతుల పేరిట డబ్బు వసూలు, గ్రామాల అభివృద్ధి పేరుతో డొనేషన్లు, వన్ నెస్ ట్రస్ట్ పేరుతో స్వాహాలు, ఆశ్రమ నిర్వాహక సహచరుల వెంచర్లలో భారీ పెట్టుబడులు, ‘కల్కి’ కుమారుడు కృష్ణాజీ రెస్టారెంట్ల వ్యాపారం, విదేశీ పెట్టుబడులు ఇలా చాలా ఉన్నాయి.

చెన్నై గ్రీమ్స్‌ రోడ్డులోని కల్కి ఆశ్రమం, నుంగంబాక్కంలోని ప్రధాన కార్యాలయం, చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని ప్రధాన ఆశ్రమం, రామకుప్పం వద్ద ఉన్న ‘సత్యలోకం’ ఆశ్రమం, చెన్నైలోని అన్నానగర్‌, వేలచ్చేరి, నుంగంబాక్కం, థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాల్లోనూ, తిరువళ్లూరు జిల్లా నేమం ఆశ్రమంలోనూ సోదాలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం, బత్తులవల్లంలోని ఏకం ఆలయాల్లోనూ, ఉబ్బలమడుగు సమీపంలోని వన్నెస్‌ ప్రాంగణం, హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌ లోని కల్కి కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించారు.

వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న రెస్టారెంట్లకు సంబంధించి కూడా లెక్కలు సరిగా చూపకుండా పన్ను ఎగవేశారు. వీటిలో చెన్నైలో 7 శాఖలు, మదురై, ఆంబూర్‌ బెంగళూరుల్లోనూ కొన్ని శాఖలున్నాయి. ఖతార్‌ రాజధాని దోహాలో రెండు రెస్టారెంట్లున్నాయి.

కల్కి భగవాన్ అసలు పేరు విజయకుమార్. తమిళనాడు, వెల్లూరి జిల్లా, గడియాతం గ్రామంలో 1949, మే7న ఆయన జన్మించాడు. తండ్రి రైల్వే ఉద్యోగి. డి.జి. వైష్ణవి కాలేజీలో డిగ్రీ పాస్ అయి ఎల్ఐసిలో క్లర్క్ ఉద్యోగం చేశాడు. 1977లో పద్మావతిని పెళ్ళి చేసుకున్నాడు. తన 35ఏళ్ళు వయస్సులో 1984, జులై 8న ‘జీవాశ్రమం’ పేరుతో గుర్తింపు లేని పాఠశాల ఏర్పాటు చేసి 1991లో మూసేశాడు. మూసిన పాఠశాలను ‘సత్యలోక’గా మార్చి ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేశాడు.

కల్కి భగవాన్‌ ఉరఫ్‌ విజయకుమార్‌ తనను తాను విష్ణుమూర్తి పదవ అవతారమైన కల్కిగా ప్రకటించుకున్నాడు. ఆయన దర్శనానికి 500లు, ఆయన పాదం చూస్తే వెయ్యి, పాద పూజకు ఐదు వేలు, మాట్లాడేందుకు పాతిక వేలు, దీక్షకు 50 వేలు వసూలు చేశాడు. ‘మూలమంత్రం’ అంటూ ఒక మంత్రాన్ని సృష్టించి దాన్ని లాకెట్‌లో ఉంచి, ఆ లాకెట్‌ని భారతీయులకు 50 వేలు, విదేశీయులకు లక్ష రూపాయలకు అమ్మాడు. కల్కి భగవాన్, అమ్మా భగవాన్ ఇద్దరూ ప్రజల మానసిక బలహీనతలపై ఆర్థిక భవంతులు అంచెలంచెలుగా నిర్మించుకున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి రాజప్రసాదాలు నిర్మించుకున్నారు. నిజంగా ఇది కలియుగ అవతారమేనని నిరూపించారు.

Related posts

సి విజిల్ యాప్ పై ప్రజల్లో అవగాహన

Satyam NEWS

చెత్తపలుకు: మోడీని కలిస్తే భయమెందుకు?

Satyam NEWS

Heats off: వృద్దురాలికి ఆశ్ర‌యం క‌ల్సించిన ఏటీకే సంస్థ‌…!

Satyam NEWS

Leave a Comment