అంతర్జాతీయ చట్టాల ప్రకారం దక్షిణ చైనా సముద్రంలో వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారత్, ఇండోనేషియాలు నిర్ణయించాయి. దక్షిణ చైనా సముద్రం చైనా, తైవాన్, బ్రూనై, మలేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాంతో సహా అనేక దేశాలతో తీరాన్ని పంచుకుని ఉన్న ప్రాంతం. ఈ వివాదంలో ద్వీపాలపై హక్కులు, సముద్ర హక్కులకు సంబంధించిన పలు అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో చమురు, సహజ వాయువు మరియు మత్స్య సంపద ఎక్కువగా ఉంది. అంతేకాకుండా, ఈ మార్గం ప్రపంచ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు కీలకమైన వాణిజ్య మార్గం. ఇది ప్రాంతీయ శక్తి సమతుల్యతను ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది.
ఈ కారణంగానే దక్షిణ చైనా సముద్రంలో శాంతిని కొనసాగించడం అత్యవసరమని భారత్, ఇండోనేషియా తమ ఉమ్మడి ప్రకటనలో పునరుద్ఘాటించాయి. 1982 UNCLOS అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా దక్షిణ చైనా సముద్రంలో వివిధ దేశాలు తమ హక్కులను కాపాడుకోవాలని రెండు దేశాలు కోరాయి. దక్షిణ చైనా సముద్రంపై భారత్ కు ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం (UNCLOS) 1982 ప్రకారం అంతర్జాతీయ జలాల్లో నావిగేషన్ స్వేచ్ఛ, ఓవర్‌ఫ్లైట్ మరియు అవరోధం లేని చట్టబద్ధమైన వాణిజ్యానికి వీలుకల్పిస్తుంది. అందుకే అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా, శాంతి, స్థిరత్వం ప్రోత్సహించడానికి అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు భారత్ తెలిపింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వాన్ని కొనసాగించాలని ఇండోనేషియా కూడా ప్రకటించింది.