32.2 C
Hyderabad
April 20, 2024 20: 56 PM
Slider విజయనగరం

వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలను స్వాగతించాలి

మారుతున్న పరిస్థితులను బేరీజు వేసుకుంటూ వ్యవసాయ రంగంలో వచ్చే నూతన ఆవిష్కరణలను స్వాగతించాలని తద్వారా గతం కంటే మిన్నగా ఆర్థిక ప్రయోజనాలను పొందాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. సంప్రదాయ పద్ధతులను గౌరవిస్తూనే సాగు విధానంలో ఆధునిక పద్ధతులను అవలంబించాలని సూచించారు. స్థానిక కలెక్టరేట్ మీటింగు హాలులో జరిగిన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆమె పలు అంశాలపై మాట్లాడారు. లాభదాయక పంటలను సాగు చేయటం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను పొందాలని సూచించారు.
ఎప్పుడూ ఒకే రకమైన పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని రైతులను ఉద్దేశించి పేర్కొన్నారు.

తక్కువ కాలంలో అందుబాటులోకి వచ్చే పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జిల్లాలో అవలంబించిన నూతన విధానాల ఫలితంగా ఈ ఏడాది వరి దిగుబడి ఎకరాకు మూడు క్వింటాలు పెరిగిందని ఇదే ఒరవడి కొనసాగించేలా వ్యవసాయ శాఖ పని చేయాలని కలెక్టర్ నిర్దేశించారు. వచ్చే సీజన్ నీ దృష్టిలో ఉంచుకొని మైనర్ సాగునీటి కాలువలను అభివృద్ధి చేయాలని, పూడికలు తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రణాళికాయుతంగా వ్యవహరించాలని అన్నీ సిద్ధం చేసుకోవాలని సూచించారు. తేమ శాతం కొలిచే యంత్రాలను, గోనె సంచులు సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. బ్యాంక్ గ్యారంటీలకు సంబధించిన పెండింగ్ ప్రక్రియలను పూర్తి చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తు అవసరాలను, వ్యవసాయ రంగంలో వచ్చే మార్పులను దృష్టిలో ఉంచుకొని ఉత్పాదకతను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మూడో పంట కాలంలో పండే అపరాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, రైతులకు ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చాలని సూచించారు.

అనంతరం వ్యవసాయ సలహా మండలి చైర్మన్ గేదెల సత్యనారాయణ మాట్లాడుతూ ఆధునిక పద్ధతులను ఆశ్రయించటం ద్వారా సాగు ఖర్చును తగ్గించాలని, ఈ మేరకు ప్రయోగాత్మక చర్యలు చేపట్టాలని సూచించారు. దోమలు, కీటకాల ధాటిని తట్టుకొనే విధంగా వంగడాలను తయారు చేయాలని, వాటిపై రైతులకు అవగాహన కల్పించి అందజేయాలని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో వచ్చే మార్పులను ఆహ్వానించాలని హితవు పలికారు. నిర్ణీత కాలంలో పంటలు వేసేలా రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు.

సీడ్ డ్రిల్లింగ్, జీరో టిల్లేజ్ విధానాలకు ప్రాధాన్యం

రాగోలు వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన ప్రిన్సిపాల్ సైంటిస్ట్ పి.వి. సత్యనారాయణ వ్యవసాయ రంగంలో జరుగుతున్న పరిణామాలు, అనుసరించాల్సిన విధానాల గురించి పలు సూచనలు చేశారు. జీరో టిల్లెజ్ (దుక్కి దున్నకుండా) విధానాన్ని అనుసరించటం ద్వారా సాగు ఖర్చు తగ్గుతుందని లాభాలు చేకూరుతాయని పేర్కొన్నారు.

అలాగే సీడ్ డ్రిల్లింగ్ విధానం ద్వారా తక్కువ కాలంలో వరి పంట ఫలాలను పొందవచ్చని, మనుషుల అవసరం కూడా తగ్గుతుందని చెప్పారు. కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలో ఈ విధానాలను అవలంబిస్తూ ప్రయోజనాలు పొందుతున్నారని, కావున ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా వీటికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. తక్కువ కాలంలో అందివచ్చే పంటలను ప్రోత్సహించాలని సూచించారు. మట్టి నాణ్యత, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సాగు విధానాలను పాటించాలని, రైతులను అప్రమత్తం చేస్తూ ఉండాలని పేర్కొన్నారు.ఇటీవల కాలంలో జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందం పలు అంశాలకు సంబంధించి సిఫార్సులు చేసిందని కలెక్టర్ సూర్యకుమారి చెప్పారు.

ముఖ్యంగా నీటి లభ్యత, వినియోగంపై సూచనలు చేసిందని పేర్కొన్నారు. చెరువు గట్లు ఆక్రమణలకు రవుతున్నాయని, చర్యలు చేపట్టి సాగునీటికి కొరత రాకుండా చూసుకోవాలని, స్లూయస్ లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పినట్లు పేర్కొన్నారు. ఇక్కడి మట్టికి తేమను పీల్చుకొని భవిష్యత్తులో పంటకు అందజేసే గుణాన్ని కలిగి లేవని కమిటీ తెలిపిందని వెల్లడించారు. కావున తక్కువ కాలంలో అందుబాటులోకి వచ్చే పంటలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కమిటీ సూచించిందని సమావేశంలో భాగంగా కలెక్టర్ ప్రస్తావించారు.

Related posts

జూన్ 6 నుంచి విజయనగరం సంగీత కళాశాలలో తరంగ గానం

Satyam NEWS

హుజూర్ నగర్ లో 200 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరిక

Satyam NEWS

ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది

Bhavani

Leave a Comment