ఏపి రాజధాని అమరావతి ప్రకటనకు ముందే కొందరు అక్కడి భూములు కొనుగోలు చేయడంలో ఇన్ సైడ్ ట్రేడింగు జరిగిందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ వివరాలు సరైన సమయంలో బయటపెడతామని ఆయన అన్నారు. రాజధానిలో భూ అక్రమాలపై ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉందని ఆయన అన్నారు. అమరావతిలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. రాజధానిలో జరిగిన భూ అక్రమాలపై తమ వద్ద పూర్తి సమాచారం ఉందని.. సరైన సమయంలో ఆ అక్రమాల చిట్టా బహిరంగ పరుస్తామని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి తనకు రాజధానిలో భూములే లేవంటున్నారని.. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన సవాల్ విసిరితే మొత్తం వివరాలు బయటపెడతామని కూడా అన్నారు. రాజధానిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో ఏం చెప్పారో.. ఇప్పుడేం మాట్లాడారో రికార్డు చూడాలని మంత్రి అన్నారు. అమరావతిపై గతంలో బిజెపి కూడా ఆరోపణలు చేసిందన్నారు. రాజధాని అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికో చెందినది కాదన్నారు. కౌలు అందలేదని రైతులు వచ్చారని ఆ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి బొత్స చెప్పారు. రాజధాని విషయంలో మీడియా మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
previous post