మాజీ సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్‌పై రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ వేటు వేసింది. ఆయన అవినీతికి పాల్పడ్డారని, పలు అక్రమాలకు కారకలయ్యారని విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సంజయ్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. జగన్ వ్యతిరేకులపై కేసులు పెట్టడంలోనూ, వారిని ఆగమేఘాలపై అరెస్టు చేయడంలోనూ సంజయ్ ప్రముఖపాత్ర పోషించారు. ముఖ్యంగా స్వర్గీయ రామోజీరావు సంస్థ అయిన మార్గదర్శిపై పలు కేసులు నమోదు చేయించడంలో ఆయన అత్యుత్సాహం ప్రదర్శించారు.
అంతే కాదు..మార్గదర్శి కేసుకు సంబంధించి మీడియా సమావేశాలు నిర్వహించారు. ఒక కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో దాని గురించి మీడియాతో మాట్లాడకూడదనే నిబంధనలను కూడా ఆయన పక్కకు పెట్టి మార్గదర్శి కేసులో పలుసార్లు మీడియా సమావేశాలు నిర్వహించారు. కేవలం ఇక్కడే కాదు హైదరాబాద్, చివరకు ఢిల్లీలోనూ మీడియా సమావేశాలు నిర్వహించి ఆ సంస్థను ప్రజల్లో పలుచన చేయడానికి తీవ్రంగా యత్నించారు. అప్పటి మాజీ ఎడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డితో కలిసి వీరంగాలు వేశారు. కాగా ప్రభుత్వం మారిన తరువాత ఆయన చేసిన అవినీతి భాగోతాలపై విచారణ జరుగుతోంది.
అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన కాలంలో ఆయన అవినీతికి పాల్పడ్డారని నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయకపోయినా.. చేసినట్లు తన బినామీ కంపెనీలకు సొమ్ములు చెల్లించడంలో క్రియాశీలక పాత్ర పోషించినట్లు విజిలెన్స్ దర్యాప్తులో తేలింది. దీంతో..ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెండ్ సమయంలో ఆయన హెడ్‌క్వార్టర్ విడిచి వెళ్లరాదని ఆదేశించింది. మొత్తం మీద నిబంధనలకు అతీతంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై కూటమి ప్రభుత్వం ఆలస్యంగానైనా చర్యలు తీసుకుంటోంది.