ఇరాక్‌లోని వైమానిక స్థావరంపై జరిగిన క్షిపణి దాడిలో తమ సైనికుల్లో 100 మంది గాయపడ్డట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ వెల్లడించింది. ఈ దాడిలో సైనికులకు తేలికపాటి మెదడు సంబంధిత గాయాలైనట్లు వారు తెలిపారు.ఇరాన్ అగ్రశ్రేణి కమాండర్ జనరల్ ఖాసీం సులేమానీని అమెరికా డ్రోన్ దాడి చేసి చంపాగా ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. మొదట సైనికులెవరూ స్థావరంలో లేకపోవడంతో వారెవరికీ ఏమీ కాలేదని అమెరికా ప్రకటించడం గమనార్హం.
గత నెల విడుదల చేసిన ప్రకటనలో 34 మందే అని తెలిపిన అమెరికా తాజా ఆ సంఖ్యను సవరించి 100కు చేర్చింది. ‘‘గతంతో పోలిస్తే మరో 45 మందిలో ‘మైల్డ్ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీ(ఎంటీబీఐ)’ని గుర్తించాం. దీంతో ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య 109కి చేరింది’’ అని పెంటగాన్ తన ప్రకటలో పేర్కొంది. వీరిలో 76 మంది కోలుకొని విధుల్లో చేరినట్లు వెల్లడించింది. మరికొంత మంది ఇంకా వైద్య పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నారు.
గతంలో అధ్యక్షుడు ట్రంప్ దీనిపై మాట్లాడుతూ..సైనికులకు పెద్ద ప్రమాదమేమీ లేదని.. ‘కేవలం తలనొప్పి’ అంటూ తేలిగ్గా కొట్టిపారేయడం గమనార్హం.మొత్తానికి చిన్న దేశమైన ఇరాన్ ప్రతీకారం తో అమెరికా లాంటి అగ్రదేశం పై తెగపడటం పలువురిని ఆలోచింప చేస్తుంది.