ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులతో దాడి చేసి 80 మంది సైనికులను మట్టుబెట్టామని ఇరాన్ ప్రకటించిన మరుసటి రోజే మరో దాడి చేసింది. ప్రతీకార పోరులో ఇరాన్ తన దూకుడు కొనసాగిస్తోంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని గ్రీన్‌జోన్‌ను రెండు రాకెట్లు తాకాయి. యూఎస్ ఎంబసీకి సమీపంలో ఉన్న అత్యంతకీలకమైన గ్రీన్‌జోన్‌లో రాకెట్ దాడి జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
గ్రీన్‌జోన్‌లో యూఎస్ ఎంబసీతో పాటు పాశ్చాత్య దేశాల రాయబార కార్యాలయాలు, విదేశీ వ్యాపార సముదాయాలు ఉన్నాయి. గ్రీన్ జోన్ లోపల రెండు క్రత్యూష రాకెట్లు పడి ఉన్నాయని, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇరాక్ సైన్యం తెలిపింది. ఇరాక్‌లోని అమెరికా సైన్యం, కార్యాలయాలే లక్ష్యంగా ఇరాన్ మరిన్ని దాడులకు తెగబడే అవకాశముందని భావిస్తున్నారు. అమెరికా సైన్యం పశ్చిమాసియాను విడిచి వెళ్లిపోవాలని ఇరాన్ హెచ్చరించిన విషయం తెలిసిందే.