34.2 C
Hyderabad
April 23, 2024 14: 43 PM
Slider సంపాదకీయం

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కు గడ్డుకాలం దాపురించిందా?

#YSJaganmohanReddy

కమ్ముకొస్తున్న కేసులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి గడ్డకాలం దాపురిస్తున్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తల్లడిల్లుతున్నారు. ముందుగా సీబీఐ కేసులు విచారణకు స్వీకరించాలని, ఆ తర్వాతే ఈడీ కేసులు విచారించాలని జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను కాదని కోర్టు నోటీసులు జారీ చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది.

వాన్‌పిక్‌ ఈడీ కేసును న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ కేసులో ఏపీ సీఎం జగన్‌కు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబరు 22న విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. జగన్‌తో పాటు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, ఐఆర్‌టీఎస్‌ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డి, పారిశ్రామిక వేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్‌, నిమ్మగడ్డ ప్రకాశ్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు ఎం.శామ్యూల్‌, మన్మోహన్‌సింగ్‌, జగతి పబ్లికేషన్‌ సహా 12 కంపెనీలకు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.

దీనితో బాటు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పలు మలుపులు తిరుగుతున్నది. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రక్త సంబంధీకులను కేసుకు సంబంధించి సీబీఐ పలుమార్లు పిలిచి విచారించడంతో కేసు గురించి వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

కడప జిల్లా పులివెందుల ఆర్ అండ్ బీ అతిథి గృహంలో సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వై.ఎస్.భాస్కర్ రెడ్డి, అవినాష్‌ రెడ్డి చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి వరసగా రెండో రోజు కూడా హాజరయ్యారు. వైఎస్  భాస్కర్ రెడ్డి పులివెందుల వైకాపా ఇంఛార్జ్‌ కాగా..మనోహర్‌రెడ్డి పులివెందుల మున్సిపల్ వైస్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. వివేకా హత్య జరిగిన తర్వాత వైఎస్  కుటుంబ సభ్యులతో పాటు దాదాపు 20 మంది ఘటనా స్థలంలో ఉన్నారు. భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి ఆరోజు మృతదేహాన్ని చూసేందుకు వెళ్లారు.

వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు సమర్పించిన 15 మంది అనుమానితుల జాబితాలో వీరిద్దరూ ఉన్నారు. వీరికంటే ముందుగానే వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి సీబీఐ విచారణకు వెళ్లారు. సుంకేశుల గ్రామానికి చెందిన జగదీశ్వర్ రెడ్డి, సునీల్ బంధువు భరత్ కుమార్ యాదవ్, పులివెందులకు చెందిన నాగేంద్ర, మహబూబ్ బాషా, కుమార్ అనే వ్యక్తులను సీబీఐ ప్రశ్నిస్తోంది. మరోవైపు.. కడప జైలు అతిథి గృహంలో సీబీఐ అధికారులను వివేకా కుమార్తె సునీత కలిశారు. దర్యాప్తు సాగుతున్న కేసు వివరాలను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. రెండు గంటలకు పైగానే ఆమె సీబీఐ అధికారులతో చర్చించారు. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, రక్తసంబంధీకుడు అయిన కడప ఎంపి అవినాష్ రెడ్డి వ్యక్తిగత సహాయకులను కూడా సీబీఐ ప్రశ్నించింది. ఇంత మంది వైసీపీ నేతల చుట్టూ కేసు తిరుగుతుండటం ఆ పార్టీ నాయకులకు కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు గురి చేస్తున్నది.

ఈ రెండు అంశాలతో బాటు రాష్ట్రంలో ఆర్ధికంగా జరిగిన అవకతవకలపై కేంద్రం సీరియస్ గా ఉండటం మరొక ముఖ్యాంశం. అసలే జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత దారుణ స్థితిలోకి చేరబోతున్నదనే సంకేతాలకు తోడు కేంద్రం విచారణలు కూడా వైసీపీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కోర్టు కేసుల్లో ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు తరచూ హాజరు కావాల్సి వస్తుండటంతో అధికారులలో తిరుగుబాటు వస్తుందేమోనని కూడా ఆందోళన వ్యక్తం అవుతున్నది.

జీతాలు రాక కింది స్థాయి ఉద్యోగులు, కోర్టు కేసుల కారణంగా పై స్థాయి ఉద్యోగులు ప్రభుత్వం మాట వినకపోతే ప్రభుత్వ పరిస్థితి దారుణంగా మారుతుంది. రాష్ట్రంలో తరచూ జరుగుతున్న మహిళలపై అదీ కూడా దళితులపై జరుగుతున్న అత్యాచారాలు మరో కల్లోల కారణం అవుతున్నాయి. తద్వారా ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతున్నదనే ఆందోళన వైసీపీ నేతల్లో ఎక్కువ అవుతున్నది. ఈ మొత్తం సంఘటనలలో వైసీపీకి కలిసి వచ్చే అంశం ఏదీ కనిపించడం లేదు.   

Related posts

కులాల పేరుతో కుట్ర: బాలయ్య, చిరంజీవి అభిమానులు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

జూలై 2న జాతీయ రహదారి దిగ్బంధానికి MRPS పిలుపు

Satyam NEWS

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

Bhavani

Leave a Comment