28.2 C
Hyderabad
April 20, 2024 12: 10 PM
Slider తెలంగాణ ప్రత్యేకం

ఇంటర్ ఫలితాలపై సిబిఐ దర్యాప్తు???

167624-intermediate-exams24

ఇంటర్ పరీక్షా ఫలితాల విషయంలో వాస్తవ నివేదిక ఇవ్వాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కేంద్ర హోం శాఖను కోరిన నేపథ్యంలో అందుకు సమాధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పబోతున్నదనే అంశంలో ఉత్కంఠ తొలగిపోయింది. 27 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్న ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతకాలం ఎంతో గుంభనంగా వ్యవహరిస్తున్నది. సంబంధిత వ్యక్తులపై గానీ, కంపెనీలపై గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా వారిని కనీసం మందలించను కూడా లేదు. ఈ పరిస్థితుల్లో వివిధ విద్యార్ధి సంఘాలు తెలంగాణ వ్యాపితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాయి. ప్రతిపక్షాలు ఇంటర్ బోర్డు ముట్టడి చేశాయి. మరి కొందరు ఛలో ప్రగతి భవన్ నిర్వహించారు. ఇంకొందరు హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. వీలైన అన్ని మార్గాలలో తమ ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఇంటర్ ఫలితాలకు సంబంధించి రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగానీ, విద్యా శాఖ కార్యదర్శిగానీ, ఇంటర్ బోర్డు కార్యదర్శి గానీ, ఇంటర్ రిజల్సులో అవకతవకలకు పాల్పడిన గ్లోబరీనా సంస్థ గానీ ఎవరూ ఎక్కడా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఇంటర్ రిజల్సుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీ ఆర్ ఒక సారి సమీక్ష జరిపి హైకోర్టుకు సమాధానం ఎలా ఇవ్వాలో చెప్పారు తప్ప బహిరంగంగా ఇప్పటి వరకూ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు, చర్యలూ తీసుకోలేదు. ఈ అంశంపై మాట్లాడీ మాట్లాడీ, పోట్లాడీ పోట్లాడీ అలసి పోయిన ప్రతిపక్షాలు, విద్యార్ధి సంఘాలు సమస్యను దాదాపుగా వదిలేశాయి.-సత్యం న్యూస్- ఈ నేపథ్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు వినతి పత్రం అందచేశారు. దాంతో రాష్ట్రగవర్నర్ ఇ ఎస్ ఎల్ నర్సింహన్ ఒక్క సారిగా కదిలి విద్యాశాఖపై నేరుగా సమీక్ష నిర్వహించారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా రాష్ట్రపతి కేంద్ర హోం శాఖకు డాక్టర్ లక్ష్మణ్ లేఖను పంపుతూ వివరణ కోరడంతో ఒక్క సారిగా మరణించిన విద్యార్ధుల తల్లిదండ్రులలోనూ, విద్యార్ధి సంఘాలలోనూ కొత్త ఆశ పుట్టింది. నేరుగా రాష్ట్రపతి అడిగినందున ఇప్పటి కైనా వాస్తవాలు బయటకు వస్తాయని అనుకున్నారు. ఇప్పటికైనా బాధ్యులైన అధికారులపైనా, బాధ్యత వహించాల్సిన గ్లోబరీనా కంపెనీ పైన అయినా చర్యలు ఉంటాయని భావించారు. అయితే ఇలాంటి పరిణామం ఏదీ జరగకుండానే ముఖ్యమంత్రి కేసీ ఆర్ ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఏం చెప్పబోతున్నదో స్పష్టం చేసేశారు. ఇదంతా పెద్ద కుట్ర అని ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆయన స్పష్టంగా చెప్పడంతో ఇక ఇదే వైఖరి తో కేంద్ర హోం శాఖకు రాష్ట్రం నుంచి సమాధానం వెళుతుందని అందరికి అర్ధమైపోయింది. ఇదే జరిగితే కేంద్ర హోం శాఖ రాష్ట్రపతికి ఏం నివేదిక పంపుతుంది? అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అవకతవకలు జరగలేదని, ఎలాంటి ఇబ్బంది లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు తాము కూడా రాష్ట్రపతికి నివేదిస్తే మరి 27 మంది విద్యార్ధులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అని ఆయన తిరిగి ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలని కేంద్ర హోం శాఖ ఆలోచించవచ్చు. రాష్ట్ర గవర్నర్ ను నివేదిక అడుగుదామా అంటే ఆయన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం రిపోర్టు ఇచ్చిందో దానినే కాపీ తీసి పంపే అవకాశం ఉంటుంది. ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు జరగలేదని చెప్పలేరు. అయితే వారు మరణించడానికి వేరే కారణాలు వెతకాల్సి ఉంది. విద్యార్ధులు మరణించడానికి తాము ఇచ్చిన ఫలితాలు కారణం కాదని ఇప్పటికే అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ముందు చెప్పారు. ఈ నివేదిక బయటకు రాలేదు కానీ లోపాలు సరిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ చెప్పి చేతులు దులుపుకున్నది. రాష్ట్రపతి జోక్యం చేసుకున్న తర్వాత కూడా 27 మంది విద్యార్ధుల మరణానికి ఇంటర్ రిజల్సు కారణం కాదు అని రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్, కేంద్ర హోం శాఖ కూడా నివేదికలు ఇచ్చేస్తే ఇక ఈ దేశంలో చెప్పుకోవడానికి మరే వ్యవస్థ ఉండదు. ఈ నేపథ్యంలో ఇంటర్ రిజల్సు వ్యవహారంపై కేంద్ర హోం శాఖ సిబిఐ తో స్వయంగా దర్యాప్తు చేస్తుందా అనే అంశం పైకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే సీబిఐ నేరుగా దర్యాప్తు చేపట్టి, ప్రాధమిక సాక్ష్యాధారాలు లభ్యమైతే అప్పుడు పూర్తి దర్యాప్తు నకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరే అవకాశం ఉంటుంది. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం సిబి ఐ విచారణకు అంగీకరించకపోయినా కేంద్ర ప్రభుత్వం నేరుగా విచారణకు ఆదేశించడానికి (ప్రాధమిక సాక్ష్యాధారాలు లభ్యం అయితే) అవకాశం కూడా ఉంటుందని న్యాయనిపుణులు అంటున్నారు. 27 మంది ఇంటర్ విద్యార్ధులు మరణించిన ఈ సంఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి స్పష్టంగా చెబుతున్నందున కేంద్ర హోం శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాల్సిన అంశం.

Related posts

ప్రజల్ని దగా చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం

Satyam NEWS

అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం

Satyam NEWS

ధర్మవరం ఎమ్మెల్యే స్టాఫ్ లో 8 మందికి కరోనా

Satyam NEWS

Leave a Comment