ఈ ప్రశ్న ఒకరో ఇద్దరో కాదు చాలా మంది అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షడుగా ఒక హిందీ పండిట్ ను వేయడం తో అందరి మదిలో అధికార భాష ఏది అనే ప్రశ్నే ఉత్పన్నం అవుతున్నది. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ను నియమించడం పై ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతున్నది. హిందీ పండితుడుగా పేరు పొందిన యార్లగడ్డ తప్ప అధికార భాషా సంఘానికి వేరెవరూ దొరకలేదా అని తెలుగు భాషాభిమానులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబునాయుడికి బద్ధ వ్యతిరేకి అయినా కూడా తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించిన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరికి యార్లగడ్డ అత్యంత సన్నిహితంగా ఉండేవారు. చంద్రబాబు తో వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించే సామాజిక వర్గంతో యార్లగడ్డ సఖ్యతగా ఉండేవారు. చంద్రబాబు వ్యతిరేకులంతా యార్లగడ్డ చుట్టూ చేరేవారు. ఎంతో మాటకారి అయిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఢిల్లీలో అన్ని లాబీలను కదిలించగల శక్తిమంతుడు. అమెరికా లాంటి దేశాలలో చంద్రబాబు సామాజిక వర్గంలో విశేష పలుకుబడి ఆయనకు ఉంది. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తలచుకుంటే ఢిల్లీ స్థాయిలో ఏ పని అయినా చేయగలరు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా యార్లగడ్డ తన ప్రత్యేకతను మాత్రం చాటుకుంటూనే ఉంటారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారతాయి తప్ప యార్లగడ్డ కు న్న లాబీ మాత్రం చెక్కు చెదరదు. అంతటి కీలక వ్యక్తి అయిన యార్లగడ్డ కు ఆంధ్రప్రదేశ్ లో అధికార భాషా సంఘం అనేది చాలా చిన్న పదవి. ఇలాంటి చిన్న పదవిని యార్లగడ్డ లాంటి పెద్ద వ్యక్తికి ఇవ్వడం ద్వారా కమ్మ సామాజిక వర్గం కూడా చిన్న బుచ్చుకుంటున్నది. అందువల్ల ఏదో ఆలోచించి ఆయనకు ఆ పదవి ఇచ్చినా కమ్మ సామాజిక వర్గం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షానికి వస్తుందని ఆశించడం కష్టమే. గతంలో వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధప్రదేశ్ హిందీ అకాడమీ చైర్మన్ గా నియమించారు. ఇప్పుడు వై ఎస్ జగన్ ఆయనను అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా చేశారు. త్వరలో అమెరికా వెళ్తున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని అంటున్నారు.
previous post