ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, ఎవరికి కోపం ఆవేశం వచ్చినా ఒక్కటి మాత్రం నిజం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను అర్ధంతరంగా వాయిదా వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే కాకుండా పొరుగు రాష్ట్రాలను కూడా కాపాడారనడంలో సందేహం లేదు.
ఎవరు ఏమనుకుంటారోనని భయపడి ఆయనే కనుక ఎన్నికలు నిర్వహించి ఉంటే పెద్ద ఉపద్రవమే జరిగి ఉండేది. ప్రాణాలకు తెగించి మరీ ఆయన ఎన్నికలను వాయిదా వేశారు కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా లాక్ డౌన్ అమలు చేసుకుంటున్నాం.
ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎంపిటిసి, జెడ్పిటిసీ స్థానాలకు 21వ తేదీ పోలింగ్ జరిగి ఉండాలి. మునిసిపల్ ఎన్నికల పోలింగ్ నిన్న ముగిసిన ఉండాలి. గ్రామ పంచాయిలీ మొదటి దశ పోలింగ్ 27న, రెండో దశ పోలింగ్ 29న జరగాలి. మరి జరిగేవా? ఈ నెల 31 వరకూ లాక్ డౌన్ ఉంది.
ఇవన్నీ ముందుగా ఊహించడమే అనుభవంతో కూడిన పాలన. అందులోనూ ఐఏఎస్ అధికారి అంటే మరింత జాగ్రత్తగా అన్ని విషయాలనూ పరిశీలిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నీ ఆలోచించి, అందరితో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, సీనియర్ మంత్రులు కూడా ఎన్నికల కమిషనర్ ను దారుణంగా తిట్టారు.
ఇంకా తిడుతూనే ఉన్నారు. అంతా జరిగిన తర్వాత, లాక్ డౌన్ లోకి వెళుతుండగా కూడా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హైదరాబాద్ వచ్చి మరీ మీడియా సమావేశం పెట్టి ఎన్నికల కమిషనర్ ను దారుణంగా తిట్టారు. ఎన్నికల కమిషనర్ ను కులం పేరుతో తిట్టడం వల్ల రాజకీయంగా వైసీపీకి లాభం కలుగుతుంది.
అయితే ఎంత కాలం కమ్మ కులాన్ని తిడుతూ, కమ్మ కులంపై వ్యతిరేకతను చిమ్ముతూ పాలన సాగిస్తారు? నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినప్పుడు అనుమానించిన చాలా మంది లో ఇప్పుడు పశ్చాత్తాపం కనిపిస్తున్నది.
ఆయన ఎంత ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారో అంటూ ఇప్పుడు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాకుండా దేశంలోని 20 రాష్ట్రాలూ కేంద్ర పాలిత ప్రాంతాలూ ఇప్పుడు లాక్ డౌన్ లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటీవ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.
క్వారంటైన్ సెంటర్లు పెంచుతూనే ఉన్నారు. ఇవన్నీ చేస్తూ కూడా కరోనా ప్రభావం పెద్దగా లేదని పాలకులు చెప్పేందుకు నానా తంటాలు పడుతున్నారు. కరోనా ప్రభావం లేకుండానే 31 వరకూ లాక్ డౌన్ చేశారా అంటే దానికి సమాధానం చెప్పడం లేదు. పరిపాలనతో రాజకీయాలను ముడిపెట్టి చూస్తే పనులు జరగవు. ఈ చిన్న లాజిక్ ను మర్చిపోతే అభాసుపాలు అయ్యేది పాలకులే తప్ప అధికారులు కాదు.