24.7 C
Hyderabad
July 18, 2024 08: 18 AM
Slider తెలంగాణ సంపాదకీయం

కమలనాధులకు కానరాని అధికార తీరం

bjp in telangana

తెలంగాణలో బిజెపి అధికారం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నా కూడా క్షేత్ర స్థాయిలో ఆ మేరకు ఫలితాలు కనిపించకపోవడం ఆ పార్టీ పరిశీలకులను కలవర పరుస్తున్నది. పార్టీ నాయకులకు సరైన దిశా నిర్దేశం లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇంత కాలం బిజెపికి తెలంగాణ లో పటిష్టమైన క్యాడర్ ఉండేది. దాదాపుగా అందరూ ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వారే ఉండేవారు. అంతే కాకుండా బిజెపి సిద్ధాంతాలకు ఆకర్షితులై వచ్చిన వారు ఉండేవారు.

అలా వచ్చిన వారెవరూ కూడా పదవుల కోసం పాకులాడే వారు కాదు. వారిలో ఒక విధమైన క్రమశిక్షణ ఉండేది. నాయకులలో ఒకరికి టిక్కెట్ వచ్చినా రెండో వారు తాత్కాలికంగా నిరసన వ్యక్తం చేసి ఆ తర్వాత పార్టీ నిర్ణయించిన అభ్యర్ధికి ప్రచారం చేసేవారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ పరిస్థితి మారిపోయింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పెద్ద పీట వేశారు. పైగా డబ్బలు తీసుకుని టిక్కెట్లు ఇచ్చారని పార్టీ శ్రేణులు హైదరాబాద్ లోని కార్యాలయం ఎదుటే ధర్నాలకు దిగారు. డబ్బులకు టిక్కెట్లు అమ్ముకున్నారని బహిరంగంగా ఆరోపణలు చేశారు.

ఈ నేపథ్యంలోనే బిజెపి ఒక్క సీటుకు పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ మట్టికరవడంతో బిజెపిలో కొత్త ఆశలు చిగురించాయి. అయితే ఈ అవకాశాన్ని బిజెపి సక్రమంగా వినియోగించుకోవడం లేదనిపిస్తున్నది. టిఆర్ఎస్ మాజీ నాయకులను, టిక్కెట్ రాని కాంగ్రెస్ నాయకులను, శక్తి ఉడిగిపోయిన పాత తరం నాయకులను పార్టీలో చేర్చుకుని తమ పార్టీ బలపడిపోతున్నదని భ్రమలో వారు ఉంటున్నారు. తెలంగాణ లో స్థానం లేని తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే నాయకులను పార్టీలో చేర్చుకుంటూ అదేదో తమ ఘనకార్యంలా వారు చెప్పుకుంటున్నారు.

టిఆర్ఎస్ పార్టీ మంత్రి వర్గ విస్తరణకు వెళ్లిన తర్వాత అక్కడక్కడ వినిపించిన నిరసన స్వరాలు తమకు అనుకూలిస్తాయని బిజెపి నేతలు భావించారు. అదే విధంగా గవర్నర్ గా తమిళిసై సౌందర్ రాజన్ రావడంతో పార్టీకి ఎనలేని బలం వస్తుందని అనుకున్నారు తప్ప టిఆర్ ఎస్ పార్టీ తన విస్తృత యంత్రాంగంతో పార్టీలోని లుకలుకలను సర్దుకుంటుందని, గవర్నర్ పాత్ర పరిమితమని ఊహించలేకపోయారు. తెలంగాణలో బీజేపీకి బలమే లేదనుకుంటున్న తరుణంలో ఆ పార్టీ నాలుగు లోక్‌సభ సీట్లు గెలుచుకోవడం వీలైనంత మందిని పార్టీలో చేర్చుకోవడం లాంటి పరిణామాలు గులాబీ పార్టీకి అప్పటిలో మింగుడు పడ లేదు.

అయితే అది పాలపొంగులాగానే మారిపోతుండటం వారికి ఆనందం కలిగిస్తున్నది. ఎమ్మెల్యే షకీల్ నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌ను కలవడం ఆ రోజుకు సంచలనం కలిగించింది తప్ప అదే రోజు రాత్రికి బిజెపికి ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఆ రోజు సాయంత్రానికే మెత్తబడ్డారు. బీజేపీ ఎంపీని కలిసిన షకీల్ త్వరలోనే ఆ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో దీనిపై షకీల్ స్పందించారు. తన నియోజకవర్గంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనాలని కోరేందుకు ఎంపీ అరవింద్‌ను కలిశానని ఆయన వివరణ ఇచ్చారు.

తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. కేసీఆర్ తనకు రాజకీయ గురువు అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ తరపున మూడుసార్లు తనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కేసీఆర్ కల్పించారని అన్నారు. షకీల్ వివరణతో ఈ వివాదం చల్లబడినట్టే అని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు షకీల్‌ను బుజ్జగించే క్రమంలో అతడికి కీలకమైన నామినేటేడ్ పదవి ఇచ్చేందుకు టీఆర్ఎస్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు టీఆర్ఎస్ నాయకత్వం నుంచి ఆయనకు స్పష్టమైన హామీ లభించినట్టు సమాచారం.

మంత్రి పదవులు దక్కకుండా అసంతృప్తికి గురైన పలువురు నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్న టీఆర్ఎస్ షకీల్‌కు కూడా నామినేటెడ్ పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. షకీల్ ఒక్కరే కాకుండా పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు పదవులు దక్కక తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరిగింది కానీ చివరకు అంతా చల్లబడ్డట్టుగానే కనిపిస్తున్నది.

మంత్రి వర్గ విస్తరణ తర్వాత మాజీ మంత్రి జోగు రామన్న, అరికెపూడి గాంధీ,నాయిని నర్సింహారెడ్డి లాంటి చాలా మంది  మీడియా ముందు వాపోయారు. వారికి వెంటనే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేయడం, వాళ్లు మీడియా ముందుకు వచ్చి తమ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేసి, సీనియర్ నేతలను సంతృప్తి పరిస్తేనే పార్టీలో అసంతృప్తి జ్వాలలు తగ్గే అవకాశం ఉంది. సాధ్యమైనంత తొందరగా ఇస్తేనే పార్టీకి సమస్య ఉండదని, అదీ మునిసిపల్ ఎన్నికల లోపు జరిగితేనే మంచిదని.. లేకపోతే సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఒత్తిడి పడుతుందని, కేటీఆర్ నాయకత్వంపైనా కాస్త నమ్మకం పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బిజెపికి వలసలు తగ్గాయి. ఇలాంటి ఎత్తుగడలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసే యంత్రాంగం బిజెపిలో ప్రస్తుతానికి లేదు. ఆకర్షణీయమైన నాయకత్వం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. అందువల్ల తెలంగాణ బిజెపి ఎంత దూకుదామని ప్రయత్నించినా అగాధం వైశాల్యం పెరుగుతూనే ఉంది. ఆవలి వడ్డు అందడం లేదు.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యం న్యూస్

Related posts

లక్ష్యాలను నిర్ణిత వ్యవధిలోగా పూర్తి చేయాలి

Murali Krishna

మల్కాజ్ గిరి సబ్ రిజిస్ట్రార్ పై ఏసీబీ దాడి

Satyam NEWS

వైయస్ వివేకా 72వ జయంతి నిర్వహించిన కుటుంబ సభ్యులు

Satyam NEWS

Leave a Comment