28.7 C
Hyderabad
April 20, 2024 09: 11 AM
Slider సంపాదకీయం

జవహర్ రెడ్డిని తెచ్చుకుంటే ‘‘ముందస్తు’’ ఖాయమేనా?

#cmjagan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డిని నియమించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీనియారిటీ ప్రకారం ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తర్వాత నీరబ్ కుమార్ ప్రసాద్ సీనియర్ గా ఉన్నారు.

నీరబ్ కుమార్ ప్రసాద్ కు చీఫ్ సెక్రటరీ అవకాశం కల్పిస్తానని గతంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీ ప్రకారం నీరబ్ కుమార్ ప్రసాద్ చీఫ్ సెక్రటరీ కావాల్సి ఉండగా సమీర్ శర్మకు రెండు సార్లు పదవీ కాలాన్ని పొడిగించారు. ఇక ఇప్పుడు ఇచ్చిన హామీని నెరవేర్చే అవకాశం లేకపోవడంతో నీరబ్ కుమార్ ప్రసాద్ కు చీఫ్ సెక్రటరీ పదవి దక్కెలా కనిపించడం లేదు.

ఆయన తర్వాత సీనియారిటీ లిస్టులో ఉన్న గిరిధర్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్నారు. ఆయనను మళ్లీ ఏపికి తీసుకువచ్చి చీఫ్ సెక్రటరీ పదవి ఇస్తారా అనేది ప్రశ్నార్ధకమే. ఆ తర్వాత సీనియారిటీ ప్రకారం పూనం మాలకొండయ్య, శ్రీలక్ష్మి ఉన్నారు. ఆ తర్వాత సీనియర్ అయిన సోమేష్ కుమార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా పని చేస్తున్నారు.

ఆ తర్వాత సీనియారిటీలో కరికాల వేలన్, రజత్ భార్గవ ఉన్నారు. ఆ తర్వాత సీనియర్ గా కె ఎస్ జవహర్ రెడ్డి ఉన్నారు. మధ్యలో కొందరికి చీఫ్ సెక్రటరీలుగా అవకాశాలు కల్పించిన తర్వాత ఎన్నికల సమయానికి కె ఎస్ జవహర్ రెడ్డిని చీఫ్ సెక్రటరీగా తెచ్చుకుని ఎన్నికలకు వెళ్లాలని జగన్ మోహన్ రెడ్డి భావించారు. అదే సమయంలో డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా నియమించుకుని ఎన్నికలకు వెళ్లాలని భావించారు.

అయితే కొన్ని కారణాల వల్ల రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా ముందే నియమించుకోవాల్సి వచ్చింది. ఆయన ఎన్నికల వరకూ అదే స్థానంలో కొనసాగుతారు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీని నియమించుకోవాల్సిన అవసరం వచ్చింది. అసాధారణ స్థాయిలో ఇప్పటికే రెండుసార్లు పొడిగింపు పొందిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ పదవీకాలం ఈనెల 30వ తేదీతో ముగుస్తోంది.

ఆయన 2021 అక్టోబరు 1న సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. అదే ఏడాది నవంబరు 30తో ఆయన రిటైర్‌ కావాల్సింది. అయితే… రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు కేంద్రం ఆయన సేవలను మరో ఆరు నెలలు పొడిగించింది. ఈ ఏడాది మే 30 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సమీర్‌ శర్మ పదవీకాలాన్ని మరో ఆరునెలలు పొడిగించాలని మరోసారి కేంద్రాన్ని కోరింది. అసాధారణ రీతిలో కేంద్రం ఈ ప్రతిపాదనను కూడా అంగీకరించింది.

అంటే… ఈ నెలాఖరుతో ఆయన పదవీకాలం ముగియనుంది. సమీర్‌ శర్మను వదులుకోవడం ఇష్టంలేకో… మరో కారణంవల్లో 2023 నవంబరువరకు ఆయన పదవీకాలం పెంచాలని కేంద్రాన్ని మరోసారి అడిగారు. కేంద్రం అందుకు అంగీకరించలేదు. ఇటీవల ఆయన ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. దీంతో ఈ నెలాఖరుతో ఆయన పదవీ విరమణ ఖాయమైంది.

సమీర్‌ శర్మకు రెండోసారి పొడిగింపు రాకముందు తదుపరి సీఎస్‌ తానే అని పూనం మాలకొండయ్య (1988 బ్యాచ్‌) గట్టిగా భావించారు. ఇప్పుడు ఎందుకోగానీ ఆమె నిశ్శబ్దం వహించారు. ఆమె సీఎస్‌ ఆయ్యే చాన్స్‌ లేదని ఐఏఎస్‌ వర్గాలే చెబుతున్నాయి. ఓబుళాపురం గనుల కేసులో అభియోగాలను తెలంగాణ హైకోర్టు రెండు రోజుల కిందటే కొట్టివేయడంతో శ్రీలక్ష్మికి చీఫ్ సెక్రటరీ అయ్యే అవకాశాలు మెరుగు పడ్డాయి.

అయితే శ్రీలక్ష్మికి సీఎస్‌ పదవి అప్పగించడంపై జగన్‌ కోటరీలో కొందరు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఇప్పుడు సీనియర్ అయిన కరికాల వేలన్ ను చీఫ్ సెక్రటరీగా నియమించుకుని ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డిని తెచ్చుకుంటారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సాధారణ పరిస్థితుల్లో అయితే కరికాల వేలన్ కు చీఫ్ సెక్రటరీ పదవి ఇచ్చి ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత జవహర్ రెడ్డిని తెచ్చుకోవాలి.

అయితే జవహర్ రెడ్డిని ఇప్పుడే చీఫ్ సెక్రటరీగా నియమించుకోవాలని సీఎం అనుకుంటున్నారని కూడా మరి కొందరు అంటున్నారు. జవహర్ రెడ్డి ఎన్నికల టీమ్ లోని వారైనందున ఆయనను ముందే చీఫ్ సెక్రటరీ చేసేస్తే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారా? అని కూడా చర్చించుకుంటున్నారు.

కరికాల వేలన్ ను చీఫ్ సెక్రటరీగా చేస్తే ఎన్నికలు సాధారణ టైం టేబుల్ ప్రకారమే జరుగుతాయని, అలా కాకుండా జవహర్ రెడ్డిని చీఫ్ సెక్రటరీని చేసేస్తే ఇక ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నట్లేనని కూడా కొందరు లెక్కిస్తున్నారు.

Related posts

తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసి నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావం

Satyam NEWS

బెంగుళూరులో విపక్ష కూటమి నమావేశం రేపు

Satyam NEWS

సొంత ఖర్చుపైనే జగన్ అమెరికా యాత్ర

Satyam NEWS

Leave a Comment