27.7 C
Hyderabad
March 29, 2024 03: 23 AM
Slider ప్రత్యేకం

సెకండ్ వేవ్ ఉధృతిని వ్యాక్సిన్లు అడ్డుకోగలవా…..?

#SecondWave

చాలాకాలం ముందుగానే నిపుణులు హెచ్చరించినట్లు కరోనా వైరస్ ‘సెకండ్ వేవ్’ ప్రారంభమైంది. అదే సమయంలో,వ్యాక్సినేషన్ రెండవ డోస్ కూడా మొదలైంది.45 ఏళ్ళు దాటిన వారికి కూడా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. కేసులు పెరుగుతున్నాయి, వ్యాక్సిన్ వేసుకొనే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ, వైరస్ వ్యాప్తిలో ఉధృతి తగ్గకపోగా, రికార్డు స్థాయిలో పెరుగుతూ ఉండడం, మరణాలు కూడా సంభవించడం  చాలా ఆందోళనను, భయాన్ని కలిగిస్తున్నాయి. ఒక్కరోజులోనే 90వేల కేసులు దాటిపోవడం, రికవరీ రేటు 93 శాతానికి పడిపోవడం ఎక్కువ ఆందోళనను కలిగిస్తోంది.

మరింత సమర్ధమైన వ్యాక్సిన్లు రావాలి…

ప్రస్తుతం రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా, ఇంకా సమర్ధవంతమైన వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తే కానీ ప్రయోజనం లేదనే మాటలు కూడా వినపడుతున్నాయి. మరింత సమర్ధవంతమైన వ్యాక్సిన్లు రావాలంటే? కనీసం వచ్చే సంవత్సరం దాకా ఆగాలని వార్తలు వస్తున్నాయి.

ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా సుమారు 7 కోట్ల 60లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ రెండు డోసుల్లో ఇస్తున్న నేపథ్యంలో, ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీలు ఎంతకాలం ఉంటాయనే దానిపై ఇంత వరకూ ఎటువంటి స్పష్టత లేదు. మూడవ డోసు కూడా అవసరం ఉంటుందని కొందరు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

ఈ అంశంలో భారత్ బయోటెక్  అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ కు మూడవ డోస్ (బూస్టర్ డోస్ ) ను కూడా ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ కు భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి కూడా మంజూరు చేసింది. కొవాగ్జిన్ మూడవ డోసుపై త్వరలో ప్రయోగాలు మొదలు కానున్నాయని సమాచారం.

ఈ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న 6 నెలల తర్వాత బూస్టర్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అభివృద్ధి చేసి వున్న వ్యాక్సిన్ కు 81శాతం క్లినికల్ సామర్ధ్యం ఉన్నట్లుగా భారత్ బయోటిక్ ప్రకటించింది. మనకు అందుబాటులో వున్న మరో వ్యాక్సిన్ ‘కోవీ షీల్డ్ “. దీని సామర్ధ్యం 70%  పైగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఏ వ్యాక్సిన్ తీసుకోవాలి?…..

ఈ సమర్ధతలలో ఉండే వ్యత్యాసం పట్ల ప్రజలకు పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. సహజంగా సమర్ధత ఎక్కువగా ఉన్న వ్యాక్సిన్ల వైపే మొగ్గు చూపిస్తారు. దానికి తోడు ప్రధానమంత్రి, రాష్ట్రపతి వంటి దేశాధినేతలు తీసుకోనే వ్యాక్సిన్లనే సామాన్యులు కూడా ఇష్టపడతారు. పెద్దవారు తీసుకున్నారనే విశ్వాసం, ధైర్యంతో మిగిలినవారు సైతం ఆ కంపెనీ వ్యాక్సిన్లనే అనుసరిస్తారు.

ఏ వ్యాక్సిన్ తీసుకోవాలి? అనే అంశంలో ఇంకా చాలామందిలో సందిగ్ధం అలాగే వుంది. దీనిపై ప్రభుత్వ వర్గాల నుంచి మరింత స్పష్టత రావాల్సిన అవసరం వుంది. భారతదేశంలో సుమారు 139కోట్లకు పైగా జనాభా వున్నారు.అందరికీ వ్యాక్సినేషన్ అవసరం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

దీనిపై కూడా మరింత వివరణ రావాల్సి వుంది. పెరుగుతున్న వైరస్ వ్యాప్తి ఉధృతికి వ్యాక్సినేషన్ వల్ల ఆనకట్ట వేయవచ్చు, అని చెబుతున్నారు. ఈ తరుణంలో, వ్యాక్సినేషన్ ప్రక్రియ మరెంతో వేగం పుంజుకోవాలని ప్రధానమంత్రి సైతం హెచ్చరిస్తున్నారు. వ్యాక్సినేషన్ పెరిగితే సామూహిక రోగ నిరోధక సామర్ధ్యం (హెర్డ్ ఇమ్మ్యూనిటీ ) పెరుగుతుందని అంటున్నారు.

హెర్డ్ ఇమ్మ్యూనిటీ కోసం…

మనదేశంలో హెర్డ్ ఇమ్మ్యూనిటీని సాధించాలంటే, ఇంకా కొన్ని నెలలు సమయం పడుతుంది. వైరస్ తీరు తెన్నులు ఎప్పటికప్పుడు శరవేగంగా మారుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం అందుబాటులో వున్న వ్యాక్సిన్లపై ఏ మేరకు విశ్వాసాన్ని కలిగి ఉండాలి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

వైరస్ వ్యాప్తిని తగ్గించడమే ప్రస్తుతం ప్రపంచం ముందున్న పెద్ద సవాల్. వైరస్ ఇప్పుడప్పుడే అంతం కాదనే ఎక్కువమంది చెబుతున్నారు. దాని ఉధృతి క్రమంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కనీసం,2022 సంవత్సరం చివరి వరకూ కరోనా నిబంధనలను పాటించాల్సిన అవసరమే ఉంటుందని అర్ధమవుతోంది. వ్యాక్సిన్లు వేయించుకున్నా, జాగ్రత్తలు మరువరాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్ధ్యం భారత్ లో పెరగడం అభినందనీయమే.

కేవలం ఉత్పత్తి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. వ్యాక్సిన్ల సమర్ధతే అతి ముఖ్యం. వైరస్ లో వచ్చే రకాలపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే వుంది. వ్యాక్సిన్ల సమర్ధతపై ఇంకా అధ్యయనాలు పెరగాల్సిన అవసరం వుంది. సమర్ధవంతమైన వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం ప్రధానమైన అంశం. అది జరిగినప్పుడు,కరోనా కట్టడి కావడం, మరణాలు తగ్గడం సంభవిస్తాయి.

రెండు వ్యాక్సిన్లూ సురక్షితమైనవే…

దేశంలో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన రెండు వ్యాక్సిన్లు సురక్షితమైనవేనని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసినప్పటికీ, వాస్తవ ఫలితాలు కాలంలోనే తెలుస్తాయి.వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా పాజిటివ్ వచ్చే కేసులు చాలా అరుదుగా గుర్తిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఇటీవల తెలిపారు.

ఆయన రెండవ డోస్ కూడా తీసుకున్నారు. దేశంలో మరికొన్ని వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిల్లో స్పుత్నిక్ వ్యాక్సిన్ మరికొన్ని రోజుల్లోనే అందుబాటులోకి వచ్చే అవకాశం వుంది.వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో, మళ్ళీ లాక్ డౌన్ విధిస్తారా? అనే భయాలు మొదలవుతున్నాయి.

సంపూర్ణ లాక్ డౌన్ విధించడానికి అటు కేంద్ర ప్రభుత్వం -ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సుముఖంగా లేవు. ప్రజలు కూడా దానిపై వ్యతిరేకంగానే వున్నారు. కేవలం కట్టడి చర్యలు మాత్రమే తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా,కనీసం 2022 తుది వరకూ జాగ్రత్తగా ఉండాల్సిందేనని తెలుస్తోంది.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

వనపర్తిలో వజ్రోత్సవ వేడుక ర్యాలీలో మంత్రి నిరంజన్ రెడ్డి

Satyam NEWS

పోలీస్ టీ20: నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్…!

Bhavani

రిపబ్లిక్ డే పెరేడ్ లో ఏం చేయాలి? నాగార్జున విసిని అడగండి

Satyam NEWS

Leave a Comment