ప్రభుత్వ ఆదేశాలను గౌరవిస్తూ ఈషా యోగా సెంటర్ కార్యక్రమాలను నిలిపివేసింది. ప్రతిరోజూ వేలాది మంది సందర్శకులు వచ్చే యోగా సెంటర్ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సందర్శకులందరికీ లోపలికి వచ్చే ముందే పూర్తి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు.
యోగా సెంటర్ లో ఉండేవారికి కూడా తరచుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆదేశాల దృష్ట్యా అన్ని కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా ఇషా యోగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు తనతో సహా, తరచూ ప్రయాణాలు చేసేవారందరూ వెంటనే ప్రయాణాలు ఆపివేస్తున్నట్లు ప్రకటించారు.
అందరూ ప్రస్తుతానికి ఈషా యోగా సెంటర్ కే పరిమితమై పోతున్నారు. ముంబయిలో జరగాల్సిన ఇన్నర్ ఇంజనీరింగ్ మెగా ప్రోగ్రాం, అలాగే ఏప్రిల్ మొదటి వారంలో జరగవలసిన సౌత్ ఆఫ్రికా పర్యటనను రద్దు చేసుకున్నారు. అంతేకాక యోగా సెంటర్ లో ఉన్నఆశ్రమ వాసులు అందరూ, మూడు రోజులకు ఒకసారి ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలని ప్రకటించారు.
ప్రభుత్వ సూచనల మేరకు సెంటర్ కు వచ్చే సందర్శకులకు కూడా ఈషా కొన్ని సూచనలు ఇస్తోంది. గొంతు నొప్పి, జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసకోశ సంబంధమైన లక్షణాలు, తలనొప్పి, ముక్కు కారడం, లాంటి ఏ రకమైన Covid-19 వ్యాధి లక్షణాలు గత 28 రోజుల్లో ఉన్నా లేక అటువంటి లక్షణాలు ఉన్న ఎవరితోనైనా కలిసి ఉన్నా ఆశ్రమాన్ని సందర్శించ వద్దన్నారు. ఈ ముందు జాగ్రత్త చర్యలు హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, ఇంకా సెంటర్ లో పనిచేస్తున్న ఇతర సిబ్బందికి కూడా వర్తిస్తాయి. ఈషా యోగ సెంటర్ బయటనే ఉన్న ‘ఆదియోగి’ సందర్శకులకు కూడా, శానిటైజర్ లాంటి పారిశుధ్యతలో వాడే వస్తువులు అందుబాటులో ఉంచారు.