ఈ ఎమ్మెల్యే చానా పవర్ ఫుల్ అప్పా, ఈయన జోలికి కరోనా కాదు కదా దాని బాబు కూడా దరికి రాదు. అమ్మో అలానా ఈ ఎమ్మెల్యే ఎవరా అనుకుంటున్నారా? కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. నిజం, ఆ సారు చేతికి కరోనా అంటదు.
ఈ సారు మూతికి కరోనా అంటదు. అలాగే కళ్లూ చెవులు ఏవైనా సరే కరోనా అంటుకోదు. ఆయన ఎవరికి అంటించారో తెలవదు. అది తెలవాలంటే 14 రోజులు ఆగాలి. ఈ సారు అమెరికా పర్యటనకు సతీ సమేతంగా వెళ్లారు. అక్కడ నుంచి మంగళవారంనాడు వచ్చారు.
కరోనా వ్యాప్తి కారణంగా ఎవరైనా ఎంతటి గొప్పోరైనా 14 రోజులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ లోగానీ సొంతంగా ఇంట్లో ఒంటరిగా పరి శుభ్రంగాగానీ తమను తాము క్వారంటైన్ చేసుకోవాలి. ఇదే కదా నిన్న తెలంగాణ సిఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ చెప్పింది.
అయితే ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాత్రం అవేవీ పాటించలేదు. విమానం దిగి నేరుగా రైలెక్కారు. రైలు దిగి నేరుగా ప్రజల మధ్య లోకి వెళ్లిపోయారు. మంగళవారంనాడు వచ్చిన ఆయన బుధవారం నాడు కాగజ్ నగర్ మునిసిపల్ బడ్జెట్ సమావేశానికి వచ్చేశారు.
కాగజ్ నగర్ మున్సిపాలిటీలో బడ్జెట్ సమావేశానికి హాజరైన సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అక్కడ చైర్మన్ సద్దాం హుస్సేన్, కమిషనర్ తిరుపతి, ఇతర అధికారులతో చేతులు కలిపి మాట్లాడారు. వీరే కాదు కాగజ్ నగర్ మునిసిపల్ కౌన్సిల్ సభ్యులు అందరూ సార్ కు చేతులు కలిపారు.
అనంతరం రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతం లో పాల్గొన్నారు. అదీ కూడా సతీ సమేతంగా.
ఇంకా ఇలా చెబుతూ పోతే సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మందిని కలిసిన సంఘటనలు చానా ఉన్నాయి. సార్ దేవుడు. ఆయనకు కరోనా వైరస్ అంటదు- అనుకోవడం తప్ప 14 రోజులు ఐసోలేషన్ లో ఉండాలనే నిబంధన పెడితే ఎలా? అర్ధం అయిందా???