విక్రమ్ లాండర్ ఆచూకీ దొరికింది. చంద్రయాన్ 2 ప్రయోగంలో కనిపించకుండాపోయిన విక్రమ్ లాండర్ ఆచూకీ తెలియడంతో ఇస్రో శాస్త్రవేత్తలు తమ ఆనందాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ లాండర్ థర్మల్ ఇమేజ్‌ను కనుగొన్నట్టు ఇస్రో చీఫ్ కె.శివన్ ప్రకటించారు. సెప్టెంబర్ 7వ తేదీ తెల్లవారుజామున 1.40 గంటల సమయంలో చందమామ మీద లాండింగ్ చేస్తున్న సమయంలో విక్రమ్ లాండర్‌తో ఇస్రోకు సంబంధాలు తెగిపోయాయి. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఆ సంబంధాలు తెగిపోయినట్టు ఇస్రో తెలిపింది. అప్పటి నుంచి అది ఎక్కడ ఉందో ఆచూకీ తెలియలేదు. అయితే, చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్.. విక్రమ్ లాండర్‌ను గుర్తించింది విక్రమ్ లాండర్‌తో సంబంధాలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. విక్రమ్ లాండర్‌తో మళ్లీ లింక్ కావడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే దీన్ని సాధిస్తామని కె.శివన్ ప్రకటించారు. చంద్రయాన్-2 మాకు స్ఫూర్తిగా నిలుస్తుందని నాసా ఈ రోజొక ప్రకటనలో పేర్కొంది. గతంలో ఎవరూ సాహసించని విధంగా చంద్రుడి దక్షిణ దృవంపై పరిశోధనలు చేయాలన్న కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని దాదాపుగా ఛేదించిన ఇస్రోను అభినందిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొంది. సౌర గ్రహంపై పరిశోధనలకు కలిసి సాగేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిద్దామని పేర్కొంది
previous post
next post